Putin praises PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)ప్రశంసల జల్లు కురిపించారు. మాస్కోలో గురువారం జరిగిన వాల్డాయ్ డిస్కషన్ క్లబ్(Valdai Discussion Club)కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్.. అనేక అంశాలపై స్పందించారు. మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తుండటం ప్రశంసనీయమని పుతిన్ తెలిపారు. తన దేశం కోసం, ప్రజల కోసం స్వతంత్రంగా విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్న కొద్ది మంది ప్రపంచ నేతల్లో మోదీ ఒకరని... ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన లక్ష్య సాధనలో ఆయన ముందుకెళ్తున్నారని పుతిన్ తెలిపారు. నరేంద్ర మోదీ నిజమైన దేశభక్తుడు అని ప్రశంసించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ లో ఎంతో కృషి జరుగుతోందన్నారు. బ్రిటీష్ కాలనీ నుండి ఆధునిక దేశంగా అభివృద్ధి చెందడంలో భారత్ విపరీతమైన పురోగతిని సాధించిందని అన్నారు. 150 కోట్ల మంది ప్రజలు, స్పష్టమైన అభివృద్ధి ఫలాలు భారత దేశాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, మెచ్చుకోవడానికి కారణాలని వివరించారు.
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న "మేక్ ఇన్ ఇండియా" సిద్ధాంతం అటు ఆర్థికపరంగా, ఇటు నైతిక విలువల పరంగా చాలా ముఖ్యమైనదని తెలిపారు. భారత్ లాంటి దేశాలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అంతేకాకుండాప్రపంచ రాజకీయాల్లో ఇండియా కీలకపాత్ర పోషిస్తుందని పుతిన్ తెలిపారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత దేశం అనే వాస్తవం గర్వకారణం అని తెలిపారు. ఇక,భారత్, రష్యా మధ్య సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని పుతిన్ తెలిపారు. అనేక దశాబ్దాల నుంచి సన్నిహిత మైత్రీ సంబంధాల బలమైన పునాదులు ఉన్నాయన్నారు. భారత్ తో తమకు ఎలాంటి సమస్యా లేదని.. అన్ని విషయాల్లో రష్యా-భారత్ పరస్పరం సహకరించుకుంటున్నట్లు పుతిన్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగుతుందని చెప్పారు.
Dangerous Road Video : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రహదారి ఇదే
భారత దేశ వ్యవసాయ రంగానికి చాలా ముఖ్యమైన ఎరువుల సరఫరాను పెంచాలని మోదీ తనను కోరారని పుతిన్ చెప్పారు. ప్రధాని మోదీ కోరినట్లుగా ఇండియాకు ఎరువుల సరఫరాను కూడా పెంచినట్లు తెలిపారు. ఇది ఇండియాలో వ్యవసాయ రంగ ప్రగతికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం ఇండియాకు 7.6 రెట్లు అదనంగా ఎరువులు అందిస్తున్నట్లు పుతిన్ తెలిపారు. మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా అణుబాంబు ప్రయోగించే అవకాశాలు ఉన్నాయనే అంశంపై కూడా పుతిన్ స్పందిస్తూ...అణ్వాస్త్రాలను వాడే ఉద్దేశం రష్యాకు లేదని స్పష్టం చేశారు. ప్రపంచంపై ఆధిపత్యం చలాయించాలనే లక్ష్యంతో పాశ్చాత్య దేశాలు డర్టీ గేమ్స్ ఆడుతున్నాయని,అమెరికా, దాని మిత్ర దేశాల చర్యల వల్ల ఎదురయ్యే పర్యవసానాలు నుంచి ఆ దేశాలే సురక్షితంగా ఉండలేవని పుతిన్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Pm modi, Russia, Vladimir Putin