Trump Posts: ట్రంప్‌కి ట్విట్టర్, ఫేస్‌బుక్ షాక్... ఆ పోస్టులు తొలగింపు... ఈయన మారడు

Trump Posts: కరోనా గురించి స్వీయ అనుభవం ద్వారా తెలిసిందన్న ట్రంప్... వివాదాస్పద పోస్టులు పెట్టారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఆ పోస్టులను ఫేస్‌బుక్, ట్విట్టర్ తొలగించక తప్పలేదు.

news18-telugu
Updated: October 7, 2020, 7:51 AM IST
Trump Posts: ట్రంప్‌కి ట్విట్టర్, ఫేస్‌బుక్ షాక్... ఆ పోస్టులు తొలగింపు... ఈయన మారడు
ట్రంప్‌కి ట్విట్టర్, ఫేస్‌బుక్ షాక్ (File)
  • Share this:
Trump Posts: ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. ఈమధ్య ఆయన పెడుతున్న పోస్టులు, ట్వీట్లను ఫేస్‌బుక్, ట్విట్టర్ తొలగిస్తున్నాయి. తాజాగా మంగళవారం... మరో పోస్టును తొలగించాయి. కరోనా స్వయంగా తనకే సోకడంతో... ఆ వ్యాధి ఎలాంటిదో అనుభవం ద్వారా తెలిసిందన్న ట్రంప్... అక్కడితో ఆగకుండా... ఓ వివాదాస్పద కామెంట్ పెట్టారు. సీజన్‌లో వచ్చే జ్వరం కంటే... కరోనా ఏమంత ప్రాణాంతకం కాదని పోస్ట్ పెట్టారు. ఇది తప్పుడు ప్రకటన కావడంతో... ఫేస్‌బుక్, ట్విట్టర్... అప్రమత్తం అయ్యాయి. ఆ పోస్టును తొలగించాయి. "ఫ్లూ జ్వరం సీజన్ వస్తోంది. వ్యాక్సిన్ ఉన్నా... ఏటా లక్ష మందికి పైగా సీజనల్ జ్వరంతో చనిపోతున్నారు. అందుకని మనం మన దేశాన్ని మూసేసుకుంటున్నామా (లాక్‌డౌన్ చేసుకుంటున్నామా)... లేదే... మనం కరోనాతో జీవించడం ఎలా నేర్చుకున్నామో... సాధారణం జ్వరంతోనూ జీవించడం నేర్చుకోవాలి. చాలా చోట్ల కరోనా ప్రాణాంతకంగా లేదు" అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను ట్విట్టర్ డిలీట్ చేసింది. ఐతే ఎవరైనా దాన్ని చూడాలనుకుంటే చూసే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.

తొలగించిన ట్వీట్ పై ట్విట్టర్ వివరణ


వైట్‌హౌస్‌లో కరోనా కలకలం:
74 ఏళ్ల ట్రంప్... ఆయన భార్య 50 ఏళ్ల మెలానియా ట్రంప్‌కి కరోనా సోకడంతో... ట్రంప్‌ను మిలిటరీ హాస్పిటల్‌కి తరలించారు. మెలానియా మాత్రం వైట్‌హౌస్‌లోనే ఉండి ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. శుక్రవారం ట్రంప్‌ను మిలిటరీ హాస్పిటల్ నుంచి వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌లో చేర్చారు. కానీ ట్రంప్ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేదు. మంగళవారం తిరిగి వైట్‌హౌస్‌కి వచ్చేశారు. తనకు కరోనా తగ్గిపోయిందని ట్రంప్ చెబుతున్నా... ఆయనకు నెగెటివ్ వచ్చిందా లేదా అన్నది తేలట్లేదు. ట్రంప్ ఇలా ఆఘమేఘాలపై వెనక్కి వచ్చేయడానికి కారణం... అధ్యక్ష ఎన్నికలో. అక్టోబర్ 15న తన ప్రత్యర్థి జో బిడెన్‌తో ట్రంప్... రెండోసారి డిబేట్‌లో పాల్గోబోతున్నారు. అందుకు సన్నద్ధమవుతున్నారు. ఐతే... ఇప్పుడు వైట్ హౌస్‌లో చాలా మంది ఇబ్బందికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి.



వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌లో డాక్టర్లు... ట్రంప్‌కి ఒకసారి జ్వరం వచ్చి తగ్గిందనీ... మధ్యలో ఓసారి శ్వాస సమస్య రావడంతో... ఆక్సిజన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ తర్వాత ట్రంప్ ఫిట్‌గా ఉండటంతో... డిశ్చార్జి చేసినట్లు వివరించారు. ట్రంప్ కూడా... రెండ్రోజుల ముందు కంటే... తాను ఇప్పుడు మరింత ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు.

వైట్‌హౌస్‌లో ట్రంప్... మాస్క్ పెట్టుకోకుండా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా అంత ప్రాణాంతకం కాదన్న ట్రంప్ కామెంట్లను జో బిడెన్ తప్పుపట్టారు. ఇదే మాట... కరోనాతో చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి చెప్పాలన్నారు. జో బిడెన్ వేసిన ఈ కౌంటర్... ట్రంప్‌కి పెద్ద షాకే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే... కరోనాను కంట్రోల్ చేసే విషయంలో ట్రంప్ సీరియస్‌గా వ్యవహరించలేదనే విమర్శలున్నాయి.

అమెరికాలో కొత్తగా 38,744 కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 77లక్షల 18వేలకు దగ్గర్లో ఉంది. నిన్న 692 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 2లక్షల 15వేల 724కి చేరింది. ఈ కరోనా ప్రభావం నవంబర్ 2న జరిగే అధ్యక్ష ఎన్నికలపై కచ్చితంగా పడుతుందంటున్నారు రాజకీయ నిపుణులు.
Published by: Krishna Kumar N
First published: October 7, 2020, 7:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading