ఈజిప్టు (Egypt) లో భారీ రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. రెండు రైళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 32 మంది చనిపోయారు. మరో 66 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఈజిప్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. సోహాగ్ ప్రావిన్స్ ( Sohag province) లోని థాటా జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపింది. ఈ సోహాగ్ ప్రావిన్స్ అనేది ఈజిప్టు రాజధాని కైరోకు 460 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటి వరకు గాయపడిన 66 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఓ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. ప్రమాదం స్థలం వద్ద పెద్ద ఎత్తున ఆంబులెన్స్ లు ఉన్నాయి. AFP న్యూస్ ఏజెన్సీ వీడియో ఫుటేజీలను పరిశీలిస్తే అందులో రైలు బోగీలు బోల్తా పడి కనిపిస్తున్నాయి. అయితే, ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. రెండు రైళ్లు పరస్పరం ఎదురెదురుగా ఢీకొన్నాయా? లేకపోతే ఒక ట్రైన్ ను మరో రైలు వెనుక నుంచి ఢీకొట్టిందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే, ప్రమాద స్థలం వద్ద పెద్ద ఎత్తున సహాయక చర్చలు కొనసాగుతున్నాయి.
ఈజిప్టులో ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదని, టెక్నాలజీ పరంగా, ఇతర మౌలిక వసతుల పరంగా కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదని, రైళ్ల నిర్వహణ సరిగా లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. 2002లో దక్షిణ కైరోలో జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఏకంగా 373 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కాలంలో కూడా అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి.
గత ఏడాది మార్చిలో కూడా ఓ రైలు ప్రమాదం జరిగింది. అప్పుడు 13 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఆ రైలు ప్రమాదం తర్వాత దేశంలో రైళ్లు కూడా స్తంభించాయి. రైలు సర్వీసెస్ కు అంతరాయం కూడా ఏర్పడింది. ఇక 2019లో ఓ రైలు కైరో రైల్వే స్టేషన్ లోనే పట్టాలు తప్పింది. ఆ తర్వాత మంటలు అంటుకుంది. ఆ ప్రమాదంలో 20 మంది చనిపోయారు. రైలు ప్రమాదం జరిగిన ప్రతి సారీ అందరూ నెపం టెక్నికల్ అంశాల మీద నెట్టేసి తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారు. ప్రతి సారీ వాతావరణం వల్ల సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదని, ఎండలను సాకుగా చూపుతున్నారు.
Watch Video: బస్సులో 14 కేజీల బంగారం పట్టివేత
తాజాగా జరిగిన రైలు ప్రమాదంతో మరోసారి అక్కడ పెద్ద ఎత్తున రైలు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించడం, అక్కడ ట్రాక్ మీద, ఆ పక్కన పడి ఉన్న రైలు బోగీలను తొలగించి, రూట్ క్లియర్ చేయడానికి సమయం పట్టనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident