పాకిస్థాన్‌లోని ఆ ప్రాంతంలో ఆహార సంక్షోభం.. లక్ష మంది చనిపోయే ప్రమాదం

ప్రతీకాత్మక చిత్రం

ఆహార సంక్షోభం కారణంగా సుమారు లక్ష మంది ప్రజలకు అత్యవసరంగా సహాయం అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. తక్షణమే సహాయం అందించకపోతే లక్షమంది ప్రజలు చనిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ రిపోర్టు వెల్లడించింది.

  • Share this:
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో కరువు విలయతాండవం చేస్తోంది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఆహార అత్యవసర పరిస్థితి నెలకొంది. కఠినమైన శీతాకాలం, మిడతల దండయాత్ర, కరోనా వైరస్, కరువు వంటి పలు ప్రకృతి విపత్తులు బలుచిస్థాన్‌ను వణికిస్తున్నాయి. ఈ ప్రావిన్స్‌లోని సుమారు ఐదు లక్షల మంది ప్రజలకు ఆహార అత్యవసర పరిస్థితి వచ్చిందని ఐక్యరాజ్యసమితి మంగళవారం వెల్లడించింది. ఆహార సంక్షోభం కారణంగా సుమారు లక్ష మంది ప్రజలకు అత్యవసరంగా సహాయం అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. తక్షణమే సహాయం అందించకపోతే లక్షమంది ప్రజలు చనిపోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ రిపోర్టు వెల్లడించింది.

బలుచిస్థాన్ ప్రాంతంలో చాలా రోజులుగా వర్షాలు కురవకపోవడంతో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. తాగడానికి నీళ్ళు కూడా దొరకకపోవడంతో పశువుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. నిజానికి బలుచిస్థాన్ ప్రజలు పశువుల పెంపకం మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అక్కడి చాలా కుటుంబాలకు పశువులే ప్రధాన ఆహార వనరులు. అయితే, ఒకవైపు పంటలు పండక పోవడం.. మరోవైపు పశువులు ప్రాణాలు పోయే పరిస్థితి రావడంతో బలుచిస్థాన్ ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

నైరుతి బలూచిస్థాన్ ప్రాంతాల్లో ఈ ఏడాది చివరి వరకు కరువు పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అక్టోబర్ 2020 - 2021 మధ్యకాలంలో చాలా తక్కువగా వర్షపాతం నమోదయింది. దీనివల్ల బలుచిస్థాన్ ప్రావిన్స్‌లోని 12 దక్షిణ, కేంద్ర రాష్ట్రాలలోని 6 రాష్ట్రాలలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. కరువు ప్రభావిత ప్రాంతాలు ఈ ఏడాది చివరి వరకు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో ఎదుర్కొన్న కఠినమైన శీతాకాలం, మిడతల దాడి, కరోనా విలయ తాండవం నుంచి బలూచిస్థాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే కరువు పరిస్థితులు ఆ ప్రాంతాన్ని వెంటాడుతున్నాయి. ఇంకో ఐదు నెలల పాటు ఇలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతుండగా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.

ప్రాదేశిక విపత్తు నిర్వహణ అధికారులు, ఐక్యరాజ్యసమితి, ఆహార భద్రతా రంగ భాగస్వాములు కొన్ని ప్రభావిత జిల్లాల్లో జీవనోపాధి ప్రాజెక్టులకు మద్దతిస్తున్నారు. వీరంతా బలూచిస్థాన్ ప్రజలకు అండగా నిలిచేందుకు అన్ని విధాల సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఐరాస రూపొందించిన హ్యూమానిటేరియన్ రెస్పాన్స్ ప్లాన్ అనేది 4.3 మిలియన్ల మందికి సహాయం చేయాలని భావిస్తోంది. కానీ ఇందుకు చాలా తక్కువగా నిధులు అందుబాటులో ఉన్నాయని తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published: