హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Imran Khan: అమెరికా మమ్మల్ని పావులా వాడుకుంది.. ఇమ్రాన్ ఖాన్ విమర్శలు.. అందులో మాత్రం ఇండియాకే ప్రాధాన్యత..

Imran Khan: అమెరికా మమ్మల్ని పావులా వాడుకుంది.. ఇమ్రాన్ ఖాన్ విమర్శలు.. అందులో మాత్రం ఇండియాకే ప్రాధాన్యత..

ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

అమెరికాపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను తొలగించడానికే అమెరికా పాకిస్తాన్‌ను ఉపయోగించుకుందని విమర్శించారు.

అమెరికాపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను తొలగించడానికే అమెరికా పాకిస్తాన్‌ను ఉపయోగించుకుందని విమర్శించారు. అయితే వ్యుహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు విషయంలో మాత్రం భారత్‌కు ప్రాథాన్యత ఇస్తుందని అన్నారు. బుధవారం రాత్రి విదేశీ మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా Dawn న్యూస్ వెల్లడించింది. ‘భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికన్లు నిర్ణయించుకున్నారని నేను అనుకుంటున్నాను. బహుశా అందుకే పాకిస్తాన్‌ని విభిన్నంగా పరిగణిస్తున్నారు. అఫ్గాన్ గందరగోళాన్ని పరిష్కరించే సందర్భంలో మాత్రమే పాకిస్తాన్ ఉపయోగకరంగా పరిగణించబడుతుంది’అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

అంతేకాకుండా చైనాతో పాకిస్తాన్ సాన్నిహిత్యం కూడా అమెరికా వైఖరిలో మార్పునకు కారణం అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇక, అఫ్గాన్‌ అధ్యక్షుడిగా అష్రాఫ్‌ ఘనీ ఉన్నంత కాలం ప్రభుత్వంతో తాలిబన్లు చర్చలు జరపరని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గాన్ సమస్యకు రాజకీయ పరిష్కారం కష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఇక, ‘మూడు నాలుగు నెలల క్రితం తాలిబన్లు ఇక్కడికి వచ్చినప్పుడు.. నేను వారిని ఒప్పించడానికి ప్రయత్నించాను’అని ఇమ్రాన్ ఖాన్ అన్నట్టుగా The News International డైలీ పేర్కొంది.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఇమ్రాన్‌ ఖాన్‌కు ఫోన్ చేయకపోవడంపై పాకిస్తాన్ తీవ్ర అసంతృప్తితో ఉంది. అఫ్గాన్‌ వంటి కొన్ని ముఖ్యమైన అంశాల్లో పాకిస్థాన్‌ను కీలక దేశంగా పరిగణించినప్పటికీ తమ ప్రభుత్వంతో మాత్రం బైడెన్‌ మాట్లాడకపోవడంపై పాకిస్థాన్‌ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్‌ యూసుఫ్‌ ఇటీవల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడి నుంచి ఫోన్ కాల్ కోసం తాను వేచి చూడటం లేదని ఇమ్రాన్ ఖాన్ ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

ఇక, అమెరికా దళాలు అఫ్గానిస్తాన్ నుంచి పెద్ద సంఖ్యలో వైదొలగడం ప్రారంభించిన వెంటనే.. తాలిబాన్‌లు అఫ్గాన్ దళాలపై తమ దాడిని పెంచారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే తాలిబన్లు చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబాన్ ప్రజలను దోచుకోవడం, పౌరులను చంపడం వంటి చర్యలకు పాల్పడటం వల్ల అఫ్గాన్‌లో పరిస్థితి దారుణంగా మారుతున్నాయి.

First published:

Tags: Afghanistan, Imran khan, India, USA

ఉత్తమ కథలు