హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Sri Lanka Crisis: తీవ్ర సంక్షోభంలో శ్రీలంక.. ఫుడ్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే..

Sri Lanka Crisis: తీవ్ర సంక్షోభంలో శ్రీలంక.. ఫుడ్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే..

Photo Credit : AFP

Photo Credit : AFP

కోవిడ్-19 థర్డ్ వేవ్, వెంట వెంటనే లాక్‌డౌన్స్ విధించాల్సి రావడం.. శ్రీలంకను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టాయి. ఆ దేశంలోని విదేశీ నిల్వలు ఆందోళనకరమైన స్థాయిలో క్షీణిస్తున్నాయి.

(DP SATISH, News18)

శిరానీ సేననాయకే(Shirani Senanayake) తన కూతురు చదువు కోసం USAకి డబ్బు పంపడానికి ప్రయత్నిస్తోంది. ఆమె ఏకైక కుమార్తె న్యూయార్క్‌లో ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేస్తోంది. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఆమెకు ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉంది. కానీ, ఆమె తల్లి కొలంబోలోని తన బ్యాంక్ నుంచి 3000 US డాలర్లను కూతురికి పంపలేకపోయింది. చాలా పెద్ద క్యూ ఉన్నందున బ్యాంక్ ఆమెను వెయిట్‌లిస్ట్‌లో ఉంచింది. దీంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతుంది. దూరదేశంలో ఉన్న తన కుమార్తె చదువుకు అంతరాయం కలగకుండా చూసుకోవడానికి డబ్బు పంపడానికి అనధికారిక మార్గాల వెతకడం తప్ప.. ఇప్పుడు తనకు వేరే మార్గం లేదని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది శిరానీ సేననాయకే ఒక్కరి పరిస్థితే కాదు. శ్రీలంకలోని(Sri Lanka) దాదాపు ప్రతి బ్యాంకు విదేశీ కరెన్సీల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విదేశాలకు పంపే నగదుపై పరిమితిని విధించింది. ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు అత్యవసర అవసరాల(Emergency Needs) కోసం విలువైన US డాలర్లను పొందాలని ఆశిస్తూ బ్యాంకులను సందర్శిస్తున్నారు.

ఇక, శ్రీలంక (Sri Lanka)లో ఆహార కొరత (Food Crisis) తాండవిస్తున్న సంగతి తెలిసిందే. సమస్య తీవ్రత నానాటికీ పెరుగుతోంది. కోవిడ్-19 థర్డ్ వేవ్, వెంట వెంటనే లాక్‌డౌన్స్ విధించాల్సి రావడం.. శ్రీలంకను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టాయి. ఆ దేశంలోని విదేశీ నిల్వలు ఆందోళనకరమైన స్థాయిలో క్షీణిస్తున్నాయి. నగదు ఔట్ ఫ్లో‌తో పోల్చినప్పుడు.. ఇన్ ఫ్లో చాలా చిన్నదిగా ఉంది.

ఇక, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి గోటబాయ రాజపక్స( Gotabaya Rajapaksa) ప్రభుత్వం ఆహార అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టింది. మోటారు వాహనాలు, ఖరీదైన టైర్లు, ఫ్లోరింగ్ టైల్స్, ఫర్నిచర్, గాడ్జెట్లు, కొన్ని నిర్మాణ సామగ్రి వంటి అనవసర వస్తువుల దిగుమతులపై నిషేధం విధించడం, తీవ్రమైన ఆంక్షలు విధించడం వంటి చర్యలు చేపట్టింది.

ఒక్కసారిగా మారిన పరిస్థితులు..

