చంద్రుడి(Moon)పై మానవులకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించే పరిశోధనలు చాలా కాలంగా జరుగుతున్నాయి. తాజాగా చంద్రుడిపై ఉన్న గుంతలలో ఉష్ణోగ్రత(Temperature)లు మానవులు ఉండేందుకు అనుకూలంగా ఉన్నాయని నాసా (NASA) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నాసాకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO-Lunar Reconnaissance Orbiter) స్పేస్‌క్రాఫ్ట్ అండ్ కంప్యూటర్ మోడలింగ్ నుంచి డేటాను విశ్లేషించే శాస్త్రవేత్తలు చంద్రునిపై గుంతల లోపల షేడెడ్ స్థానాలను కనుగొన్నారు. ఇవి 17 డిగ్రీల సెల్సియస్‌తో మానవులకు అనుకూలంగా ఉంటాయని తెలిపారు.
గుంతలలో స్థిరంగా ఉష్ణోగ్రతలు
చంద్రుని ఉపరితలంపై ఉన్న ప్రాంతాలతో పోలిస్తే గుంతలు, గుహలలో ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఆ ప్రాంతాలలో పగటిపూట 127 సెల్సియస్ వరకు వాతావరణం వేడెక్కుతుంది. రాత్రి వేళల్లో మైనస్ 173 సెల్సియస్ వరకు చల్లబడుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
అంతరిక్షంలో తెలియని వాటిని అన్వేషించడం, అర్థం చేసుకోవడం కోసం నాసా ఈ పరిశోధనలు జరుపుతోంది. మానవాళికి స్ఫూర్తి, ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా నాసా చంద్రునిపై అన్వేషణలు కొనసాగిస్తోంది. 2009లో శాస్త్రవేత్తలు మొదటిసారి చంద్రునిపై గుంటలు గుర్తించారు. అప్పటి నుంచి అవి మానవులకు ఆశ్రయాలుగా మారుతాయా, మానవాళికి సౌకర్యవంతంగా ఉంటాయా అని పరిశోధిస్తున్నారు. గుంతలు లేదా గుహలు కాస్మిక్ కిరణాలు, సోలార్ రేడియేషన్, మైక్రోమీటోరైట్‌ల నుంచి కొంత రక్షణను కూడా అందిస్తాయి.
లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్లానెటరీ సైన్స్‌లో డాక్టరల్ స్టూడెంట్ టైలర్ హోర్వత్ మాట్లాడుతూ, 200 కంటే ఎక్కువ గుంటలలో దాదాపు 16 లావా ట్యూబ్‌లు కూలిపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన కొత్త పరిశోధనకు ఆయన నాయకత్వం వహించాడు. చంద్రుని ఉపరితలంపై గుంతలు అనేవి మరింత అన్వేషించాలని అనువైన ప్రాంతాలని LRO ప్రాజెక్ట్ సైంటిస్ట్ నోహ్ పెట్రో చెప్పారు. గుంతలలోని ఉష్ణోగ్రత ఉపరితలంపై ఉన్న ప్రాంతాల్లో వేరుగా ఉందా, లేదా అనేది తెలుసుకోవడానికి హోర్వత్ థర్మల్ కెమెరా డివైనర్ నుంచి డేటాను ప్రాసెస్ చేశారు.
మేర్ ట్రాంక్విల్లిటాటిస్‌పై దృష్టి
మేర్ ట్రాంక్విల్లిటాటిస్ అని పిలిచే చంద్రుని ప్రాంతంలో ఫుట్‌బాల్ మైదానం పొడవు, వెడల్పు ఉన్న స్థూపాకార, సుమారు 100-మీటర్ల లోతైన ప్రాంతంపై దృష్టి పెట్టారు. రాళ్లు, చంద్రుని ఉష్ణ లక్షణాలను విశ్లేషించడానికి, దుమ్ము, కాలక్రమేణా పిట్ ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి కంప్యూటర్ మోడలింగ్‌ను హోర్వత్, అతని సహచరులు ఉపయోగించారు.
చంద్రునిపై గుంతలలో నీడ ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు రోజు మొత్తంలో కొద్దిగా హెచ్చుతగ్గులకు గురవుతాయని ఫలితాలు వెల్లడించాయి. దాదాపు 17 సెల్సియస్ వద్ద స్థిరంగా ఉంటాయని పేర్కొన్నాయి. పిట్ దిగువ నుంచి ఒక గుహ విస్తరించి ఉంటే, అది కూడా ఈ సాపేక్షంగా సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందని LROకి చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ కెమెరా ద్వారా తీసిన చిత్రాల ద్వారా తెలుస్తోంది. 2009 జూన్ 18న ప్రారంభమైన LRO తన ఏడు శక్తివంతమైన ఇన్‌స్ట్రూమెంట్స్‌తో చంద్రుని గురించి అమూల్యమైన వివరాలను అందించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High temperature, Lunar Eclipse, Moon, NASA, Space