కరీబియన్ దేశమైన హైతీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. శనివారం ఉదయం ఈ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 227 మంది మరణించి ఉంటారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వందలాది మంది గాయపడ్డారని, చాలా మంది ఆచూకీ కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. సెయింట్ లూయిస్-డు-సుడ్కు ఈశాన్యంగా 12 కిలోమీటర్లు దూరంలో భూకంపం సంభవించిందని.. దాని కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని.. చాలా మంది గాయపడి ఉంటారని యూస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది.
భూకంపం దేశంలో పలుచోట్ల తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించింది. ఈ క్రమంలోనే హైతీ ప్రధాన మంత్రి ఏరియల్ హెన్రీ.. అత్యవసర పరిస్థితని ప్రకటించారు. ఇది ఒక నెల రోజుల పాటు కొనసాగనుంది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. చాలా మంది భూకంపం సంభవించడంతో రోడ్లపైకి పరుగులు తీశారని అక్కడి అధికారులు చెబుతున్నారు. శిథిలాలను పూర్తిగా తొలగించడానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు. ఈ ఘటనలో గాయపడిన చాలా మంద్రి ఆస్పత్రుల వద్దకు చేరారు. అయితే చాలా మందికి సరైన వైద్య సదుపాయం అందడం లేదని సమాచారం. ఈ భూకంపం వల్ల గృహాలు, రోడ్లు మరియు మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టం చేకూరి ఉంటుందని అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధి కేటీ విల్కేస్ తెలిపారు.
సహాయక చర్యల నిమిత్తం రెస్క్యూ బృందాలను భూకంప ప్రభావిత ప్రాంతాలకు పంపినట్టు హైతీ పౌర రక్షణ డైరెక్టర్ జెర్రీ చాండ్లర్ తెలిపారు. చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇక, హైతీ ఇటీవల కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఆహార అభద్రత, అధ్యక్షుడు హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోస్ హత్య.. వంటి పలు సంక్షోభాలను చవిచూసింది.
భూకంపంతో అతలాకుతలమైన హైతీకి తక్షణ సహాయానికి అందజేయాలని అమెరికా అధికారులను ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశించారని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు హైతీకి సాయం అందించడానికి పలు లాటిన్ అమెరికా దేశాలు ముందుకొస్తున్నాయి. తక్షణమే అక్కడవారికి మానవత కోణంలో సాయం అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పలు దేశాలు.. హైతీ అధికారులతో మాట్లాడారు.
2010లో సంభవించిన ఓ భారీ భూకంపం హైతీని కుదిపేసింది. ఆ ఘటనలో దాదాపు 2 లక్షలకు పైగానే జనాలు మృతి చెందారు. అంచనా వేయలేని విధంగా భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఇళ్లు, భవనాలు చాలా వరకు కుప్పకూలిపోయాయి. దీంతో కొన్ని వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఆ విషాదం నుంచి కోలుకుంటున్న హైతీ దేశ ప్రజలకు.. శనివారం సంభవించిన భారీ భూకంపం రూపంలో మరోమారు పెను నష్టమే చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.