హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

వారాంతపు సంతలో మనుషుల వేట -43 మందిని కాల్చిచంపిన దుండగులు -కల్లోల Nigeriaలో మరో దారుణం

వారాంతపు సంతలో మనుషుల వేట -43 మందిని కాల్చిచంపిన దుండగులు -కల్లోల Nigeriaలో మరో దారుణం

నైజీరియాలో మరో మారణహోమం

నైజీరియాలో మరో మారణహోమం

ఓ గ్రామంలో వారాంతపు సంతలోకి తుపాకులతో ప్రవేశించిన దుండగుడు కనిపించినవాళ్లను కనిపించినట్లు పాశవికంగా కాల్చి చంపాడు.. రెండు రోజులపాటు సాగిన మారణహోమంలో ఇప్పటికే 43 మంది చనిపోయారు. నైజీరియాలోని కల్లోల సొకోటో రాష్ట్రంలో జరిగిందీ సంఘటన..

ఇంకా చదవండి ...

ఆఫ్రికా ఖండంలోని నైజీరియాలో మరోసారి రక్తపాతం జరిగింది. దేశం ఉత్తర భాగంలోని సొకోటో రాష్ట్రంలోని గోరోన్యో ప్రాంతంలో సాయుధ దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో కనీసం 43 మంది చనిపోయారు. ఆదివారం సంతలో మొదలైన ఈ కాల్పులు సోమవారం ఉదయం వరకు కొనసాగాయని సొకోటో రాష్ట్ర గవర్నర్‌ అమినూ వజీరి టంబూవాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

వాయువ్య నైజీరియాలో గత ఏడాది కాలంగా జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో తుపాకీలు ధరించిన వ్యక్తులు పదుల సంఖ్యలో జనాలను చంపేశారు. వందల సంఖ్యలో జనాలను కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. ఈ సంక్షోభం నుంచి బయటి పడేందుకు అక్కడి ప్రభుత్వం కమ్యూనికేషన్‌ వ్యవస్థను నిలుపుదల చేయడం, సైనిక చర్యలు, పోలీసు గస్తీని పెంచడం వంటి చర్యలు చేపడుతోంది.

మరో వైపు గోరోన్యూ జనరల్‌ ఆస్పత్రి మార్చురీలో 60 శవాలను తాను చూశానని, గాయాల బారిన పడిన అనేక మంది అక్కడ ఉన్నారని స్థానిక వ్యాపారి ఒకరు తెలిపారు. వ్యాపారులు, కొనుగోలుదారులతో మార్కెట్‌ కిటకిటలాడుతున్న సమయంలో సాయుధులు వచ్చి కల్లోల్లం సృష్టించారని తెలిపాడు.


నాలుగు దిక్కుల్లో నిల్చొని వాళ్లు మార్కెట్‌లో కనిపించిన ప్రతి ఒక్కరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులను వారు తిప్పికొట్టారని తెలిపాడు. ఈ ఘటనపై పోలీసుల నుంచి తక్షణ స్పందన రాలేదు. ఈ సాయుధులంతా ఒక బందిపోటు ముఠాకు చెందినవారిగా అనుమానిస్తున్నారు.

సైనిక చర్యలను బలోపేతం చేసే క్రమంలో జంఫారా రాష్ట్రంలో ఇంటర్నెట్‌, టెలిఫోన్‌ సేవలను సెప్టెంబర్‌లో అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది. ఆ తర్వాత దీన్ని కట్సినా, సోకోటో, కడునా రాష్ట్రాలకు విస్తరించింది. బందిపోట్లను కట్టడి చేసేందుకు టెలికాం సేవల నిలుపుదల ప్రయోజనకరంగా ఉందని నైజీరియా సైనికాధికారి ఒకరు తెలిపారు. కానీ కమ్యూనికేషన్ సేవల నిలుపుదల కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టంగా మారిందని అన్నారు. అంతే కాదు ఈ కారణంగా లక్షలాది జీవితాలు వ్యాపారాలు అల్లకల్లోలమయ్యాయని వివరించారు.

మరో వైపు సోకోటో రాష్ట్రానికి మరిన్ని భద్రతా బలగాలు పంపించాలని, అలాగే సదుపాయాలు మెరుగుపరచాలని గవర్నర్‌ టంబూవాల్‌ కోరారు. బందిపోట్ల ఆగడాలు, కాల్పులు, కిడ్నాపులు భరించలేక వాయువ్య నైజీరియా నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వలస వెళ్లిపోతున్నారు. గతేడాది జనవరి నుంచి 50 వేల మంది పారిపోయి ఉంటారని ఇంటర్నరేషన్‌ ఆర్గనైజేష్‌ ఫర్‌ మైగ్రేషన్‌ తెలిపింది. గడిచిన రెండేళ్ల కాలంలో 80 వేల మందికి పైగా జనాలు పొరుగున్న నైజిర్‌కు తరలిపోయారని తెలుస్తోంది.

Published by:Madhu Kota
First published:

Tags: Africa, Gun fire

ఉత్తమ కథలు