Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)..తన ఇంట్లోని మ్యాగజైన్లు,న్యూస్ పేపర్ల మధ్య రహస్య పత్రాలను(Top Secret Document)దాచిపెట్టుకున్నారని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ(FBI)తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్లోరిడాలోని ట్రంప్ కు చెందిన మార్-ఎ-లాగో(Mar-a-Logo)నివాసంలో సోదాలు చేపట్టి స్వాధీనం చేసుకున్న 15 పెట్టెల్లో పద్నాలుగు రహస్య పత్రాలను కలిగి ఉన్నాయని ఎఫ్‌బీఐ తెలిపింది. వీటికి సంబంధించిన అఫిడవిట్‌ను ఎఫ్‌బీఐ శుక్రవారం బయటపెట్టింది. 32 పేజీల ఎఫ్‌బీఐ అఫిడవిట్‌లో..దేశానికి చెందిన అత్యంత రహస్య పత్రాలను ట్రంప్ తన ఇంట్లో ఇతర మ్యాగజైన్లు, వార్తా పత్రికలు, కాగితాల మధ్య కలిపేశారని తెలిపింది. ఒక్కో బాక్సుల్లో రహస్య పత్రాలతో పాటు వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, ఫొటోలు, వివిధ రకాల ప్రింట్‌అవుట్‌లు, వ్యక్తిగత పత్రాలు కలిపి ఉన్నట్లు తేలింది. అనధికారిక ప్రదేశాలకు రహస్య సమాచారాన్ని తీసుకెళ్లడం, ఉంచడం, అలాగే ప్రభుత్వ రికార్డులను అక్రమంగా దాచడం లేదా తొలగించడం వంటి వాటిపై ప్రభుత్వం క్రిమినల్ విచారణ జరుపుతోందని FBI అఫిడవిట్ పేర్కొంది.
కాగా,ట్రంప్ కు చెందిన మార్-ఎ-లాగో ఎస్టేట్‌ను ట్రంప్, ఆయన సిబ్బంది, కుటుంబసభ్యులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఉపయోగిస్తుంటారు. ఇక్కడ వివాహాలతో పాటు రాజకీయ సదస్సులు కూడా జరుగుతుంటాయి. అయితే, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశానికి చెందిన కొన్ని రహస్య ప్రతాలను ఇక్కడకు తరలించారని ఎఫ్‌బీఐకి సమాచారం వచ్చింది. దీంతో ఈ ఏడాది జనవరిలో ఎఫ్‌బీఐ అధికారులు ఈ ఎస్టేట్‌లో సోదాలు చేపట్టగా.. 15 బాక్సుల్లో రహస్య పత్రాలు లభించాయి. ఈ సోదాలకు సంబంధించిన అఫిడవిట్‌నే ఎఫ్‌బీఐ తాజాగా బయటపెట్టింది. ఈ బాక్సుల్లో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు లభించినట్లు చెబుతున్నారు.
PM Modi : గుజరాత్ పర్యటనలో మోదీ..చరఖా తిప్పి,అటల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ప్రధాని
మరోవైపు,గతంలో ఈ బాక్సుల గురించి ట్రంప్ కుమారుడు ఎరిక్ స్పందిస్తూ.. వైట్ హౌస్(అమెరికా అధ్యక్ష భవనం) ఖాళీ చేసేందుకు కేవలం ఆరు గంటల సమయం మాత్రమే ఉంటుందని.. ఆ సమయంలో ట్రంప్ తన దగ్గర ఉన్న క్లిప్పింగ్ లను భద్రపర్చారని.. అవే ఆ పెట్టెలని చెప్పారు. అయితే ఈ పత్రాలను తిరిగిచ్చేందుకు ట్రంప్ కు అనేక అవకాశాలు లభించినప్పటికీ ఆయన వాటిని ప్రభుత్వానికి అందించలేదని ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అయితే తన నివాసంలో జరిగిన సోదాలు రాజకీయ ప్రేరేపిత ఘటనగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్. ఇలా చేయడం ద్వారా తాను మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలన్నది బైడెన్ వర్గం కుట్ర అని ట్రంప్ ఆరోపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Donald trump, USA