FACEBOOK CHIEF MARK ZUCKERBERG GIVES SHOCK TO USA PRESIDENT DONALD TRUMP MS
US Capitol Violence: ట్రంప్ కు షాకిచ్చిన జుకర్ బర్గ్... మరో రెండు వారాలదాకా నిషేధం కొనసాగింపు
జుకర్ బర్గ్, డొనాల్డ్ ట్రంప్ (ఫైల్)
US Capitol Violence: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా ఫేస్ బుక్ కూడా ట్రంప్ కు ఊహించని షాకిచ్చింది. ఆయన పోస్టులు అల్లర్లను ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్న ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ (mark zuckerberg).. ట్రంప్ పై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
అమెరికాలో గడిచిన 24 గంటల్లో తలెత్తిన అల్లర్లతో ప్రపంచవ్యాప్తంగా ఆ దేశం పరువు గంగలో కలిసిన నేపథ్యంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రపంచమంతా దుమ్మెత్తి పోస్తున్నది. ట్రంప్ జాతీయవాదాన్ని రెచ్చగొట్టి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఫేస్ బుక్ కూడా ట్రంప్ కు ఊహించని షాకిచ్చింది. ఆయన పోస్టులు అల్లర్లను ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్న ఫేస్బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్.. ట్రంప్ పై నిషేధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఫేస్బుక్ వాల్ పై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశం కావడంతో ట్రంప్ మద్దతుదారులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్ లోని కాపిటల్ బిల్డింగ్ లో నానా హంగామా సృష్టించారు. ఈ హింసలో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై జుకర్ బర్గ్ స్పందిస్తూ... ‘గత 24 గంటలుగా జరుగుతున్న ఘటనలు షాక్ కు గురి చేస్తున్నాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. తన వారసుడికి శాంతియుతంగా, చట్టబద్దమైన అధికార మార్పిడికి బదులు... దానిని అణగదొక్కాలని చూడటం స్పష్టంగా కనిపిస్తున్నది. కాపిటల్ భవనంలో తన మద్దతుదారుల చర్యలను ఖండించకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలవరపెట్టింది..’ అని జుకర్ బర్గ్ రాసుకొచ్చారు.
ఇంకా ఆయన స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ ఎన్నికల ఫలితాల ధృవీకరణ తర్వాత మిగిలిన 13 రోజులు, కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే దాక దేశంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్య నిబంధనలకు అనుగుణంగా ఆ ప్రక్రియ జరగాలి. గత కొన్నేళ్లుగా మేము మా వేదికపై ట్రంప్ ఎటువంటి పోస్టులు చేసినా దానికి అడ్డు చెప్పలేదు. అందులో వివాదాస్పదం, మా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని మాత్రం తొలగించాం. రాజకీయ ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజలలో చీలికలు తీసుకొచ్చే అవకాశం ఉందని మేము విశ్వసిస్తున్నాం. కానీ తాజా సందర్భం దానికి భిన్నంగా ఉంది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక తిరుగుబాట్లను మా వేదిక ద్వారా చేస్తామంటే మేం అంగీకరించం. ఇదే సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున.. మేము డొనాల్డ్ ట్రంప్ అధికారిక ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం పేజీలను మరో రెండు వారాల దాకా బ్లాక్ చేస్తున్నాం..’ అంటూ పేర్కొన్నారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.