The Draconid meteor shower: అక్టోబర్ నెల... ఖగోళ శాస్త్రవేత్తలకు, అంతరిక్ష పరిశోధకులకు, ఫొటోగ్రాఫర్లకు, రోదసీ వీక్షకులకు ఎంతో ఆనందాన్ని పంచుతోంది. ఆకాశంలో జరిగే అద్భుతాల్ని చూడాలనుకునేవారికి ఈ నెల చాలా బాగుంటుంది. అక్టోబర్ 16న సంపూర్ణ చందమామ కనిపిస్తుంది. అక్టోబర్ 31న బ్లూ మూన్ ఏర్పడుతుంది. మార్స్, వీనస్ (శుక్రగ్రహం), యురేనస్ గ్రహాలు... ఒకే లైన్ లోకి వస్తాయి. అలాగే... ఇదే నెలలో మూడు వేర్వేరు ఉల్కాపాతాలు ఏర్పడనున్నాయి. వాటిలో ఒకటి అక్టోబర్ 6 రాత్రి మొదలై... అక్టోబర్ 10 రాత్రి వరకూ కొనసాగనుంది. ముఖ్యంగా అక్టోబర్ 8, 9న పెద్ద సంఖ్యలో ఇవి ఆకాశంలో కనిపిస్తాయి. వీటినే డ్రాకోనిడ్ ఉల్కలు లేదా జియాకోబనిడిస్ అని పిలుస్తున్నారు. ఈ ఐదు రోజుల్లో ఆకాశంలో మేఘాలు లేని రోజున ఈ ఉల్కలను చూసే ఛాన్స్ కొట్టేయండి.
ప్రస్తుతం చందమామ కాంతి తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆకాశం రాత్రి వేళ స్పష్టంగా ఉంటుంది. నక్షత్రాలు, గ్రహాలతోపాటూ... ఉల్కలు కూడా బాగా కనిపిస్తాయి. అరుదైన సందర్భం కాబట్టి... అవి మీకు ఆహ్లాదం కలిగిస్తాయి. డ్రాకోనిడ్ ఉల్కలు సూర్యాస్తమయం తర్వాత నుంచి... చందమామ వచ్చే లోపు బాగా కనిపిస్తాయి. ఐతే... ఈ ఉల్కలను నిద్రపోయే ఉల్కలు అని పిలుస్తారు. ఎందుకంటే... ఇవి గంటకు ఐదారు ఉల్కలు మాత్రమే కనిపిస్తాయి. అంటే... మీరు కనీసం ఓ పది నిమిషాలైనా ఆకాశాన్ని గమనిస్తే... మీకు ఓ ఉల్క కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఒక్కటి కనిపించినా మీరు అదృష్టవంతులే... ఎందుకంటే... అవి ఎక్కడో ఉన్న డ్రాకో (Draco) అనే నక్షత్ర మండలం నుంచి ప్రయాణిస్తూ వస్తున్నాయి. అవి జియాకోబినీ-జిన్నెర్ (Giacobini–Zinner) తోకచుక్క నుంచి వస్తున్నాయి.
1933, 1946లో డ్రాకోనిడ్ ఉల్కలు బాగా కనిపించాయి. అప్పట్లో ప్రతి గంటకూ వేల కొద్దీ ఉల్కలు వెళ్లేవి. 2011లో వాటి సంఖ్య గంటకు 600కు తగ్గింది. నిజానికి ఈ ఉల్కలు భూమిని ఢీకొట్టాలి. కానీ... భూవాతావరణంలోకి రాగానే... అవి కాలి బూడిదైపోతాయి. అందువల్ల మనకు ఏమీ కాదు. ఇప్పుడు ఆ ఉల్కలు ఆకాశంలో ఎటు చూసినా కనిపిస్తాయి. కాకపోతే... మీ చుట్టూ... లైట్లు లేకుండా... చీకటిగా ఉండే ప్రాంతంలోకి వెళ్లి చూస్తే... బాగా కనిపిస్తాయి. మళ్లీ ఈ ఉల్కలను మనం చూడాలంటే... 2025 వరకూ ఆగాలి.
Published by:Krishna Kumar N
First published:October 06, 2020, 08:52 IST