Home /News /international /

EGYPT CHURCH FIRE ACCIDENT 41 KILLED 55 INJURED IN FIRE AT CAIRO COPTIC CHURCH SK

Egypt Church Fire Accident: చర్చిలో ఘోర అగ్నిప్రమాదం.. 41 మంది సజీవ దహనం

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Egypt Fire Accident: చర్చి ప్రమాదంపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా సిసి (Abdel Fattah El-Sisi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాప్టిక్ క్రిస్టియన్ చర్చి పోప్ తవాడ్రోస్-2కి ఫోన్ చేసి ప్రగాఢ సంతాపం తెలిపారు.

    ఆఫ్రికా దేశం ఈజిప్ట్‌లో ఘోర (Egypt Fire Accident) అగ్నిప్రమాదం జరిగింది. కైరోలో ఉన్న ఓ కాప్టిక్ చర్చిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 41 మంది సజీవ దహనమయ్యారు. మరో 14 మంది గాయపడినట్లు ఈజిప్ట్ అధికారులు వెల్లడించారు. కైరోఉన్న అబూ సెఫీన్ చర్చి (Abu Sefein Church Fire Accident) చాలా ఫేమస్. ఇక్కడికి ప్రతి ఆదివారం క్యాప్టిక్ క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ ఆదివారం కూడా చాలా మంది చర్చికి వచ్చి ప్రార్థనలు చేశారు. ఈ క్రమంలోనే చర్చిలో మంటలు చెలరేగాయి. దట్టమైన నల్లటి పొగలు.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగడంతో.. వాటి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి కొందరు చనిపోయారు. దట్టమైన పొగలతో మరికొందరు ఊపిరాడక మరణించారు.  ఇంకొందరు మంటల్లో కాలిపోయి.. బూడిదయ్యారు. ఐతే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. చర్చి లోపల షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


    మధ్యప్రాచ్యంలో కాప్ట్స్‌కు అతిపెద్ద క్రైస్తవ సామాజికవర్గంగా పేరుంది. ఈజిప్టులోని 10.3 కోట్ల జనాభాలో కనీసం కోటి మంది కాప్ట్ క్రైస్తువులు ఉన్నారు. ఐతే ఈజిప్ట్‌లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కొంతకాలంగా మైనారిటీలపై వివక్షతో పాటు దాడులు పెరిగిపోతున్నాయి. 2013లో మాజీ ఇస్లామిస్ట్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మోర్సీని పదవీచ్యుతుడ్ని చేసి సిసి పగ్గాలు చేపట్టిన తర్వాత... కాప్ట్స్ క్రైస్తువులను కొందరు ఇస్లామిస్ట్‌లు టార్గెట్ చేసుకున్నారు. చర్చిలు, పాఠశాలలు, ఇళ్లను తగులబెట్టినట్టు వారిపై ఆరోపణలున్నాయి. ఈజిప్ట్ ప్రెసిడెంట్ సిసి ఇటీవలే చరిత్రలో మొదటిసారిగా రాజ్యాంగ న్యాయస్థానానికి నాయకత్వం వహించడానికి కాప్టిక్ న్యాయమూర్తిని నియమించారు. ఆ తర్వాత చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఈ పరిణామల క్రమంలోనే అబూ సెఫీన్ చర్చిలో మంటలు చెలరేగి.. 41 మంది చనిపోవడం సంచలనం రేపుతోంది.



    చర్చి ప్రమాదంపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా సిసి (Abdel Fattah El-Sisi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాప్టిక్ క్రిస్టియన్ చర్చి పోప్ తవాడ్రోస్-2కి ఫోన్ చేసి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందా? లేదంటే ఏదైనా కుట్ర కోణం ఉందా? అనే కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Egypt, International, International news

    తదుపరి వార్తలు