GERMAN NAVY CHIEF RESIGNS AFTER CONTROVERSIAL UKRAINE COMMENTS IN INDIA PVN
German Navy Chief : భారత్ లో నోరు జారాడు..జర్మనీ నేవీ చీఫ్ పదవికి రాజీనామా చేశాడు
కే-అచిమ్ స్కోన్బాచ్(ఫైల్ ఫొటో)
German Navy Chief : జర్మనీ నేవీ చీఫ్ కే-అచిమ్ స్కోన్బాచ్ రాజీనామా చేశారు. భారత్య పర్యటనలో ఉన్న సమయంలో ఉక్రెయిన్, రష్యాపై స్కోన్బాచ్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశ, విదేశాల్లో విమర్శల వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శనివారం అర్థరాత్రి జర్మనీ నేవీ చీఫ్ పదవికి స్కోన్బాచ్ రాజీనామా చేశారు.
Vice Admiral Kay-Achim Schoenbach : జర్మనీ నేవీ చీఫ్ కే-అచిమ్ స్కోన్బాచ్ రాజీనామా చేశారు. భారత్య పర్యటనలో ఉన్న సమయంలో ఉక్రెయిన్, రష్యాపై స్కోన్బాచ్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశ, విదేశాల్లో విమర్శల వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శనివారం అర్థరాత్రి జర్మనీ నేవీ చీఫ్ పదవికి స్కోన్బాచ్ రాజీనామా చేశారు. కాగా,శుక్రవారం భారత్య పర్యటలో భాగంగా ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్ (IDSA)నిర్వహించిన చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. భారత నేవీ అడ్మిరల్ హరి కుమార్ సహా జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో స్కోన్బాచ్ చర్చలో పాల్గొన్నారు. చర్చా సమయంలో చైనాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన షాన్బాచ్, ఉక్రెయిన్ విషయంలో రష్యాను వ్యక్తిగతంగా వెనకేసుకొచ్చారు. ఉక్రెయిన్ ను వశపరుచుకోవాలన్న ఉద్దేశం రష్యాకు గానీ, ఆ దేశాధ్యక్షుడు పుతిన్ కు గానీ ఉన్నట్లు తాను భావించడం లేదని స్కోన్బాచ్ వివరించారు. పుతిన్ కేవలం వారి దేశ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యాకు..చిన్న భూభాగాన్ని ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదన్న స్కోన్బాచ్..అందుకోసం పుతిన్ యుద్ధం చేసేవరకు వెళ్తారని తాను అనుకోవడంలేదన్నారు. ఉక్రెయిన్, రష్యా దేశాల గౌరవాన్ని కాపాడేందుకు పెద్దన్నగా పుతిన్ ఆ బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ బహుశా తనపై తానే ఒత్తిడి తెచుకుంటున్నాడని, ఒక వేళ ఉక్రెయిన్ ను ఆక్రమించి యూరోపియన్ యూనియన్ ను విడదీయాలనుకున్నా.. పుతిన్ కు అది సాధ్యమేనని ఆ విషయం పుతిన్ కి కూడా తెలుసని స్కోన్బాచ్ పేర్కొన్నారు. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియన్ ద్వీపకల్పాన్ని ఉక్రెయిన్ ఎప్పటికీ తిరిగి పొందలేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా స్కోన్బాచ్ చైనాకు వ్యతిరేకంగా రష్యా ఉండటం చాలా ముఖ్యమని మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ "గౌరవానికి" అర్హుడని స్కోన్బాచ్ అన్నారు.
యూరోపియన్ యూనియన్ దేశాల సరసన రష్యాను నిలిపి గౌరవించాలన్నస్కోన్బాచ్ .. అందుకు రష్యా నూటికినూరు శాతం “అర్హత కలిగినది”గా అభివర్ణించారు. ప్రపంచ దేశాలు పెద్దన్నగా భావిస్తున్న అమెరికా సరసన రష్యాను కూడా చేర్చి గౌరవించాలని, తద్వారా చైనా నుంచి రష్యాను దూరం చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యాలోని వనరులపై ఆధారపడ్డ చైనాను రష్యా నుంచి వేరుచేయడం ద్వారా ఏకాకిని చేయవచ్చని, తద్వారా చైనాకు గుణపాఠం చెప్పినట్టు ఉంటుందని పేర్కొన్నారు. రష్యా ప్రజాస్వామ్యం పై ఆధారపడనప్పటికీ.. రష్యా ఎంతో ముఖ్యమైన జాతిగా పేర్కొన్నారు. భారత్, జర్మనీ దేశాలకు రష్యా ఎంత అవసరమో, చైనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచానికి రష్యా అంతే అవసరమని స్కోన్బాచ్ వివరించారు.
రెండో ప్రపంచ యుద్ధం అనంతరం రష్యాతో యూరోపియన్ యూనియన్ దేశాల బంధాలు అంటీఅంటకుండా ఉన్న నేపథ్యంలో జర్మన్ నేవీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్కోన్బాచ్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు యూరోప్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. స్కోన్బాచ్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జర్మన్ రాయబార కార్యాలయాన్ని వివరణ కోరింది. స్కోన్బాచ్ భారత్ నుంచి బయలుదేరి జర్మనీ చేరుకునే సమయానికే అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారిపోయాయి. స్కోన్బాచ్ వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండటంతో నేవీ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు శనివారం అర్థరాత్రి ఆయన ప్రకటించారు.
స్కోన్బాచ్ రాజీనామాను జర్మనీ రక్షణ మంత్రి క్రిస్టిన్ లాంబ్రెచ్ట్ వెంటనే ఆమోదించి ఆ స్థానంలో ప్రస్తుత డిప్యూటీ చీఫ్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పారు. ఇక తన రాజీనామాపై స్కోన్బాచ్ స్పందిస్తూ..తాను వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని, ఈ వ్యవహారానికి ఇంతటితో చెక్ పెట్టేందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు స్కోన్బాచ్ రాజీనామా వెనుక జర్మనీ ప్రభుత్వ ఒత్తిడి లేదని, వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నా..మిగతా నాటో సభ్యులతో కలిసి ఉక్రెయిన్ కు తమ మద్దతు కొనసాగుతుందని జర్మనీ పేర్కొంది. అయితే సమస్యను మరింత జఠిలం చేయకుండా ఉండేందుకు ఉక్రెయిన్ కి మారణాయుధాలు సరఫరా చేయబోమని జర్మనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఉక్రెయిన్లో రష్యా ఏదైనా సైనిక చర్యకు దిగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జర్మనీహెచ్చరించింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.