అయితే ఇంతకు ముందు శ్రీలంక చాలా మెరుగైన స్థితిలో ఉన్న దేశమనే చెప్పాలి.. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ (World Bank)ప్రకారం శ్రీలంక ఒక్కటే దక్షిణాసియా నుంచి Upper Middle Income Group చోటు దక్కించుకుంది. అంతేకాకుండా 100 శాతం అక్షరాస్యత ఉంది. ఇతర ప్రాంతాలతో పోల్చితే.. మానవ సూచిలలో అగ్రస్థానంలో ఉంది. 2020 జనవరి వరకు శ్రీలంక భవిష్యత్తు చూడటానికి బాగానే కనిపించింది. అయితే ఆ తర్వాత కోవిడ్ ఆ దేశంలో పెను విధ్వంసం సృష్టించిందనే చెప్పాలి. ఆ చిన్న దేశంలోని సాధారణ ప్రజల జీవితాలను రాత్రికి రాత్రే తలకిందులు చేసింది.

కోవిడ్ థర్డ్ వేడ్ విలయం..

కోవిడ్-19 ఫస్ట్‌ వేవ్‌ను శ్రీలంక చాలా చక్కగా నియంత్రించినప్పటికీ.. సెకండ్ వేవ్, థర్డ్‌ వేవ్‌లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సెకండ్, థర్డ్ వేవ్‌లు దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక జీవితంపై పెను ప్రభావం చూపాయి. డేల్టా వేరియంట్ కారణంగా చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ జాబితాలో మాజీ విదేశాంగ, ఆర్థిక మంత్రి మంగళ సమరవీర (Mangala Samaraweera) కూడా ఉన్నారు.

22 మిలియన్ల జనాభా కలిగిన శ్రీలంక.. ఎక్కువగా దిగుమతులపై ఆధారపడి ఉంది. పెద్ద మొత్తంలో ఆహార ఉత్పత్తులు, ఇతర నిత్యావసరాలను శ్రీలంక.. భారతదేశంతో సహా పొరుగు దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. శ్రీలంకలో ఎక్కువ తయారీ పరిశ్రమలు లేవు.

కుప్పకూలిన పర్యాటక రంగం..

ఇక, శ్రీలంక ప్రపంచంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సంవత్సరానికి 2 మిలియన్లకు పైగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. దేశ GDPకి పర్యాటక రంగం యొక్క సహకారం 5 శాతం సమకూరుతుంది. ప్రతి ఏడాది 30 లక్షల మందికి పని కల్పించడంతో పాటు 4 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించి పెడుతుంది. కరోనాతో ప్రస్తుతం పర్యాటక రంగం పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ పరిస్థితి నుంచి తమను రక్షించే అద్భుతం కోసం అక్కడ పర్యాటక రంగంపై ఆధారపడి వ్యాపారం సాగిస్తున్న వారు ఎదురుచూస్తున్నారు.

‘ఇదే పరిస్థితి మరో ఆరు నెలలు కొనసాగితే.. 50 శాతానికి పైగా పర్యాటక పరిశ్రమ శాశ్వతంగా మూతపడి లక్షలాది మందిని నిరుద్యోగులుగా చేస్తుంది. ఇది ఊహించుకోవడానికే చాలా భయానకమైన దృశ్యం. ప్రస్తుతం డబ్బు ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది’ అని కొలంబోకు చెందిన ప్రముఖ హోటల్ యజమాని ఒకరు అన్నారు.

శ్రీలంక ఎగుమతులు..

టీ, దాల్చినచెక్క, సుగంధ ద్రవ్యాలు, సముద్ర ఆహార ఉత్పత్తులు, రత్నాలు, వస్త్రాలను పశ్చిమ దేశాలకు శ్రీలంక ఎగుమతి చేస్తుంది. వీటి ద్వారా ప్రతి సంవత్సరం ఆరు బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీలను ఆర్జిస్తోంది. అయితే కోవిడ్ 19 లాక్‌డౌన్, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల శక్తి తగ్గుదల సెంటిమెంట్ కారణంగా ఈ ఉత్పత్తులకు కూడా తక్కువ డిమాండ్ ఏర్పడింది. ఇలా కోవిడ్-19 ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపెట్టింది.

