భారత ప్రధాని నరేంద్ర మోదీని(Prime Minister Modi) ప్రశంసలతో ముంచెత్తారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin). తన తాజా ప్రసంగంలో భారత్ అభివృద్ధిని కొనియాడుతూ.. పాశ్చాత్య దేశాల తీరును విమర్శించారు. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలనే ధోరణి సరికాదని సూచించారు. భారత్ అభివృద్ధి చెందిన తీరును ప్రశంసించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వాన్ని కొనియాడారు. మాస్కోలోని ‘వాల్డై డిస్కషన్ క్లబ్’ వార్షిక ప్రసంగంలో పుతిన్ మాట్లాడుతూ.. మోదీ గొప్ప దేశభక్తుడని, భవిష్యత్తు భారత్‌దేనని పేర్కొన్నారు.
భారత్ ఆదర్శం
ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని పుతిన్ చెప్పారు. మోదీ తన దేశానికి గొప్ప దేశభక్తుడని, ‘మేక్ ఇన్ ఇండియా’ అనే ఆయన ఆలోచన ఆర్థికంగా, నైతికంగా చాలా ముఖ్యమైందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు భారతదేశానిదేనని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను చూసి గర్వించవచ్చని తెలిపారు. భారతదేశం సాధించిన అభివృద్ధికి సంబంధించి కచ్చితమైన ఫలితాలే ప్రపంచవ్యాప్తంగా ఆ దేశం పట్ల గౌరవం, అభిమానం పెంచాయని పుతిన్ వివరించారు. బ్రిటీష్ పాలన నుంచి ఆధునిక రాజ్యంగా అభివృద్ధి చెందడంలో భారతదేశం అద్భుతమైన పురోగతిని సాధించిందన్నారు. దాదాపు 150 కోట్ల మంది ప్రజలు పొందుతున్న అభివృద్ధి ఫలితాలు.. ప్రతి ఒక్కరికీ భారతదేశం పట్ల గౌరవం, ఆరాధనను కలిగించడానికి కారణాలుగా ఉన్నాయని వెల్లడించారు.
భారత్, రష్యా మధ్య వాణిజ్యం రెట్టింపు
భారత్, రష్యాల మధ్య సంబంధాలు ప్రత్యేకమైనవని పుతిన్ తెలిపారు. ఈ రెండు దేశాలు అవసరమైన ప్రతి సందర్భంలో ఒకరికొకరు మద్దతుగా నిలిచాయని, భవిష్యత్తులో కూడా ఇది జరుగుతుందని చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు రెట్టింపు అయిందని పేర్కొన్నారు. ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకొనేందుకు రష్యా, భారత్ సిద్ధమని చెప్పారు. భారత వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువుల సరఫరాను పెంచాలని ప్రధాని మోదీ తనను కోరారని, దీంతో సరఫరాను 7.6 రెట్లు పెంచామని వివరించారు.
పాశ్చాత్య దేశాల డర్టీ గేమ్స్
ఉక్రెయిన్‌లో తన 'ప్రత్యేక సైనిక ఆపరేషన్' గురించి పుతిన్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆధిపత్యం కోసం పాశ్చాత్య ప్రపంచంలోని నాయకులు 'డర్టీ గేమ్స్' ఆడుతున్నారని ఆరోపించారు. ఇది మల్టీ పోలార్ ప్రపంచమని, మల్టీపోలార్ ప్రపంచంలో కొత్త అధికార కేంద్రాలు పుట్టుకొస్తాయని చెప్పారు. పశ్చిమ దేశాలు ఈ విషయం అర్థం చేసుకోవాలని, పాశ్చాత్య దేశాలు ఇతర దేశాలను సమానంగా పరిగణించాలని సూచించారు. ఈ జాత్యహంకార, నియోకలోనియల్ బ్లైండ్నెస్ గత అర్ధ శతాబ్దంలో యూనిపోలార్ ప్రపంచం సృష్టితో మరింత అధ్వాన్నంగా మారిందన్నారు. ప్రపంచంపై అధికారం కోసం పాశ్చాత్య దేశాలు ఆడే ఆట కచ్చితంగా ప్రమాదకరమైందని అన్నారు. నెత్తుటితో కూడిన ఈ మార్గాన్ని మురికిగా భావిస్తానని పుతిన్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Pm modi, Russia, Vladimir Putin