ENGLAND LIFTING ALL REMAINING RESTRICTIONS ON PUBLIC LIFE AT A TIME WHEN CORONAVIRUS INFECTIONS ARE HIGH SSR
England: రోజుకు 50 వేల కేసులు.. ఆంక్షలను ఎత్తేసిన ఇంగ్లండ్.. ఇదే సరైన సమయమన్న ప్రధాని
ఇంగ్లండ్ నైట్‌క్లబ్స్‌లో సందడి
యూకేలో గడచిన 24 గంటల్లో 54,674 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జనవరి తర్వాత మళ్లీ ఈ స్థాయిలో అత్యధికంగా కేసులు నమోదు కావడం అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇంతలా కేసులు నమోదవుతున్నా.. ఇంగ్లండ్‌లో ప్రభుత్వం ఆంక్షలను ఎత్తేయడం విమర్శలకు తావిస్తోంది.
లండన్: యూకేలో గడచిన 24 గంటల్లో 54,674 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జనవరి తర్వాత మళ్లీ ఈ స్థాయిలో అత్యధికంగా కేసులు నమోదు కావడం అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇంతలా కేసులు నమోదవుతున్నా.. ఇంగ్లండ్‌లో ప్రభుత్వం ఆంక్షలను ఎత్తేయడం విమర్శలకు తావిస్తోంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను రద్దు చేసింది. మాస్క్‌లు తప్పనిసరి కాదని ప్రకటించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఆంక్షలను ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవడం కొసమెరుపు. ఆంక్షల నుంచి దేశాన్ని బయట పడేసేందుకు ఇదే సరైన సమయమని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. ఆంక్షలన్నింటినీ ఒకేసారి ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి లేబర్ పార్టీ నేత సర్ కీర్ స్టార్మర్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాని బోరిస్ జాన్సన్ తీసుకుంటున్న ఇలాంటి ప్రమాదకర నిర్ణయాల వల్ల ప్రజలు విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన చెప్పారు. జాన్సర్ నాయకత్వ లోపాల వల్ల ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా చాలామంది ప్రజలు చనిపోయారని.. మరింత మంది చనిపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఆంక్షలను ఎత్తేయడంతో ఇంగ్లండ్‌లో నైట్ క్లబ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఒక మీటరు భౌతిక దూరం పాటించాలన్న నిబంధన గాల్లో కలిసిపోయింది. థియేటర్లు, స్టోర్ట్స్ స్టేడియమ్స్ ఎప్పటిలానే ప్రేక్షకులతో కళకళలాడనున్నాయి. అయితే.. ఆంక్షలు ఎత్తివేయడంపై ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ నీల్ ఫెర్గ్యూసన్ బ్రిటన్‌ను హెచ్చరించారు. డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఈ తరుణంలో ఆంక్షలను ఎత్తివేయడం తొందరపాటు చర్యగా ఆయన అభిప్రాయపడ్డారు. డెల్టా వేరియంట్ కారణంగా కొద్దిరోజుల్లోనే రోజుకు లక్ష కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వైరస్ మరింత విజృంభిస్తే రోజుకు రెండు లక్షల కేసులు నమోదయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వైద్య నిపుణులు కూడా ఆంక్షల ఎత్తివేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఆరోగ్య కార్యదర్శి జెరెమి హంట్ ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇజ్రాయెల్, నెదర్లాండ్స్ ఆంక్షలను ఎత్తేసి మళ్లీ అమల్లోకి తెచ్చాయని.. ఈ దేశాలను చూసైనా ప్రభుత్వం ఆంక్షల ఎత్తివేతపై పునరాలోచించాలని ఆయన చెప్పారు. వ్యాక్సినేషన్ విషయంలో కాస్త యూకే మెరుగ్గానే ఉందని చెప్పక తప్పదు. యూకేలో దాదాపు 87.9 శాతం మంది పౌరులు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 68.3 శాతం మంది రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ ధైర్యంతోనే.. ఆంక్షల ఎత్తివేత నిర్ణయానికి ప్రధాని బోరిస్ జాన్సన్ పూనుకున్నట్లు సమాచారం.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.