Tesla India plans : భారత్ లో టెస్లా(Tesla)కార్ల తయారీ కేంద్రం ఎప్పుడు వస్తుందనే దానిపై ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. టెస్లా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. దేశంలో టెస్లా కార్ల తయారీ కేంద్రం పెట్టాలనిసైతం కేంద్రం కంపెనీ ప్రతినిధులను కోరింది. మేక్ ఇన్ ఇండియా(Make In India)కార్యక్రమంలో భాగంగా ఇక్కడే కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఎప్పటి నుంచో కోరుతోంది. అయితే దేశంలో కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు కంపెనీకి కేంద్రం కొన్నిషరతులు విధించిన విషయం విధితమే. అందుకు టెస్లా ప్రతినిధులు సుముఖత చూపలేదు. దీంతో ఇండియా(India)లో కార్ల తయారీ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్ లో విక్రయిస్తామని, తర్వాత స్థానికంగా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని టెస్లా తెలిపింది. మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తోన్న భారత ప్రభుత్వం అందుకు ఒప్పుకోక పోవడంతో టెస్లా కార్ల కంపెనీ తయారీ కేంద్రం ఏర్పాటు వాయిదా పడినట్లయింది. ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం టెస్లా కార్ల తయారీ కేంద్రాన్ని భారత్ లో ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. కానీ చైనాలో తయారైన కార్లను ఇక్కడ అమ్మనివ్వమని అన్నారు.
తాజాగా ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ ప్రకారం చూస్తే.. రాబోయే కాలంలోనూ భారత్ లో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటు ఉండకపోవచ్చనే వాదనకు బలం చేకూరుతుంది. ట్విటర్ ను కొనుగోలు నేపథ్యంలో ఎలన్ మస్క్ నిత్యం ట్విటర్ లో పలు విషయాలను పంచుకుంటూ హడావిడి చేస్తున్నారు. నెటిజన్లు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో భారత్ లో టెస్లా కార్ల తయారీ కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నలకు మస్క్ సమాధానం ఇచ్చారు. ముందు మా కార్లను విక్రయించేందుకు సర్వీసులు అందించేందుకు అనుమతులు లభించని ఏ ప్రాంతంలోనూ టెస్లా తయారీ కేంద్రంను నెలకొల్పబోదు అంటూ మస్క్ తెలిపారు. భారత్ లో టెస్లా కార్ల యూనిట్ ఏర్పాటు చేసే ఆలోచనే లేదని తేల్చి చెప్పాడు. అందుకు భారత్ విధానాలే కారణమంటూ మరోసారి ఆరోపించారు.
ALSO READ Shahbaz Sharif : నేనొక పిచ్చోడిని..పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
మరోవైపు,హాలీవుడ్ నటులు జానీ డెప్, అంబర్ హెర్డ్ మధ్య కోర్టులో వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ స్పందించారు. వీరిద్దరూ గొప్పవారని.. అన్ని మర్చిపోయి ముందుకు సాగాలని తాను కోరుకుంటున్నానని.. నటీనటులిద్దరూ స్వతహాగా చాలా గొప్పవారంటూ మస్క్ ట్వీట్ చేశారు. కాగా,మస్క్... అంబర్ హెర్డ్ ఇదివరకు రెండుసార్లు డేటింగ్ చేశారు. జానీ డెప్ తో విడిపోయిన తర్వాత మస్క్‌తో రిలేషన్షిప్ ప్రారంభించిన అంబర్ హెర్డ్.. ఏడాది తర్వాత 2017లో విడిపోయారు. మళ్లీ 2018లో కలిశారు. ఈసారి కొద్దిరోజులకే విడిపోయారు. అయితే, జానీ డెప్ మాత్రం.. వీరిద్దరి మధ్య సంబంధాలు చాలా ముందే ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. 2015 ఫిబ్రవరిలో అంబర్హెర్డ్తో జానీ డెప్ వివాహం జరిగింది. పెళ్లైన నెల లోపే అంబర్ హెర్డ్... ఎలాన్ మస్క్‌తో డేటింగ్ ప్రారంభించారని ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elon Musk, India, Tesla Motors