హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Donald Trump: ఉగ్రవాద శిబిరానికి కరోనా రోగులు.. ట్రంప్​ వివాదాస్పద ఆలోచన

Donald Trump: ఉగ్రవాద శిబిరానికి కరోనా రోగులు.. ట్రంప్​ వివాదాస్పద ఆలోచన

డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)

అమెరికా సంయుక్త రాష్ట్రాలు భయంకరమైన మహమ్మారిని ఎదుర్కొంటున్న తొలినాళ్లలో.. కరోనా సోకిన అమెరికన్లను క్యూబాలోని గ్వాంటనామో బే అనే ద్వీపంలోని జైలుకి పంపాలని ట్రంప్​ భావించినట్లు వారు పేర్కొన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్​ తన పరిపాలనా కాలంలో ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకొని వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా కరోనావైరస్​ను ఎదుర్కోవడంలో ట్రంప్​ సర్కార్​ విఫలమైనట్లు పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనేక మంది అమెరికన్లు పిట్టల్లా రాలిపోయారు. కరోనా వైరస్​పై ప్రతిపక్షాలు, మీడియా, ఆరోగ్య నిపుణులు ముందుగానే హెచ్చరించినా ట్రంప్​ ఏమాత్రం పట్టించుకోలేదని తీవ్ర విమర్శలు వినిపించాయి. కరోనా విషయంలో ట్రంప్​ సహాయకులు చేసిన విజ్ఞప్తులను కూడా పట్టించుకోలేదని, సలహాలిచ్చిన వారితో గొడవ పడ్డారని అప్పట్లో వార్తలొచ్చాయి. యుఎస్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, ట్రంప్​కు ప్రధాన వైద్య సలహాదారుగా పనిచేసిన డాక్టర్ ఆంథోనీ ఫౌసీతో అనేకసార్లు గొడవ పడినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. ఈ వార్తలకు బలం చేకూర్చుతూ తాజాగా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు ది వాషింగ్టన్ పోస్ట్​లో పనిచేసే యస్మీన్ అబుతలేబ్, డామియన్ పాలెట్టా అనే ఇద్దరు రిపోర్టర్లు.

వారు స్వయంగా రాసిన ఈ పుస్తకంలో అనేక షాకింగ్ విషయాలను వెల్లడించారు. ట్రంప్​ తన పాలనా కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను ఇందులో వివరించారు. 'నైట్​మేర్ సినారియో: ఇన్​సైడ్​ ది ట్రంప్​ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్స్​ టు ది పాండమిక్ దట్​ చేంజ్డ్​ హిస్టరీ” అనే టైటిల్​తో జూన్ 29న ఈ పుస్తకం విడుదలకానుంది. కరోనావైరస్​ ప్రారంభ రోజుల్లో వైట్ హౌస్​లో జరిగిన రహస్యాలను ఈ పుస్తకంలో వివరించినట్లు రచయితలు వెల్లడించారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు భయంకరమైన మహమ్మారిని ఎదుర్కొంటున్న తొలినాళ్లలో.. కరోనా సోకిన అమెరికన్లను క్యూబాలోని గ్వాంటనామో బే అనే ద్వీపంలోని జైలుకి పంపాలని ట్రంప్​ భావించినట్లు వారు పేర్కొన్నారు. గతేడాది ఫిబ్రవరిలో కోరోనాపై వైట్ హౌస్ సిట్యువేషన్ రూమ్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ట్రంప్​ తన సలహాదారులతో పంచుకున్నట్లు పుస్తకంలో వివరించారు.

180 మంది వైట్​ హౌస్​ అధికారుల ఇంటర్వ్యూలు

కాగా, కరోనా సోకిన వారిని ఉగ్రవాద శిబిరానికి పంపాలనే ఆలోచన సరైనది కాదని ట్రంప్​ సహాయకులు ఆయనకు చెప్పినప్పటికీ.. వారి మాట ఖాతరు చేయలేదని పుస్తకంలో వివరించారు. కరోనా సోకిన వారిని ఇలా నిర్భంద శిబిరంలో బంధించడం మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని వారు ట్రంప్​ ముందు వాపోయినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. క్యూబాలోని గ్వాంటనామో బే అనే నిర్భంద శిబిరాన్ని అమెరికా సుదీర్ఘ కాలం పాటు లీజుకు తీసుకుంది. అక్కడ అనుమానిత ఉగ్రవాదులను విచారణ లేకుండా బంధిస్తారు. అక్కడే కరోనా సోకిన వారిని కూడా బంధించాలని ట్రంప్​ భావించారు. కాగా, ఈ పుస్తకంలో 180 మందికి పైగా వైట్ హౌస్ సీనియర్ సభ్యుల ఇంటర్వ్యూలను పొందుపర్చారు.

Published by:Sambasiva Reddy
First published:

Tags: America, Covid-19, Donald trump, Trump, USA

ఉత్తమ కథలు