Hindu Priest in Afghanistan: ‘చావనైనా చస్తాను కానీ... ఈ దేవాలయాన్ని వదిలి వెళ్లను’... తేల్చి చెప్పిన అఫ్గాన్‌ హిందూ పూజారి

Hindu Priest in Afghanistan

పూర్వీకులు వందల ఏళ్ల నుంచి ఈ రత్తన్‌నాథ్‌ దేవాలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారని, తాను కూడా అదే పనిలో కొనసాగాలని నిర్ణయించుకున్నారని రాజేశ్‌ కుమార్‌ అంటున్నారు. ‘దేవాలయంలో పూజలు చేయకుండా వదిలి వెళ్లడానికి మనసు రావడం లేదు. ఒకవేళ తాలిబన్లు నన్ను చంపేస్తే... దానిని సేవగానే భావిస్తాను’ అని చెబుతున్నారు.

  • Share this:
అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో రత్తన్‌నాథ్‌ అనే ఓ దేవాలయం ఉంది. వందలాది సంవత్సరాల నుంచి ఆ దేవాలయ నిర్వహణ, పౌరోహిత్యాన్ని పండిట్‌ రాజేశ్‌ కుమార్‌ కుటుంబీకులు చూసుకుంటున్నారు. ఆయన తండ్రి, తాత, ముత్తాతలు ఆ దేవాలయంలో స్వామివారిని సేవిస్తూ జీవిస్తున్నారు. అయితే తాజాగా అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు మారిపోయాయి. పాలన తిరిగి తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. దీంతో దేశం విడిచి వెళ్లిపోమని చాలామంది స్థానిక హిందువులు పండిట్‌ రాజేశ్‌ కుమార్‌ను కోరుతున్నారు. దీనికి ఆయన నిరాకరిస్తున్నారు. అంతేకాదు ‘తాలిబన్లు తనను చంపితే... తన చావును సేవగా భావిస్తాన’ని చెబుతున్నారు.

అఫ్గానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబన్లు ఇటీవల అధికారం చేజిక్కించుకున్నారు. వాళ్ల కర్కశ పాలన గురించి తెలిసిన వాళ్లు విమానాల మీద ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ మరి విదేశాలకు పారిపోయారు. కొందరైతే చనిపోయారు కూడా. ఈ క్రమంలో హిందూ పూజారి అయిన పండిట్‌ రాజేశ్‌ కుమార్‌ అక్కడ ఉండటం మంచిది కాదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆయన కోరుకుంటే ప్రయాణం, వసతికి అవసరమైన సాయం చేస్తామని ముందుకొస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అఫ్గానిస్థాన్‌లో ఉన్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అయితే తన పూర్వీకులు వందల ఏళ్ల నుంచి ఈ రత్తన్‌నాథ్‌ దేవాలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారని, తాను కూడా అదే పనిలో కొనసాగాలని నిర్ణయించుకున్నారని రాజేశ్‌ కుమార్‌ అంటున్నారు. ‘దేవాలయంలో పూజలు చేయకుండా వదిలి వెళ్లడానికి మనసు రావడం లేదు. ఒకవేళ తాలిబన్లు నన్ను చంపేస్తే... దానిని సేవగానే భావిస్తాను’ అని చెబుతున్నారు. ఈ మేరకు భరద్వాజ్‌ అనే వ్యక్తి ట్వీట్‌ చేశారు. దీంతో ఇప్పుడు ఆ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

మరోవైపు అఫ్గానిస్థాన్‌లో ఉన్న కొద్దిమంది సిక్కు, హిందూ వర్గాల ప్రజలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్చలు చేపడుతోంది. త్వరలో అక్కడ ఉన్న మనవాళ్లు ఇక్కడికి వచ్చేస్తారు. అఫ్గానిస్థాన్‌ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం మిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. స్థానిక గురుద్వారా కమిటీ వివరాల ప్రకారం అఫ్గానిస్థాన్‌లో సుమారు 50 మంది హిందువులు, 270 మంది సిక్కులు ఉన్నారట. వారిని త్వరలోనే దేశానికి తీసుకొచ్చేలా కేంద్రం చర్యలు చేపడుతోందని భారత ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు.
Published by:Krishna Adithya
First published: