ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రమాదవశాత్తు నీటి (Water)లో మునిగి (Drowning) చనిపోతున్నారు. రోజువారీ అవసరాలకు నీటిని సేకరించేటప్పుడు లేదా స్నానం చేసేటప్పుడు కొందరు నీట మునిగి జలసమాధి అవుతున్నారు. తీవ్రమైన వాతావరణ సమయాల్లో మాత్రమే కాకుండా నీటిపై ప్రయాణించడం, చేపలు పట్టే క్రమంలోనూ సముద్రాలు, చెరువులు మనుషులను పొట్టనబెట్టుకుంటున్నాయి. ఇలా చనిపోయినవారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనతో కృంగిపోతున్నారు. అయితే నీట మునిగి చనిపోయినవారి కుటుంబాల వేదన, అగమ్యగోచరంగా మారే వారి పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గ్లోబల్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ కోసం ఏప్రిల్ 2021లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. జులై 25ని ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం (World Drowning Prevention Day)గా ప్రకటించింది. అలా మృతుల కుటుంబాలపై పడే ప్రభావాల గురించి, ప్రాణాలను రక్షించే మార్గాల గురించి తెలియజేయడం కోసం ఏటా నేడు (జులై 25) ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి(UNO) ఏజెన్సీలు, పౌర సమాజ సంస్థలు కలిసి నీటిలో సంభవించే మరణాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచేలా ప్రోత్సహించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం. నీటిలో మునగడం వల్ల ప్రతి ఏడాది 2 లక్షల 36 వేల మంది మృత్యువాత పడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) తెలిపింది. 1-24 ఏళ్ల మధ్య పిల్లలు, పెద్దల మరణాలకు నీటిలో మునగడం అనేది మొదటి పది ప్రధాన కారణాలలో ఒకటి. పేద, మధ్యస్థ ఆదాయ దేశాలలో 90% కంటే ఎక్కువ జల మరణాలు నదులు, సరస్సులు, బావులు, నాళాలు, ఇళ్ల వద్ద నీటిలో సంభవిస్తాయని WHO పేర్కొంది.
ఈ మరణాలలో ఎక్కువ భాగం స్నానం చేయడం, గృహ అవసరాల కోసం నీటిని సేకరించడం, పడవలు లేదా నౌకలలో ప్రయాణించడం, చేపలు పట్టడం వంటి వాటితో ముడిపడి ఉన్నాయి. వర్షాకాలంలో నీటిలో మునిగిపోయే దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతున్నందున ప్రస్తుతం ఇండియాలో కూడా ఈ రోజుకి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఏడాది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ముంపు నివారణ దినోత్సవం సందర్భంగా ప్రాణాలను కాపాడటానికి "ఒక పని చేయమని (D One Thing)" ప్రజలకు పిలుపునిచ్చింది.
నీటిలో మునిగిపోకుండా ప్రాణాలను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- సముద్రాలు, చెరువుల వద్దకు ఎక్కువగా వెళ్లేవారు స్విమ్మింగ్, సేఫ్ రెస్క్యూ టెక్నిక్స్ నేర్చుకోవడం తప్పనిసరి. ప్రతి దేశం కూడా నీళ్లలోకి వెళ్లే వారికి ఈ టెక్నిక్స్ చర్చించడం ఒక ప్రధాన బాధ్యతగా తీసుకోవాలి.
- పాఠశాలల యాజమాన్యాలు చిన్నపిల్లల తిరిగే ప్రాంతంలో స్విమ్మింగ్ పూల్ వంటి నీటి గుంతలకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ప్రీ-స్కూల్ పిల్లలకు నీటికి దూరంగా ఉండే ప్రదేశాల్లోనే విద్యనందించాలి.
- ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి, ప్రాణాలు పోకుండా కాపాడడానికి తగిన ట్రైనింగ్ అందరికీ ఇవ్వడం మంచిది.
- బోటింగ్, షిప్పింగ్, నౌకలలో భద్రతా నిబంధనలను అమలు చేయాలి.
- లోతైన, ప్రమాదకరమైన నీటిలోకి దిగకుండా ప్రజలను ఆపే అడ్డంకులను ఏర్పాటు చేయాలి.
- ప్రమాదాలకు దారి తీయకుండా వరదలను మేనేజ్ చేయగల చర్యలు చేపట్టాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.