Home /News /international /

FACEBOOK KEY DECISION REGARDING NEWS CONTENT OF AUSTRAILA WITH EFFECT OF NEW LAW AK GH

Facebook: ఆస్ట్రేలియా ప్రభుత్వం వర్సెస్ ఫేస్‌బుక్.. అసలేం జరుగుతోంది ?

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Austraila Vs Facebook: ఆస్ట్రేలియాలో ఫేస్‌బుక్‌కు న్యూస్ కంటెంట్ నుంచి పెద్దగా ఆదాయం రావట్లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు. అందుకే ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

గూగుల్‌, ఫేస్‌బుక్ వంటి కంపెనీలకు, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవల తమ న్యూస్ కంటెంట్‌ను వాడుకుంటున్నందుకు పరిహారం చెల్లించాలని ఆస్ట్రేలియన్ వార్తాసంస్థలు గొడవ చేసిన విషయం తెలిసిందే. గూగుల్ అందుకు ఒప్పుకుంది కూడా. కానీ ఫేస్‌బుక్ మాత్రం ఒక అడుగు ముందుకేసింది. ఫేస్‌బుక్ ఆస్ట్రేలియా వినియోగదారులు తమ ప్లాట్‌ఫాంపై న్యూస్ కంటెంట్‌ను యాక్సెస్ చేసే అవకాశం లేకుండా చేసింది. దీంతో గురువారం నుంచి స్థానిక, గ్లోబల్ వార్తాసంస్థల ఫేస్‌బుక్ పేజీలు కనిపించకుండా పోయాయి. అనేక ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, ఎమర్జెన్సీ సేవల ఫేస్‌బుక్ పేజీలను కూడా ఆ సంస్థ బ్లాక్ చేసింది. దీనిపై విమర్శలు రావడంతో ఫేస్‌బుక్ స్పందించింది. ఏదో తప్పు వల్ల ఇలా జరిగిందని ప్రకటించింది.

టెక్ కంపెనీలు వార్తలను వాడుకుంటే పరిహారం చెల్లించాల్సిందేనని ఆసీస్ ప్రభుత్వం ముందు నుంచి చెబుతోంది. ఇందుకు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని సైతం తీసుకువచ్చే పనుల్లో నిమగ్నమైంది. ఇందుకు ప్రతిస్పందనగానే ఫేస్‌బుక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దేశం బయట ఉన్నవారు కూడా ఫేస్‌బుక్‌లో ఆస్ట్రేలియన్ వార్తా సంస్థల పేజీలను, సమాచారాన్ని యాక్సెస్ చేయలేరు. ఈ చర్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఖండించింది. ప్రతి నెలా సుమారు 17 మిలియన్ల మంది ఆస్ట్రేలియన్లు ఫేస్‌బుక్‌ను చూస్తుంటారు. ప్రస్తుత నిర్ణయం ప్రభావం వీరందరిపై పడనుంది.

కొత్త చట్టంలో ఏముంది?
న్యూస్ ఏజెన్సీలకు పరిహారం చెల్లించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆస్ట్రేలియా కొత్త చట్టాన్ని రూపొందిస్తోంది. ఇటీవల్ గూగుల్ కూడా దేశంలోని ప్రధాన వార్తా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఫేస్‌బుక్ కూడా ఈ నియమాలను అంగీకరించాల్సిందేనని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ఫేస్‌బుక్‌ అందరికీ ఎప్పటిలాగే అందుబాటులో ఉండాలని ప్రభుత్వం కోరుతోంది.

తలవంచని ఫేస్‌బుక్
న్యూస్ కంటెంట్‌పై టెక్ కంపెనీలు అందిస్తున్న ఆదాయంలో వార్తా సంస్థలకు కూడా భాగం ఇవ్వాలనే నియమంతో కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం వార్తాసంస్థలు ఆర్జించే ప్రతి 100 డాలర్లలో 81 డాలర్లు గూగుల్, ఫేస్‌బుక్‌లకే వెళ్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఫేస్‌బుక్ మాత్రం మరో వాదనతో ముందుకు వస్తోంది. గత సంవత్సరం రిఫరల్స్ ద్వారా ఆస్ట్రేలియా పబ్లిషర్స్ సుమారు 407 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు సంపాదించారని చెబుతోంది. వీటి ద్వారా తమ సంస్థకు పెద్దగా ఆదాయం రావట్లేదని తెలిపింది. కొత్త చట్టం ప్రకారం ఫేస్‌బుక్‌ కూడా గూగుల్ మాదిరిగానే న్యూస్ నెట్‌వర్క్స్‌తో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఫేస్‌బుక్ ఇందుకు సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. అందుకే న్యూస్ కంటెంట్‌ను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ నెట్‌వర్క్‌లపైనా ప్రభావం
పోలీసు, అత్యవసర సేవలు, ఆరోగ్య విభాగాలు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ఫేస్‌బుక్ పేజీలు కూడా బ్లాక్ అయ్యాయి. ఛారిటీలు, రాజకీయాలు, క్రీడలు.. వంటి నాన్ న్యూస్ గ్రూపుల పేజీలు కూడా కనిపించట్లేదు. ప్రభుత్వం దీన్ని ఖండించిన నేపథ్యంలో ఫేస్‌బుక్ స్పందించింది. ఏదో తప్పు వల్ల అన్ని పేజీలు ప్రభావితమయ్యాయని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఈ పేజీలను తిరిగి అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. కానీ ఎన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తాయనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.

ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి?
ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం కొత్త చట్టానికే కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. బుధవారం పార్లమెంటు దిగువ సభలో ఈ చట్టం ఆమోదం పొందింది. గురువారం మరోసారి పార్లమెంటులో దీనిపై చర్చ జరగనుంది. మరోవైపు ఆస్ట్రేలియాలో ఫేస్‌బుక్‌కు న్యూస్ కంటెంట్ నుంచి పెద్దగా ఆదాయం రావట్లేదని టెక్ నిపుణులు చెబుతున్నారు. అందుకే ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కెనడా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు కూడా న్యూస్ కంటెంట్ విషయంలో టెక్ కంపెనీలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడి ప్రభుత్వానికి తలవంచితే.. ఇతర దేశాల్లోనూ సమస్యలు ఎదురవుతాయని ఆ సంస్థ భావిస్తోంది. ఫేస్‌బుక్ నిర్ణయంపై వల్ల ఎలాంటి పరిమాణాలు ఎదురవుతాయో ఇప్పుడే చెప్పలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Facebook

తదుపరి వార్తలు