ద్వీప దేశం శ్రీలంకకు.. ప్రవాసులు(విదేశాల్లో ఉన్న ఆ దేశ ప్రజలు) మరొక ప్రధాన ఆదాయ వనరు. అరబ్ దేశాలతో పాటు, పశ్చిమ దేశాలలోని ఉన్న ప్రవాసులు ప్రతి సంవత్సరం దాదాపు 1.5 బిలియన్ యుఎస్ డాలర్లను శ్రీలంక ఉన్నవారికి పంపుతారు. కరోనా మహమ్మారి ఈ చెల్లింపులపై కూడా ప్రభావం చూపింది. ఈ సంవత్సరం ఇది కనీసం 25% తగ్గినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న అపారమైన సంక్షోభాన్ని అధిగమించడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక (CBSL) భారతదేశం, చైనా మరియు బంగ్లాదేశ్‌లతో కరెన్సీ మార్పిడి , లైన్ ఆఫ్ క్రెడిట్(line of credit)కు శ్రీకారం చుట్టింది.

ఫుడ్  ఎమర్జెన్సీ..

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఫుడ్ ఎమర్జెన్సీ విధించడంతో.. ఇది బ్లాక్-మార్కెట్‌కు తలుపులు తెరవడానికి దోహదపడింది. దీంతో సాధారణ ప్రజల పరిస్థితి మరింత దిగజారే స్థితికి చేరింది.

‘మేము సొలార్ వ్యాపారంలో(Solar business) ఉన్నాము. మేము చైనా, ఇతర దేశాల నుండి ప్యానెల్‌లను దిగుమతి చేసుకుంటాము. కరెన్సీ సంక్షోభం కారణంగా మేము విదేశీ బ్యాంకులకు డబ్బు పంపలేము. మా వ్యాపారం చాలా ప్రభావితం అయింది. మేము ఇప్పుడు విదేశీ ఖాతాల నుండి డబ్బు పంపే ఎంపికలను అన్వేషిస్తున్నాము. ప్రస్తుతం ఇక్కడ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి’ అని ఓ వ్యాపారి చెప్పాడు.

ఇక, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక (CBSL) విదేశీ కరెన్సీలను నిర్వహించడానికి సంబంధిత బ్యాంకులకు అధికారం ఇచ్చింది. అయితే మార్పిడి రేటు అనేది ఒక్కో బ్యాంక్‌కు ఒక్కో విధంగా ఉంది. యూఎస్ డాలర్ శుక్రవారం LKR(శ్రీలంకన్ రూపీ) 230 వద్ద అమ్ముడవుతోంది మరియు భారత రూపాయి LKR(Sri Lankan rupee) 3 వద్ద అమ్ముడవుతోంది. ‘CBSL తన ప్రాథమిక బాధ్యతలను వదిలిపెట్టినట్లు కనిపిస్తోంది. బ్యాంకులు ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వలె పనిచేస్తున్నాయి. ఇది నిజంగా దిగ్భ్రాంతికరం’ అని ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి చెప్పారు.

రోజువారీ కష్టాలు ఉన్నప్పటికీ.. శ్రీలంక ప్రజలు ఇప్పటికీ చాలా నమ్మకంతో, ఆశతో ఉన్నారు. ఇది వారి దేశానికి తాత్కాలిక ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు. ‘మాది ఒక స్థితిస్థాపకమైన సమాజం. మేము గతంలో చాలా దారుణమైన పరిస్థితులను చూశాం. 1970వ దశకంలో, మేము తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్నాము. మార్క్సిస్ట్ జెవీపీ హింసాత్మక ఉద్యమం. ఆ తర్వాత 30 సంవత్సరాల క్రూరమైన అంతర్యుద్ధం.. అందులో లక్ష మందికి పైగా మరణించారు. 2004 లో విధ్వంసకర సునామీ మరియు ఇటీవల ఈస్టర్ పండగ రోజున బాంబు దాడులు. ప్రతి సంక్షోభం తర్వాత మేము మరింత బలంగా తయారయ్యాము. ప్రస్తుత పరిస్థితుల నుంచి త్వరగా కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను. మేము త్వరలో తిరిగి పుంజుకుంటాము’ అని ప్రముఖ పర్యాటక రంగ నిపుణుడు చందన అమరదాస(Chandana Amaradasa) అన్నారు.

First published:

Tags: Covid-19, Food, Sri Lanka

ఉత్తమ కథలు