Oliver Daemen: జెఫ్‌ బెజోస్‌తో అంతరిక్షానికి వెళ్లనున్న 18 ఏళ్ల యువకుడు.. న్యూ షెపర్డ్‌ వ్యోమనౌక మరో రికార్డు

ఒలివర్ డెమెన్‌ (Blue Origin)

బ్లూ ఆరిజిన్ స్పేస్ కంపెనీ అభివృద్ధి చేసిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో మొత్తం నలుగులు వ్యక్తులు అంతరిక్ష యాత్ర చేపట్టాల్సి ఉంది.

  • Share this:
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్ వ్యవస్థాపకులైన బెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జులై 20న నలుగురు సభ్యుల బృందం అంతరిక్ష యానం చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్పేస్ టూర్‌కు అనూహ్యంగా అవకాశం దక్కించుకున్నాడు ఒక 18ఏళ్ల నెదర్లాండ్స్ యువకుడు. అతడి పేరు ఒలివర్ డెమెన్‌. బ్లూ ఆరిజిన్ స్పేస్ కంపెనీ అభివృద్ధి చేసిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో మొత్తం నలుగులు వ్యక్తులు అంతరిక్ష యాత్ర చేపట్టాల్సి ఉంది. వీరిలో బెజోస్, అతడి సోదరుడితో పాటు 82 ఏళ్ల వృద్ధురాలికి బెర్తులు ఇప్పటికే ఖరారయ్యాయి. నాలుగో బెర్తు కోసం బ్లూ ఆరిజిన్ గతంలో వేలం నిర్వహించింది. అందులో ఒక వ్యక్తి 28 మిలియన్ డాలర్లు చెల్లించి న్యూ షెపర్డ్‌లో స్పేస్ టూర్‌కు వెళ్లేందుకు సీటు దక్కించుకున్నాడు. అయితే ఇతర పనుల కారణంగా తాను ఈ యాత్రలో పాల్గొనలేక పోతున్నానని ఆ వ్యక్తి బ్లూ ఆరిజిన్‌కు సమాచారం అందించారు. దీంతో ఒలివర్ డెమెన్‌కు అనూహ్యంగా అవకాశం దక్కింది.

నిజానికి ఒలివర్ డెమెన్.. బ్లూ ఆరిజిన్ అంతరిక్షంలోని పంపనున్న రెండో హ్యూమన్ స్పేస్‌ క్రాఫ్ట్‌లో బెర్తు దక్కించుకున్నాడు. అయితే మొదటి స్పేస్‌క్రాఫ్ట్‌లో ఏర్పడ్డ ఖాళీని డెమెన్‌తో భర్తీ చేస్తున్నట్లు బ్లూ ఆరిజిన్ ప్రకటించింది. ఈ క్రమంలో అంతరిక్షంలోకి వెళ్లిన అతి పిన్న వయస్కుడిగా ఒలివర్ డెమెన్ రికార్డు సాధించనున్నాడు. ఈ యువకుడు సోమర్సెట్ క్యాపిటల్ పార్టనర్స్ సంస్థ సీఈఓ అయిన జోస్ డెమెన్ కుమారుడు. ఈ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతుంది.

ఒలివర్ డెమెన్‌కు అంతరిక్ష విజ్ఞానంపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. ఆస్ట్రొనాట్ కావాలనేది అతడి లక్ష్యం. ఈ క్రమంలో బ్లూ ఆరిజిన్‌ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు అతడు రిజిస్టర్ చేయించుకున్నాడు. అయితే ఈ బెర్తు కోసం అతడు ఎంత టికెట్ ధర చెల్లించాడనే వివరాలను మాత్రం బ్లూ ఆరిజిన్ ప్రకటించలేదు.

న్యూ షెఫర్డ్ వ్యోమనౌకలో మొత్తం నలుగురు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇందులో జెఫ్ బెజోస్, అతడి సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్‌ బెర్తులు గతంలోనే ఖరారయ్యాయి. తాజాగా 18ఏళ్ల డెమెన్ ఈ బృందంలో చేరనున్నాడు. ఈ క్రమంలో న్యూ షెపర్డ్ రెండు రికార్డులను తన పేరుతో లిఖించనుంది. అంతరిక్షంలోకి వెళ్లనున్న వృద్ధ, యువ వ్యోమగాములుగా వాలీ ఫంక్, డామెన్‌లు ఒకేసారి రికార్డు సాధించనున్నారు.

న్యూ షెపర్డ్ వ్యోమనౌక భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల (62 మైళ్ళు) కంటే ఎక్కువ ఎత్తుకు వెళ్లనుంది. ఈ నలుగురిని సబ్ ఆర్బిటాల్ స్పేస్‌కు తీసుకెళ్లనుంది. అక్కడ బెజోస్ బృందం మైక్రోగ్రావిటీ స్థితిని అనుభవిస్తారు. అనంతరం ప్యారాచూట్లు ఉన్న క్యాప్సూల్ ద్వారా భూమికి తిరిగి వస్తారు.
Published by:Sumanth Kanukula
First published: