ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాల పట్ల ఆందోళన చెందుతుంటే.. జపాన్ మాత్రం నిత్యం చోటు చేసుకుంటున్న తమ ప్రజలు ఆత్మహత్యల పట్ల ఆందోళన చెందుతోంది. అక్కడ కరోనా మృతుల కంటే ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా వచ్చి ఆత్మహత్యల రేటును మరింత పెంచడం జపాన్ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. అందులోనూ ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో ఎక్కువగా మహిళలు ఉండటంతో జపాన్ ప్రభుత్వం మరింత కలవరపడుతోంది.జపాన్ ప్రజలు ఎంత కష్టపడతారో అందరికి తెలిసు. పొద్దున లేచింది మొదలు.. అర్ధరాత్రి వరకు విధులు నిర్వహిస్తుంటారు. ఉద్యోగాన్ని నిలుపుకోవాలనే తాపత్రయం.. ఎక్కువ పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ.. వెరసి వారి జీవితమంతా ఉద్యోగంతోనే గడిచిపోతోంది. దీంతో తీవ్ర ఒతిళ్లకు గురవుతున్నారు. వాటిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
జపాన్ వ్యాప్తంగా అక్టోబర్ లో 2,158 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి జాతీయ పోలీస్ ఏజెన్సీ వెల్లడించింది. వారిలో 20 శాతం మంది పురుషులు ఆత్మహత్య చేసుకున్నారు. అత్యధికంగా 80 శాతం మంది మహిళలు బలవన్మరణానికి పాల్పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మహిళల్లో ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువ మంది 40 ఏళ్ల లోపు వారి ఉండటంతో అక్కడి ప్రభుత్వం టెన్షన్ పడుతోంది.
గతేడాది సెప్టెంబర్ నెలలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్యతో పోలిస్తే ఈ అక్టోబర్ లో మృతుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే అత్యధిక ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయి ఆందోళన చెందుతున్నవారు.. కరోనా సోకడంతో కుటుంబం, స్నేహితులు దూరం పెడుతుండటంతో మనస్తాపానికి గురైనవారు ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయ్. ప్రస్తుతం ఆత్మహత్యల సంఖ్య కరోనా మరణాల కంటే ఎక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి.. హెల్ప్ లైన్ నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచింది.