Plane flies for 14 hours with a hole : ప్రయాణంలో ఉన్న విమానానికి(Airplane) భారీ రంధ్రం పడింది. ల్యాండ్ అయిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రంధ్రం పడిన తర్వాత 14 గంటల పాటు విమానం ప్రయాణించింది. జులై 1వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
ఎమిరేట్స్(Emirates)కు చెందిన ఎయిర్‌బస్ A380 విమానం..జులై 1న దుబాయ్ నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ కు బయలుదేరింది. అయితే దాదాపు 14 గంటల ప్రయాణం అనంతరం పైలట్లకు ఏదో అనుమానం వచ్చింది. దీంతో అక్కడి ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC)ను సంప్రదించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి తీసుకున్నారు. టేకాఫ్ సమయంలో విమానం టైరు పేలిందనే అనుమానంతోనే అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ల్యాండ్ అయిన తర్వాత విమానాన్ని పరిశీలించగా దాని ఎడమ రెక్క కింది భాగంలో ఓ రంధ్రాన్ని గుర్తించారు. 14 గంటల ప్రయాణం అనంతరం ఎయిర్ పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయం బయటపడటం గమనార్హం. విమానానికి అంత పెద్ద రంధ్రం ఉండటం చూసి పైలట్లతో పాటు ప్రయాణికులు కూడా షాక్ అయ్యారు. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
అయితే విమానం టేకాఫ్ అయినా కొద్దిసేపటికే ఈ ఘటన జరిగి ఉండవచ్చని కొందరు ప్రయాణికులు తెలిపారు. ఆ సమయంలో విమానంలో పెద్ద శబ్దం వినిపించిందని, దాదాపు 45 నిమిషాలపాటు అది కొనసాగిందని వారు పేర్కొన్నారు. కానీ, క్యాబిన్ సిబ్బంది ప్రశాంతంగా ఉండడంతో తమకు ఎలాంటి అనుమానం రాలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విమానం ఇంకా బ్రిస్బేన్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉందని ఎమిరేట్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. విమానాన్ని అధికారులు తనిఖీ చేశారు. విమానం లోపలి భాగం, ఫ్రేమ్, నిర్మాణంపై ఎలాంటి ప్రభావం పడలేదని ఆయన చెప్పారు. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడినట్లు సమాచారం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight