ఉత్తర కొరియా (North Korea). ప్రపంచంలో ఎక్కువగా వార్తల్లో నిలిచే దేశం. దేశాధ్యక్షుడిగా కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్విన కిమ్.. ఇక సరిహద్దు దేశం దక్షిణ కొరియాకు ఎప్పటికైనా కంటిలో నలుసే. ఈ మధ్యలో మాత్రం కొద్దిగా తగ్గినట్లుగానే మాట్లాడుతున్న కిమ్ దేశానికి పెద్ద సమస్య వచ్చి పడింది. ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార కొరత (food shortage) ను ఎదుర్కొంటుంది. కఠినమైన కరోనా ఆంక్షలు (Corona sanctions), సరిహద్దుల మూసి వేత, గతేడాది తుపానుల (typhoons) కారణంగా దేశంలో పరిస్థితులు మరింత దిగజారాయి. దీంతో 2025 వరకు పౌరులంతా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) పిలుపునిచ్చినట్లు సమాచారం. ధాన్య ఉత్పత్తి ప్రణాళికను నెరవేర్చడంలో వ్యవసాయ రంగం (Agricultural sector) విఫలమైనందునే ఈ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినట్లు కిమ్ వ్యాఖ్యానించారు.
మే నెలలోనే అంచనా...
దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెందిన కొరియా డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఈ ఏడాది దాదాపు పది లక్షల టన్నుల ఆహార కొరత రావచ్చని మే నెలలోనే అంచనా వేసింది. ఐరాస (UN) సైతం దేశంలో ఆకలి చావులు నమోదయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. అయితే.. ఉత్తర కొరియా దాన్ని కొట్టిపారేసిన విషయం తెలిసిందే.
సరిహద్దు మూసివేత..
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తర కొరియా 2020లో చైనా (China)తో ఉన్న సరిహద్దును మూసి వేసింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయింది. మరోవైపు అణ్వాయుధాల కార్యకలాపాలకు వ్యతిరేకంగా పలు దేశాలు ఆంక్షలు విధించడంతో ఈ దేశం ఒంటరిగా మారింది. దీంతోపాటు స్థానికంగా తుపాన్లు, వరదలు పంటలను నాశనం చేశాయి. ఫలితంగా ఆహార కొరత మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించింది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో.. స్థానికంగా నిత్యావసర ధరలు (Commodity prices) మండిపోతున్నాయి. ఈ ఫుడ్ ఎమర్జెన్సీ (Food Emergency) 2025 వరకు కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
యువతకు కీలక హెచ్చరిక..
గతంలో నార్త్ కొరియా ఆ దేశ యువతకు కీలక హెచ్చరిక చేసింది. ఆ దేశంలోని యువతీ యువకులు కేవలం ఆ దేశ సంప్రదాయాలనే అనుసరించాలని.. యాస, భాష విషయంలో దక్షిణ కొరియాను అనుసరించకూడదని హెచ్చరించింది. అంతేకాదు.. దక్షిణ కొరియాలో యువత మాదిరిగా హెయిర్ స్టైల్స్ కనిపించినా, పదాలను పలకడంలో దక్షిణ కొరియా యాసను అనుకరించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నార్త్ కొరియా అధికారిక వార్తా పత్రిక స్పష్టం చేసింది. దక్షిణ కొరియా ఫ్యాషన్స్, హెయిర్ స్టైల్స్, మ్యూజిక్‌ను నార్త్ కొరియా యువత ఫాలో కాకూడదని తెలిపింది. కాదని.. ఎవరైనా దక్షిణ కొరియా పద్ధతులను అనుసరిస్తే జైలు శిక్ష తప్పదని ఉత్తర కొరియా ఆ దేశ యువతను హెచ్చరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food, Kim jong un, North Korea