వాషింగ్టన్: క్యాపిటల్ భవనంపై దాడి ఘటన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను రాజకీయంగా చిక్కుల్లో నెట్టేస్తోంది. వైట్ హౌస్ ను వీడేది లేదంటూ మొన్నటిదాకా భీష్మించుకుని కూర్చున్న ట్రంప్, ఆ ఘటన తర్వాత వచ్చిన చెడ్డ పేరుతో మనసు మార్చుకున్నారు. అయినప్పటికీ ట్రంప్ ఫ్యామిలీని క్యాపిటల్ భవన్ మకిలి వదలడం లేదు. తాజాగా ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ పై, ఆమె సన్నిహితురాలు విన్స్ స్టన్ వోల్కాఫ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 2018 వరకు ఆమె వైట్ హౌస్ లోనే పనిచేసేది. మెలానియా ట్రంప్ కు అత్యంత సన్నిహితురాలు అని పేరు ఉంది. 2018లో కారణమేమిటో కానీ, ఆమెను ఉద్యోగంలోంచి తొలగించారు. అప్పటి నుంచి మెలానియా ట్రంప్ పై విమర్శలతో విరుచుకుపడుతోంది. ఇటీవల క్యాపిటల్ భవన్ పై జరిగిన దాడి గురించి కూడా మెలానియా ట్రంప్ ను విమర్శిస్తూ ఆమె తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించింది.
’ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన క్యాపిటల్ భవన్ ను ఎందుకు ధ్వంసం చేస్తున్నారని అడిగితే దానికి తల్లిదండ్రులు ఏం సమాధానం చెప్తారు. మెలానియా ట్రంప్, మీరేం చెప్తారు? నిజాలు చెప్తారా.? అబద్ధాలు చెప్తారా.? ట్రంప్ పాలన అంతా అబద్ధాల మయం. చరిత్రలోనే అత్యంత నిర్లక్ష్యమైన అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచిపోయారు. ట్రంప్ చేస్తున్న తప్పులను మెలానియా ట్రంప్ చూస్తూ ఊరుకున్నారు. తద్వారా ఆయన చర్యలను ప్రోత్సహించారు. క్యాపిటల్ భవన్ పై జరిగిన దాడుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ రకంగా మెలానియా ట్రంప్ చేతులకు రక్తపు మకిలి అంటింది..‘ అంటూ విన్స్ స్టన్ వోల్కాఫ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రంప్ అహంకారపూరిత వైఖరిని మెలానియా ట్రంప్ ఖండించాలనీ, ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.
ఇదిలా ఉండగా, క్యాపిటల్ భవన్ పై దాడి తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా చెడ్డ పేరు రావడంతో ట్రంప్ అనూహ్యంగా మాట మార్చారు. అమెరికా అధ్యక్ష పదవీ బదలాయింపు ప్రక్రియకు సహకరిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత ఆ దాడికి పాల్పడిన వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. ఇన్ని చేసినా, ట్రంప్ మాత్రం తన సహజ ధోరణిని వదిలిపెట్టలేదు. జనవరి 20న జరగబోయే జో బైడెన్ ప్రమాణస్వీకారానికి తాను హాజరుకాబోనని ప్రకటించి అందరినీ విస్మయపరిచారు. అయితే అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాత్రం తాను బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతానని వ్యాఖ్యానించడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Donald trump, Joe Biden, Melania Trump, NRI News, US Elections 2020