Anti-Vax Nurse: కోవిడ్ వ్యాక్సిన్లను నమ్మని జర్మనీ నర్సు.. 8,600 మందికి డమ్మీ డోసులు ఇచ్చిన వైనం

ఫేక్ వ్యాక్సిన్లు వేసిన జర్మనీ నర్స్.. ఎందుకు అలా చేసిందంటే.. (ప్రతీకాత్మక చిత్రం)

టీకాలను వ్యతిరేకించే ఒక రెడ్ క్రాస్ నర్స్.. ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వకూడదని భావించింది. ఈ ‘యాంటీ-వ్యాక్స్‌’ నర్సు టీకాకు బదులుగా సెలైన్ ద్రావణాన్ని ఇచ్చింది.

  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చి కొన్ని నెలలు అవుతున్నా.. టీకాలపై అపోహలు, వ్యతిరేక ప్రచారం మాత్రం ఆగట్లేదు. ఈ క్రమంలో బ్రెజిల్‌లో జరిగిన ఒక ఘటన అక్కడి ప్రజలను షాక్‌కు గురిచేసింది. టీకాలను వ్యతిరేకించే ఒక రెడ్ క్రాస్ నర్స్.. ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వకూడదని భావించింది. ఈ ‘యాంటీ-వ్యాక్స్‌’ నర్సు టీకాకు బదులుగా సెలైన్ ద్రావణాన్ని ప్రజలకు ఇంజెక్ట్ చేసింది. ఇలా ఏకంగా 8,600 మందికి ఆమె డమ్మీ వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. సిబ్బంది ఫిర్యాదుతో ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఫ్రైస్‌ల్యాండ్‌ ప్రాంతంలోని టీకా కేంద్రంలో ఆ నర్సు పనిచేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ కేంద్రంలోనే ఆమె ప్రజలకు వ్యాక్సిన్‌కు బదులుగా సెలైన్ ద్రావణం ఇచ్చిందని దర్యాప్తులో తేలింది.

ఈ విషయం తెలుసుకొని షాక్ అయ్యానని చెప్పారు స్థానిక కౌన్సిలర్ స్వెన్ ఆంబ్రోసీ. డమ్మీ వ్యాక్సిన్ డోసులు తీసుకున్న 8,600 మందిని స్థానిక అధికారులు సంప్రదించారని చెప్పారు. వీరందరికీ వీలైనంత వేగంగా అసలైన వ్యాక్సిన్ డోసులు ఇస్తామని తెలిపారు.

* ప్రమాదకరం కాదు కానీ..
ప్రజలకు నర్సు ఇంజెక్ట్ చేసిన సెలైన్ సొల్యూషన్ ప్రమాదకరం కాదు. కానీ ఆమె మార్చి, ఏప్రిల్‌లో వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చిన వారికి డమ్మీ వ్యాక్సిన్ ఇచ్చింది. ఆ సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలామంది వయసు పైబడిన వారు ఉన్నారు. అసలైన వ్యాక్సిన్ ఇవ్వనందువల్ల వాటిని తీసుకున్న వృద్ధుల్లో చాలామంది కోవిడ్ బారిన పడి ఉండవచ్చని, నర్సు చేసిన పనివల్ల వారికి కోవిడ్ ప్రమాదం పెరిగి ఉండవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ నర్సు కోవిడ్ వ్యాక్సిన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టిందని పోలీసులు గుర్తించారు. అయితే ఆమె అసలు ఉద్దేశం ఏంటనేది అస్పష్టంగా ఉంది. రాజకీయ కారణాలతోనే ఆమె ఈ ఉదంతానికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును రాజకీయ ప్రేరేపిత నేరాలను పరిశీలించే ప్రత్యేక బృందానికి అప్పగించారు. అయితే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారా, అభియోగాలు మోపారా అనే అంశాలపై పూర్తి వివరాలు బయటకు రాలేదు.

కోవిడ్ టీకాలను నమ్మకుండా, వాటిపై దుష్ప్రచారం చేసేవారిని ‘యాంటీ వ్యాక్స్’ వ్యక్తులుగా చెబుతారు. అయితే వైద్య వర్గాల్లోనే ఇలాంటి వారు ఉండటం ఆందోళనకరమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి భావాలు ఉన్న వ్యక్తులు గతంలోనూ వార్తల్లో నిలిచారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఒక ఆసుపత్రి సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో 178 మంది సిబ్బందిని హాస్పిటల్ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. జర్మనీలో 55.6 శాతం జనాభాకు వ్యాక్సిన్ల పంపిణీ పూర్తయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 96 మిలియన్లకు పైగా డోస్‌లు పంపిణీ చేశామని అక్కడి వైద్య వర్గాలు వెల్లడించాయి.
Published by:John Naveen Kora
First published: