ఆఫ్రికా(Africa)దేశమైన నైజీరియా(Nigeria)ను భారీ వర్షాలు, వరదలు భయపెడుతున్నాయి. గత దశాబ్ధ కాలంగా ఎన్నడూ చూడనంతగా వర్షాలు కురుస్తుండటంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే 603మంది మృతి(603 People died) చెందగా..లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. ఇక తిండి, తిప్పలు లేక 13లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారికి సహాయకచర్యలు చేపడుతోంది అక్కడి ప్రభుత్వం. వర్షాలు, వరదలు నైజీరియాలోని 36 రాష్ట్రాలలో 33 మందిని ప్రభావితం చేసినట్లుగా దేశ మానవతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ(Ministry of Humanitarian Affairs)తెలిపింది.
603మంది మృతి..
భారీ వర్షాలు, వరదలతో నైజీరియాలో అధిక ప్రాణనష్టం సంభవించింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. నైజీరియా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటిక వరకు వర్షాల కారణంగా 603 మంది మృతి చెందారు. వరదలతో రెండు లక్షల ఇళ్లు కొట్టుకుపోయాయి. కాలనీలు నీట మునగడంతో సుమారు 13లక్షల మంది వరకు నిరాశ్రయులైనట్లుగా అక్కడి అధికారులు వెల్లడించారు. ఇక వర్షాలు, వరదలతో దాదాపు 340,000 హెక్టార్లలో పంట పొలాలు ధ్వంసమయ్యాయి. ఇంతటి విపత్తు గడిచిన పదేళ్ల కాలంలో ఎన్నడూ చూడలేదని అధికారులు వెల్లడించారు.
వరద బీభత్సం ..
వర్షాలతో నైజీరియాలో వేలాది మంది జలదిగ్భందంలో చిక్కుకున్నారు. పంటలు, ఇళ్లు కొట్టుకుపోయి చాలా మంది నష్టపోయారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో చాలా మంది అంధకారంలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ వర్షాలు మరో నెల రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో నైజీరియా మంత్రి సదియా ఉమర్ ఫరూఖ్ వరద బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరించారు.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు..
మరోవైపు వర్షాలు, వరదల కారణంగా ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. నైజీరియాకు పొరుగున ఉన్న కామెరూన్‌లోని లాగ్డో డ్యామ్ నుండి అదనపు నీటిని విడుదల చేయడంతో పాటు భారీ వర్షాలు కురవడం వల్లే ఈ సంవత్సరంలో ఇంతటి విపత్తు ఏర్పడిందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇక వర్షాలు, వరదల కారణంగా నైజీరియాలో ఆహార సరఫరా అంతరారాయం అక్కడి వాళ్లను మరింత భయపెడుతోంది. పొరుగున ఉన్న కామెరూన్‌లోని లాగ్డో డ్యామ్ నుండి అదనపు నీటిని విడుదల చేయడం మరియు అసాధారణ వర్షపాతం కారణంగా ఈ సంవత్సరం విపత్తు సంభవించిందని అధికారులు ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Floods, International news, Nigeria