Global hunger: అన్నం దొరక్క ఆకలి కేకలు.. కరోనా తర్వాత ఈ దేశాల్లో దారుణ పరిస్థితులు

ప్రతీకాత్మక చిత్రం

Global hunger index: యెమెన్, జింబాబ్వే, కాంగో లాంటి దేశాల్లో అత్యధిక మంది ఆకలి బాధను అనుభవిస్తున్నారు. ఈ దేశాల్లో 80 శాతానికి పైగా జనాభాకు సరిపడా ఆహారం లేదు.

  • Share this:
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను తీవ్ర సంక్షోభానికి గురి చేసింది. వ్యాపార, వాణిజ్యాలను దెబ్బతీయడమే కాకుండా విశ్వవ్యాప్తంగా అన్నార్థుల సంఖ్యను పెంచింది. కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం తీవ్ర స్థాయికి పెరిగిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. మహమ్మారి ప్రజల ఆదాయ మార్గాలను దెబ్బతీసిన కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అలమటించే వారి సంఖ్య మూడింట ఓ వంతుకు పెరిగిందని అమెరికా అగ్రికల్చర్ విభాగం(USDA) పేర్కొంది. ఆహార భద్రతకు సంబంధించి 76 మధ్య, స్వల్పాదాయ దేశాల వార్షిక అంచనా-2021ను యూఎస్‌డీఏ తాజాగా విడుదల చేసింది. గత ఏడాది నుంచి ఈ దేశాల్లో అదనంగా 291 మిలియన్ల మందికి ఆహార కొరత ఏర్పడిందని అంచనా వేసింది. మొత్తంగా ఈ సంఖ్య 1.2 బిలియన్లకు((120 కోట్లు) చేరింది.

15 ఏళ్లలో అత్యధికం..
2020లో ప్రపంచ ఆహార అభద్రత 15 ఏళ్లలో అత్యధిక స్థాయికి చేరుకుందని.. ప్రపంచ జనాభాలో 10వ వంతు మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవట్లేదని ఐక్యరాజ్యసమితి ఈ నెల ప్రారంభంలోనే తెలిపింది. 2021లో వస్తు సేవల ద్రవ్యోల్బణం, సప్లై చెయిన్‌ అంతరాయం కారణంగా ఆహార పదార్థాల ధరలు దశాబ్దంలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆహార ధాన్యాల దిగుమతులపై ఆధారపడిన పేద దేశాల పరిస్థితులు 2021లో మరింత దిగజారే అవకాశం ఉందని యూఎస్‌డీఏ అంచనా వేసింది.

ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం నేచర్ ఫుడ్ జర్నల్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. తక్కువ, మధ్య-ఆదాయ దేశాల్లో తల్లులు, శిశువుల పోషకాహారం లోపం వల్ల భవిష్యత్తులో ఉత్పాదక నష్టం 30 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలో వందల మిలియన్ల మందికి ఆకలి ఇబ్బందులు పెరగడం వల్ల రాజకీయ అస్థిరతను పెంచతుందని స్పష్టం చేసింది. మొత్తం మీద 76 దేశాల్లో 1.2 బిలియన్ ప్రజలపై ప్రభావం పడిందని యూఎస్డీఏ రిపోర్టు పేర్కొంది. ఇందులో ఈ ఏడాది 31 శాతం జనాభా ఆహార అభద్రతకు గురి కానున్నారు. మహమ్మారికి ముందు ఈ దేశాల్లో 761 మిలియన్ల మంది ఆహార కొరత ఎదుర్కొంటున్నారు.

ఈ దేశాల్లో అన్నార్థుల సంఖ్య అధికం..
యెమెన్, జింబాబ్వే, కాంగో లాంటి దేశాల్లో అత్యధిక మంది ఆకలి బాధను అనుభవిస్తున్నారు. ఈ దేశాల్లో 80 శాతానికి పైగా జనాభాకు సరిపడా ఆహారం లేదు. ఈ దేశాల్లో ఆహార అభద్రతకు ప్రధాన కారణం నిరంతర ఆదాయాల తగ్గుదలేనని యూఎస్‌డీఏ రిపోర్టు పేర్కొంది. రోజుకు కనీసం 2,100 కేలరీల ఆహారాన్ని తీసుకోకపోతే వారు ఆహార అభద్రతకు చేరువలో ఉన్నట్లు చెబుతారు. చురుకుగా, ఆరోగ్యంగా ఉండటానికి కనీస స్థాయిగా దీన్ని పరిగణిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published: