తాను అధికారంలోకి వస్తే అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం చేపడుతానని అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మెక్సికో నుంచి అమెరికాకు వలసలు నానాటికీ పెరిగిపోతుండటంతో.. దీనికి అడ్డుకట్ట వేయాలంటే సరిహద్దు గోడ నిర్మాణమే మార్గమని ఆయన భావిస్తున్నారు. అయితే గోడ నిర్మాణానికి అవసరమైన నిధులకు అమెరికన్ కాంగ్రెస్ మద్దతు అవసరం కావడంతో.. ట్రంప్ లక్ష్యానికి అడ్డంకులు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండానే నిధులు పొందేందుకు శుక్రవారం ట్రంప్ 'జాతీయ అత్యవసర పరిస్థితి' ప్రకటించారు. అక్రమ వలసలు అమెరికాపై దాడిగా అభివర్ణించిన ట్రంప్.. వాటిని అడ్డుకోవడానికే గోడ నిర్మాణం చేపడుతున్నట్టు ప్రకటనలో వెల్లడించారు. అయితే జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధ్యక్షుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్తామని డెమోక్రాట్లు, కొన్ని రాష్ట్రాలు హెచ్చరిస్తున్నాయి. సైనిక నిధులను, డ్రగ్ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించాల్సిన నిధులను ట్రంప్ మెక్సికో గోడ నిర్మాణానికి ఉపయోగించాలని చూస్తున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమే అని.. మిలటరీ నిధుల మళ్లింపు దేశ భద్రతకు భంగం వాటిల్లేలా చేస్తుందని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Donald trump, USA