news18-telugu
Updated: November 13, 2020, 11:18 AM IST
తాజ్ మోటల్‌పై ఉగ్రదాడి(ఫైల్ ఫొటో)
ముంబై ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టుల జాబితాను పాకిస్తాన్ విడుదల చేసింది. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాంటీ టెర్రరిజమ్ విభాగం గురువారం 1,210 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసింది. అందులో ముంబై ఉగ్రదాడితో సంబంధం ఉన్న టెర్రరిస్టుల పేర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ముంబై దాడులతో సంబంధం ఉన్న 19 మంది పేర్లను పాకిస్తాన్ ఆ జాబితాలో పేర్కొంది. ఉగ్రవాదులు ముంబై చేరుకోవడానికి.. లైఫ్ జాకెట్లు, పడవలను కొనుగోలు చేసినవారి పేర్లతోపాటు పడవ సిబ్బంది పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే ఆ జాబితాలో ఇఫ్తీకర్ అలీ, మహ్మద్ అంజాద్ ఖాన్, మహ్మద్ ఉస్మాన్, అబ్దుల్ రెహమాన్‌తో పాటుగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నారు.
ఇన్నాళ్లు ముంబై ఉగ్రదాడితో సంబంధం లేదని బుకాయించిన పాకిస్తాన్.. ఎట్టకేలకు దిగి వచ్చింది. ఈ ఉగ్రదాడితో సంబంధం ఉన్నవారిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చడం ద్వారా పాక్ తన తప్పును అంగీకరించినట్టయింది. అయితే ఇక్కడ కూడా పాక్ తన వక్రబుద్దిని ప్రదర్శించింది. ఇదే విషయాన్ని భారత విదేశాంగ శాఖ ప్రస్తావించింది. పాక్ తీరును ఎండగడుతూ విమర్శలు చేసింది. పాక్ ఉద్దేశపూర్వకంగానే ముంబై ఉగ్రదాడుల ముఖ్య సూత్రధారుల పేర్లను వదిలేసిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు. ముంబై ఉగ్రదాడులకు సంబంధించిన పూర్తి సమచారం పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద ఉందన్నారు.. ఆ ఉగ్రదాడికి పాక్ భూభాగం నుంచే ప్రణాళికలు జరిగాయనేది అందరికి తెలిసిన వాస్తవం అని చెప్పారు. ఉగ్రవాదుల జాబితాను వెల్లడించడంలో పాక్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఇక, కరాచీ నుంచి సముద్రమార్గంలో ముంబై చేరుకున్న ఉగ్రమూకలు.. 2008 నవంబర్ 26న ముంబైలో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్, తాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్, జెవిష్ సెంటర్లలో ఉగ్రమూకలు దాడులకు దిగాయి. ఈ దాడుల్లో దాదాపు 166 మంది మరణించగా, అందులో 28 మంది విదేశీయులు ఉన్నారు. ఈ ఉగ్రదాడిలో మరణించినవారిలో పోలీసులు కూడా ఉన్నారు.
Published by:
Sumanth Kanukula
First published:
November 13, 2020, 11:18 AM IST