నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య పట్ల అమెరికా అంతటా నిరసనకారుల ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. నిరసనకారులు ఆరు రోజులుగా రాత్రి వేళల్లో తమ నిరసన వెళ్లగక్కుతున్నారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్ హౌజ్ వద్ద కూడా వేలాది మంది నిరసన చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన వైట్ హౌజ్ సిబ్బంది.. ట్రంప్, ఆయన భార్య, కుమారుడిని బంకర్‌లోకి తరలించారు. దాదాపు గంట పాటు ఆయన అక్కడే ఉన్నారని సమాచారం. తర్వాత పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడంతో తిరిగి వచ్చినట్లు తెలిసింది. అటు.. అమెరికా వ్యాప్తంగా దాదాపు 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అయితే, వీటిని లెక్క చేయకుండా నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చారు. చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అల్లర్లను నియంత్రించే పోలీసులతో న్యూయార్క్, చికాగో, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెలస్ తదితర నగరాల్లో నిరసనకారులు ఘర్షణలకు దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, పెప్పర్ బుల్లెట్లు ప్రయోగించారు.
ఏమిటీ బంకర్ ప్రత్యేకత..
రెండో ప్రపంచ యుద్ధ సమయం (1940)లో ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ హయాంలో దీన్ని నిర్మించారు. 1948లో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ దాని రూపు రేఖలు మార్చారు. వైట్ హౌజ్ తూర్పు భాగంలో భూమి లోపల శత్రు దుర్భేద్యంగా దీన్ని నిర్మించారు. చివరిసారిగా 2001లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగిన సమయంలో అప్పటి అధ్యక్షుడు బుష్ బంకర్‌లో తలదాచుకున్నారు. తాజాగా, ట్రంప్ అందులో తలదాచుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Donald trump, USA