వివాదాస్పద వాఖ్యలు చేయడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్ తండ్రితో పోటీ పడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన చేసిన ట్వీట్ భారతీయల ఆగ్రహానికి కారణమైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఓ ఫొటోను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఆ ఫొటోలో ప్రపంచంలోని దేశాలన్నీ దాదాపు ఎరుపు రంగులో ఉండగా భారత్, చైనా మాత్రం నీలం రంగులో ఉన్నాయి. అయితే ఎరుపు రంగు రిపబ్లిక్ పార్టీని సూచించే రంగు కాగా.. నీలం రంగు డెమొక్రటిక్ పార్టీని సూచిస్తోంది. భారత్ తమ మిత్రదేశమని ట్రంప్ అనేక సార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన కుమారుడు మాత్రం ఈ ట్వీట్ ద్వారా భారత్ బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా కావాలని కోరుకుంటున్నట్లు తన మనసులోని భావాన్ని బయటపెట్టాడు.
అయితే డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారత సంతతికి చెందిన మహిళ కావడంతోనే జూనియర్ ట్రంప్ ఈ విధంగా భారత్ ను నీలం రంగులో చూపాడన్న వాదన సైతం వినిపిస్తోంది. అయితే ఇది ఇలా ఉండగా ఆయన చేసిన ట్వీట్ లో భారత్ ను నీలం రంగులో చూపి.. జమ్మూ, కశ్మీర్ ను ఎరుపు రంగులో చూపడంపై అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Okay, finally got around to making my electoral map prediction. #2020Election #VOTE pic.twitter.com/STmDSuQTMb
— Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 3, 2020
భారత్ లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ ను పాకిస్థాన్ లో ఉన్నట్లు ఎలా చూపుతారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా పోస్టు చేసే ముందు సరిగా వివరాలు తెలుసుకోవాలంటూ సూచిస్తున్నారు. సరైన మ్యాప్ ఇది తెలుసుకో అంటూ ఒరిజినల్ మ్యాప్ ఫొటోతో మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి తిక్క పోస్టులు పెట్టడం మానాలంటూ పలువురు ట్రంప్ జూనియర్ కు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.