ఈ అనంత విశ్వంలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. పదుల సంఖ్యలో గ్రహాలు ఉన్నా.. కేవలం భూమిపైనే మనుషులు బతుకుతున్నారు. మనకు తెలిసింది ఇదే. కానీ వేరొక గ్రహంలో జీవులు ఉన్నాయని..గ్రహాంతరవాసులు (Aliens) ఉన్నారని.. ఎన్నో ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. కాని శాస్త్రీయమైన ఆధారమేమీ లేదు. అప్పుడప్పుడూ ఆకాశంలో గుర్తు తెలియని వస్తువులు కనిపిస్తాయి. అందులోనే ఏలియన్స్ సంచరిస్తున్నారని అప్పుడప్పుడూ వార్తలు వస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికా (America)లోని కాలిఫొర్నియాలో UFO(గుర్తుతెలియని ఎగిరే వస్తువు) కనిపించినట్లుగా ఇద్దరు వ్యక్తులు తెలిపారు. తాము పట్ట పగలు వాటిని చూశామని.. బహుశా అది గ్రహాంతరవాసుల వాహనమని అభిప్రాయపడుతున్నారు.
జులై 10న కాలిఫొర్నియాలోని మెన్లో పార్క్ సమీపంలో పట్టపగలే UFO కనిపించిందని స్థానికంగా నివసిస్తున్న ఓ ఫ్యామిలీ తెలిపింది. ఓ యువకుడితో పాటు అతడి తల్లి ఆకాశంలో యూఎఫ్‌వోను చూశారట. ఆ రోజు నిర్మలంగా ఉంది. ఎలాంటి మేఘాలు లేకుండా.. క్లియర్‌గా ఉంది. అప్పుడు ఓ వస్తువు గాల్లో కనిపించిందని.. దాదాపు 15 నిమిషాల పాటు అటూ ఇటూ తిరిగిందని వారు తెలిపారు. కాసేపటి తర్వాత మాయమైందని.. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదని వెల్లడించారు. ఆ దృశ్యాలను తాము వీడియో తీసినట్లు చెప్పారు. ఆకాశంలో వలయాకారంలో కదులుతున్న ఆ వస్తువును చూసి.. స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అవి గ్రహాంతరవాసులే అయి ఉండవచ్చని చెబుతున్నారు.
ఆ వీడియోను అమెరికాకు చెందిన UFO నిపుణుడు స్కాట్ సి. వారింగ్‌కు పంపారు. UFOలు ఉన్నాయని.. వాటిలో గ్రహాంతరవాసులు అప్పుడప్పుడూ భూమిపైకి వస్తుంటారని ఆయన నమ్ముతారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఘటన కూడా నిజమే అయి ఉంటుందని.. ఆ వీడియోలో కనిపిస్తున్నది UFOనే అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో కేవలం 58 సెకన్లు మాత్రమే ఉందని... UFO రహస్యాన్ని బహిర్గతం చేయడానికి ఇది సరిపోతుందని స్కాట్ తెలిపారు. గ్రహాంతరవాసులకు సంబంధించిన రహస్యాలు త్వరలోనే బట్టబయలు అవుతాయని పేర్కొన్నారు.
గ్రహాంతరవాసుల ఉనికి ఉందా? లేదా? అన్నది చాలా ఏళ్లుగా చర్చనీయాంశంగా ఉంది. తమకు గ్రహాంతరవాసులు కనిపించారని, UFO ఆకాశంలో విహరించాయని.. చాలా మంది చెప్పారు. కానీ ఆ వాదలన్నింటినీ శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తూ వస్తున్నారు. ఆకాశంలో హీలియం బెలూన్ ఎగిరినా కూడా.. దానిని యూఎఫ్‌వోగా భావిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ఈ విశ్వంలో గ్రహాంతరవాసులు ఉన్నారనడానికి స్పష్టమైన ఆధారాలేవీ లేని తేల్చిచెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Trending, Us news, Viral Video