షాకింగ్ న్యూస్.. 317 మంది విద్యార్థినులను కిడ్నాప్ చేసిన దుండగులు.. పాఠశాలలోకి చొరబడి తుపాకులతో బెదిరించి

ప్రతీకాత్మక చిత్రం

317 మంది పాఠశాల విద్యార్థినులను దుండగులు కిడ్నాప్ చేశారు. తుపాకులతో పాఠశాలలోకి చొరబడిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

 • Share this:
  317 మంది పాఠశాల విద్యార్థినులను దుండగులు కిడ్నాప్ చేశారు. తుపాకులతో పాఠశాలలోకి చొరబడిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన నైజీరియాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. నైజీరియాలోని జామ్‌ఫారా రాష్ట్రంలోని జంగేబే గ్రామంలో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలపై దుండగులు దాడి చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దుండగులు పాఠశాలలోకి ప్రవేశించినట్టు జామ్‌ఫారా సమాచార కమిషనర్ సులైమాన్ తనౌ అంకా రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. కిడ్నాప్‌కు గురైన బాలికంతా 10 నుంచి 13 ఏళ్ల వయసు కలిగినవారేనని లోక్ మీడియా పేర్కొంది. కిడ్నాప్‌కు గురైన బాలికలను రక్షించేందుకు జామ్‌ఫారా పోలీసులు, నైజీరియా మిలిటరీ జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. దుండగులు బాలికలను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి బంధించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

  బాలికలను కిడ్నాప్ చేసేందుకు వచ్చిన ముష్కరులు సమీపంలోని సైనిక శిబిరం, చెక్‌పాయింట్‌పై కూడా దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు. మిలటరీ తమను అడ్డుకోకుండా ఉండేందుకు వారు ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు. పాఠశాలలో కూడా ముష్కరులు చాలా సేపు గడిపినట్టుగా స్థానికులు పేర్కొన్నారు. అయితే విద్యార్థులను కిడ్నాప్ చేసే సమయంలో జరిపిన కాల్పుల్లో ఏమైనా ప్రాణ నష్టం సంభవించిందా అనే దానిపై స్పష్టత లేదు.

  ఇక, నైజీరియాలో చాలా ఏళ్లుగా ఇటువంటి దాడులు, కిడ్నాప్‌లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 2014లో బోర్నో స్టేట్‌లోని చిబోక్‌లో ఉన్న పాఠశాల నుంచి 276 మంది బాలికలను బోకో హరామ్ అనే ఉగ్రవాద ముఠా కిడ్నాప్ చేసింది. వారిలో వందకు పైగా బాలికల ఆచూకీ ఇంకా లభించలేదు. మరోవైపు వారం రోజుల్లోనే నైజీరియా ఇది రెండో ఘటన. మూడు రోజుల క్రితం బోకోహారం ఉగ్ర ముఠాకు చెందినట్టుగా భావిస్తున్న దుండగులు కగరలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులను తుపాకులతో బెదిరించి స్థానిక అడవిలోకి లాక్కెళ్లారు.

  ఇక, జామ్‌ఫారా రాష్ట్రంలో పెద్ద పెద్ద సముహాలతో కూడిన ముఠాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. వీరిని అక్కడి ప్రభుత్వం బందిపోట్లుగా అభివర్ణిస్తోంది. వీరు డబ్బుల కోసం, జైళ్లలో ఉన్న వారి సభ్యులను విడుదల చేపించుకోవడానికి కిడ్నాప్‌లు చేస్తుంటారని సమాచారం.
  Published by:Sumanth Kanukula
  First published: