ప్రపంచంలోనే అతి పురాతన ప్రజాస్వామ్యంగా కొనసాగుతోన్న అమెరికాకు మాయని మచ్చగా మిగిలిన ‘జనవరి 6 క్యాపిటల్ భవంతిపై దాడి’ ఉదంతంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నాటి ఘటనకు సంబంధించిన రహస్య ఫైళ్లను దర్యాప్తు కమిటీకి ఇవ్వరాదంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. జనవరి 6 ఘటనపై దర్యాప్తు చేస్తున్న హౌస్ కమిటీకి ఆ రహస్య పత్రాలను విడుదల చేయడాన్ని ఆపాలంటూ గురువారం నాడు ట్రంప్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. సుమారు 700 పేజీల రికార్డులున్న ఆ రహస్య పత్రాలను తెరవడానికి వీల్లేదని, తనను ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే హౌజ్ కమిటీ ఈ పత్రాలను కోరుతోందని ట్రంప్ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు, జనవరి 6 క్యాపిటల్ భవంతి అల్లర్ల కేసును సుప్రీంకోర్టు క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆ తర్వాతే ఫైళ్ల విడుదలపై నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ విన్నవించుకున్నారు.
అమెరికాలో గతేడాది అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కనీవినీ ఎరుగని సంఘటనలు చోటుచేసుకోవడం తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్ కారణంగా దాదాపు వారం పదిరోజులు ఆలస్యంగా ఫలితాలు రావడం, అందులో ట్రంప్ పరాజయం చెంది, కొత్త అధ్యక్షుడిగా జోబైడెన్ విజయం సాధించడం తెలిసిందే. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ రచ్చకు దిగిన ట్రంప్.. ఓటమిని అంగీకరించబోనని, అధ్యక్ష పదవి నుంచి దిగబోనని బెట్టు చేశారు. ఆ క్రమంలోనే జనవరి 6న ట్రంప్ సమర్థకులు వేలాదిగా వాషింగ్టన్ లో ర్యాలీ తీసి.. అమెరికా పార్లమెంట్, ఫెడరల్ సెక్రటేరియట్ భవనమైన క్యాపిటల్ బిల్డింగ్ పై దాడి చేశారు. నాటి అల్లర్లలో ఒక వ్యక్తి పోలీస్ కాల్పుల్లో చనిపోగా, పదుల మందికి గాయాలయ్యాయి. క్యాపిటల్ భవంతిపై దాడి తర్వాత అసాధారణ విమర్శల జడిలోనే ట్రంప్ గద్దె దిగక తప్పలేదు. అయితే, ఆయన చేసిన పాపాలకు మూల్యం చెల్లిస్తామంటూ హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోస్కీ దర్యాప్తునకు ఆదేశించారు.
జనవరి 6 క్యాపిటల్ భవంతిపై దాడి కేసును దర్యాప్తు చేస్తోన్న హౌజ్ కమిటీ.. నాటి ఘటనలో ట్రంప్ పాత్రను నిర్దేశించే కీలక వైట్ హౌజ్ పత్రాలను సేకరించాలనుకుంది. అందు కోసం కింది కోర్టులో దావా వేయగా, ఆ ఫైళ్లను హౌజ్ (దర్యాప్తు) కమిటీకి ఇవ్వాలంటూ తీర్పు వచ్చింది. అయితే, కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ ట్రంప్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. క్యాపిటల్ భవంతి కేసును దర్యాప్తు చేస్తోన్న హౌజ్ కమిటీకి ముందుగానే అజెండా ఉందని, కొందరు వ్యక్తుల కక్షపూరిత వైఖరి కారణంగానే వైట్ హౌస్ ఫైళ్ల వెల్లడి అంశం తెరపైకొచ్చిందని ట్రంప్ లాయర్లు వాదించారు. కావాలంటే ఆ కేసును సుప్రీంకోర్టే స్వయంగా పరిశీలించి, ఆ తర్వాత ఫైళ్లు కమిటీకి ఇవ్వాలో, వద్దో నిర్ణయించాలని ట్రంప్ లాయర్లు కోరారు. ప్రస్తుతం ఆ ఫైళ్లు అమెరికా ఆర్కైవ్స్ లో భద్రంగా ఉన్నాయి.
వైట్ హౌజ్ రహస్య ఫైళ్లు బయటికొస్తే గనుక అది తనకు కోలుకోలేని విధంగా హాని కలిగిస్తుందని, కాబట్టి ఆ ఫైళ్లను దర్యాప్తు కమిటీకి ఇచ్చే ముందు సుప్రీంకోర్టే కేసుపై పూర్తి సమీక్షను చేపట్టాలని న్యాయమూర్తులను ట్రంప్ కోరారు. "కోలుకోలేని హాని కలిగించే ముందు న్యాయ సమీక్షను పొందడంలో అధ్యక్షుడు ట్రంప్‌కు ఉన్న ఆసక్తితో పోల్చితే అభ్యర్థించిన రికార్డులను వెంటనే పొందడంలో కమిటీకి ఉన్న పరిమిత ఆసక్తి చాలా తక్కువగా ఉంది" అని ట్రంప్ న్యాయవాదులు పిటిషన్ లో పేర్కొన్నారు. ట్రంప్ వైట్ హౌజ్ లో అధ్యక్షుడిగా ఉంటూనే ఎన్నికల ఫలితాలపై సంచలన ఆరోపణలు చేశారని, ఆయన రెచ్చగొట్టడం వల్లే మద్దతుదారులు క్యాపిటల్ భవంతిపై దాడి చేశారని హౌజ్ కమిటీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. అల్లర్లలో ట్రంప్ పాత్ర కచ్చితంగా తేలాలంటే ఆ ఫైళ్లు బయటికి రావాల్సిందేనని కమిటీ కోరుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Donald trump, US Elections 2020, USA