పాక్‌లో టెన్షన్...టెన్షన్: నవాజ్ షరీఫ్ అరెస్టు

అవినీతి కేసులో నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తెను లాహోర్ విమానాశ్రయంలో అరెస్టు చేసిన పోలీసులు...భారీ బందోబస్తు మధ్య రావల్పిండి జైలుకు తరలించారు.

news18-telugu
Updated: July 13, 2018, 10:50 PM IST
పాక్‌లో టెన్షన్...టెన్షన్: నవాజ్ షరీఫ్ అరెస్టు
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మార్యం షరీఫ్
  • Share this:
అవినీతి కేసుకు సంబంధించి లాహోర్  ఎయిర్‌పోర్టులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యమ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. లండన్ నుంచి లాహోర్‌కు చేరుకున్న వెంటనే విమానాశ్రయం వెలుపల వారిని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. లండన్‌లో అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని పనామా పేపర్స్‌ వెల్లడించిన కేసులో కోర్టు నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలుశిక్ష, మర్యమ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 6న తీర్పు ఇవ్వడం తెలిసిందే. లాహోర్ విమానాశ్రయంలో వారిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు, పటిష్ట బందోబస్తు మధ్య రావల్పిండి జైలుకు తరలించారు. మరో రెండు వారాల్లో పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో నవాజ్ షరీఫ్ అరెస్టు కావడం కీలక పరిణామంగా మారింది.

కోర్టు తీర్పు మేరకు జైలు శిక్షను అనుభవించేందుకు నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యమ్ పాకిస్థాన్ వస్తున్న సందర్భంగా ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 10 వేల మంది పోలీసులను మోహరించారు. లాహోర్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులతో పాకిస్థాన్ ముస్లీం లీగ్(ఎన్) కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో లాహోర్‌లో దాదాపుగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.

ఇదిలా ఉండగా బలూచిస్థాన్‌లోని ఎన్నికల సభల్లో ఈ సాయంత్రం జరిగిన రెండు వేర్వేరు పేలుడు ఘటనల్లో దాదాపు 90 మంది మృతి చెందగా, 180 మందికి పైగా గాయపడ్డారు.

First published: July 13, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>