GREECE BOAT TRAGEDY 13 PEOPLE DEAD OTHERS MISSING IN NEW MIGRANT BOAT ACCIDENT IN GREECE SK
Boat Tragedy: నడి సంద్రంలో పడవ బోల్తా.. 13 మంది దుర్మరణం.. పలువురు గల్లంతు
ప్రతీకాత్మక చిత్రం
Greece Boat Tragedy: ఇరాక్, సిరియా నుంచి పెద్ద ఎత్తున వలసదారులు యూరప్‌కు వెళ్తుంటారు. ముందుగా టర్కీకి చేరుకొని.. అక్కడి నుంచి పడవల్లో గ్రీస్ మీదుగా ఇటలీకి తరలివెళ్తారు.
గ్రీస్‌లో ఘోర పడవ ప్రమాదం (Greece Boat Tragedy) జరిగింది. ఏజీన్ సముద్రంలో (Aegean Sea )ఓ పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. 62 మందిని గ్రీస్ కోస్ట్‌గార్డ్ సబ్బంది రక్షించారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో గాలిస్తున్నారు. పారోస్ ఐలండ్స్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఐదు కోస్ట్‌గార్డ్ పెట్రోలింగ్ బోట్స్, 9 ప్రైవేట్ నౌకలు, ఒక హెలికాప్టర్, ఒక మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం సముద్రాన్ని జల్లెడపడుతున్నాయి. మృతులంతా అక్రమ వలసదారులేనని గ్రీస్ అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
ఇరాక్, సిరియా నుంచి పెద్ద ఎత్తున వలసదారులు యూరప్‌కు వెళ్తుంటారు. ముందుగా టర్కీకి చేరుకొని.. అక్కడి నుంచి పడవల్లో గ్రీస్ మీదుగా ఇటలీకి తరలివెళ్తారు. చట్ట విరుద్ధంగా ఇటలీతో పాటు పలు యూరోపియన్ దేశాలకు వెళ్తుంటారు. పెట్రోలింగ్ పెంచినా అధికారుల కళ్లు గప్పి పారిపోతుంటారు. ఈ క్రమంలోనే గ్రీస్ ఐలాండ్స్‌లో ఆ దేశం భద్రతను పటిష్టం చేసింది. కోస్ట్ గార్డ్ సిబ్బంది పహారా కాస్తూ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఇలాంటి పడవ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గురువారం కూడా ఓ పడవ మునిగింది. యాంటీకితెరా ద్వీపం సమీపంలో పడవ బోల్తా పడి 11 మంది మరణించారు. మరో 92 మందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడారు. వీరిలో 52 మంది పురుషులు, 11 మంది మహిళలు, 27 మంద పిల్లలు ఉన్నారు.
శుక్రవారం కోస్ట్ గార్డ్ అధికారులు అక్రమ వలసదారులను తరలిస్తున్న పడవను సీజ్ చేశారు. పెలోపోన్స్ ప్రాంతంలో పడవను పట్టుకొని ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. 92 మంది వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం సెంట్రల్ ఏజీన్లో కూడా ఓ పడవ మునిగిపోయింది. ముగ్గురు వలసదారులు మరణించారు. 13 మందిని కోస్ట్ గార్డ్ సిబ్బంది కాపాడారు. 17 మంది గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మూడు రోజులుగా సముద్రంలో గాలిస్తున్నారు.
కాగా, బంగ్లాదేశ్‌లో కూడా శుక్రవారం ఉదయం ఘోర పడవ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.సుగంధ నది ) మధ్యలో నౌక తగలబడింది. మంటల్లో చిక్కుకొని పూర్తిగా కాలిపోయింది. ఈ దుర్ఘటనలో 40 మంది సజీవ దహమయ్యారు. మరో 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశ రాజధాని ఢాకా 250 కి.మీ. దూరంలో ఉన్న ఝలకాతి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుఝామున 03.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.