INDIA BORN AISHA SHAH BAGS SENIOR POSITION IN JOE BIDEN TEAM MS
Joe Biden Digital Team: జో బైడెన్ డిజిటల్ టీంలో కీలక పోస్టులోకి భారతీయ సంతతి మహిళ
ఈషా షా (ఫైల్)
ఇప్పటికే బైడెన్ (Joe biden) తన బృందంలో పలువురు భారతీయ సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. కమలా హారిస్ (kamala harris) ను ఉపాధ్యక్షురాలిగా.. నీరా టాండన్ (neera tandon) ను బడ్జెట్ చీఫ్ గా ఉండగా... ఈ జాబితాలో ఈషా షా (aishah shah) కూడా చేరడం విశేషం.
త్వరలో యూఎస్ అధ్యక్ష పీఠం అధిరోహించనున్న జో బైడెన్.. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ చక చక పూర్తి చేసుకుంటున్నారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే వైట్ హౌస్ లో తనతో కలిసి పనిచేయబోయే టీంను సిద్ధం చేస్తున్నారు. ఇందులో కీలక బాధ్యతలలో భారత సంతతి అమెరికన్లే ఉండటం గమనార్హం. తాజాగా ఆయన ప్రకటించిన డిజిటల్ టీం లో కూడా కాశ్మీర్ కు చెందిన ఈషా షా కు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. ఆమె నియామకానికి సంబంధించి.. బైడెన్ ఆఫీసు నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ టీంను స్వయంగా ఆయనే ప్రకటించారు.
కాశ్మీర్ కు చెందిన ఈషా షా.. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ భాగస్వామి మేనేజర్ గా వ్యవహరించనున్నారు. డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ గా రాబ్ ప్లాహెర్టీ నేతృత్వం వహిస్తున్న ఈ టీంలో.. ఈషా షా కు కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ప్రస్తుతం ఆమె స్మిత్సోనియన్ ఇన్ట్సిట్యూషన్ అడ్వాన్స్మెంట్ స్పెషలిస్ట్ గా పని చేస్తున్నారు. అంతకుముందు.. జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కార్పోరేట్ ఫండ్ లో అసిస్టెంట్ మేనేజర్ గా, ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సంస్థ బ్యూరో కమ్యూనికేషన్ స్పెషలిస్టుగా సేవలందించారు. లూసియానాలో పెరిగిన ఈషా.. బైడెన్-కమలా హారిస్ ఎన్నికలప్రచారంలో డిజిటల్ భాగస్వామ్య నిర్వాహకురాలిగా విధులు నిర్వర్తించారు.
డిజిటల్ టీం ఎంపికపై బైడెన్ స్పందిస్తూ.. ‘నేను నియమించిన విభిన్న నిపుణుల బృందం డిజిటల్ రంగంలో విస్తృతమైన అనుభవాన్ని కలిగిఉన్నది. ఈ టీం వైట్ హౌస్ ను అమెరికన్ ప్రజలకు సరికొత్త, వినూత్న మార్గాల్లో అనుసంధానించడానికి సహాయపడుతుంది. ఈ టీంలోని సభ్యులు.. యూఎస్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతారనే నమ్మకం నాకుంది..’ అని తెలిపారు.
ఇప్పటికే బైడెన్ తన బృందంలో పలువురు భారతీయ సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. కమలా హారిస్ ను ఉపాధ్యక్షురాలిగా.. నీరా టాండన్ ను బడ్జెట్ చీఫ్ గా, వేదాంత్ పటేల్ ను వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రెటరీగా, వినయ్ రెడ్డిని స్పీచ్ రైటింగ్ డైరెక్టర్ గా నియమించారు. ఈ జాబితాలో ఈషా షా కూడా చేరడం విశేషం.