మరో వారం రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దిగిపోనున్నారు. జనవరి 20న అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ (Joe Biden) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఐతే అంతకు సరిగ్గా వారం ముందు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. మరోసారి ఆయన అభిశంసనకు గురయ్యాడు. క్యాపిటల్ హిల్ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో డొనాల్ట్ ట్రంప్‌పై పెట్టిన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. 231-197 తేడాతో ఈ తీర్మానం నెగ్గింది. సొంత పార్టీకి చెందిన 10 మంది సభ్యులు కూడా డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటువేశారు. ప్రతినిధుల సభలో రెండోసారి అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు ట్రంప్.
జనవరి 6న వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ భవనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయాన్ని ధృవీకరిస్తూ అమెరికా కాంగ్రెస్ సమావేశమయింది. దాన్ని జీర్ణించుకోలేని ట్రంప్ మద్దతుదారులు పెద్ద మొత్తంలో క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారు. లోపలికి ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించారు. ఈక్రమంలోనే పోలీసులు, ట్రంప్ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో ఐదుగురు మరణించారు. ఐతే ఈ దాడి వెనక ట్రంప్ హస్తముందని.. ఆయన ప్రోత్సహించడం వల్లే ఆందోళనకారులు రెచ్చిపోయారని డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ను పదవి నుంచి తప్పించాలంటూ ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.
25వ రాజ్యాంగ సవరణను ఉపయోగించి ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కోరుతూ డెమొక్రాట్లు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సోమవారమే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు రిపబ్లిక్ సభ్యులు అడ్డుకున్నార. 25 సవరణ అధికారాన్ని ఉపయోగించేందుకు తాను సుముఖంగా లేనంటూ పెన్స్ ఇదివరకే చెప్పారు. ఐనప్పటికీ స్పీకర్ నాన్సీ పెలోసీ పట్టుబట్టిమరీ అభిశంసన తీర్మానంపై ఓటింగ్ చేపట్టారు. ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలని 231 మంది ఓటు వేయగా.. ఆయనకు మద్దతుగా 197 మంది ఓటు వేశారు. ఎక్కువ మంది అభిశంసనకు మొగ్గుచూపడంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యాయారు. ఇక ఈ తీర్మానాన్ని సెనెట్‌కు పంపించనుంది ప్రతినిధుల సభ. అక్కడ కూడా ఆమోదం పొందితే ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Donald trump, International news, Us news