Home /News /international /

DELHI DECLARATION SEEKS NON INTERFERENCE IN AFGHAN AFFAIRS WITHOUT NAMING PAK MK GH

Delhi Declaration: అఫ్గానిస్థాన్‌ పరిస్థితులపై ముగిసిన ప్రాంతీయ భద్రతా చర్చలు.. ఢిల్లీ డిక్లరేషన్ ద్వారా నిర్ణయాల ప్రకటన

Delhi Declaration

Delhi Declaration

శాంతియుత, సురక్షితమైన, స్థిరమైన అఫ్గానిస్థాన్ కోసం మద్దతు కూడగట్టాలని సమావేశంలో నిర్ణయించారు. అదే సమయంలో ఆ దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు గౌరవం ఇవ్వడంతో పాటు దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ప్రతిపాదించారు.

అఫ్గానిస్థాన్‌ పరిస్థితులపై ఢిల్లీలో నిర్వహించిన మూడో ప్రాంతీయ భద్రతా చర్చలు (Third Regional Security Dialogue) తాజాగా ముగిశాయి. ఇండియా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్థాన్, రష్యా, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు/కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితులతో పాటు ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై ప్రతినిధులు చర్చించారు. ఆ దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఉగ్రవాదం, రాడికలైజేషన్, మాదకద్రవ్యాల రవాణా విషయంలో బెదిరింపులతో పాటు మానవతా సహాయం (humanitarian assistance) అవసరంపై దృష్టి సారించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు/జాతీయ భద్రతా మండలి కార్యదర్శులు ‘ఢిల్లీ డిక్లరేషన్’ పేరుతో కొన్ని అంశాలపై నిర్ణయాలు ప్రకటించారు. అవేంటంటే..

1. శాంతియుత, సురక్షితమైన, స్థిరమైన అఫ్గానిస్థాన్ కోసం మద్దతు కూడగట్టాలని సమావేశంలో నిర్ణయించారు. అదే సమయంలో ఆ దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు గౌరవం ఇవ్వడంతో పాటు దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని ప్రతిపాదించారు.

2. అఫ్గానిస్థాన్‌లో భద్రతాపరమైన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. కుందుజ్, కాందహార్, కాబూల్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను ఖండించారు.

3. అఫ్గాన్ భూభాగాన్ని ఎలాంటి ఉగ్రవాద చర్యలకు (ఆశ్రయం, శిక్షణ, ప్రణాళిక లేదా ఆర్థిక సహాయం కోసం) ఉపయోగించరాదని పునరుద్ఘాటించారు.

4. అఫ్గానిస్థాన్‌లోని అన్ని తీవ్రవాద కార్యకలాపాలను తీవ్రంగా ఖండించారు. ప్రపంచ ఉగ్రవాదానికి ఆ దేశం ఎప్పటికీ స్వర్గధామం కాకూడదని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు అందుతున్న నిధులను నిరోధించాలని తీర్మానించారు.

5. ఈ ప్రాంతంలో తీవ్రవాదం, వేర్పాటువాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సమష్టి సహకారం కోసం పిలుపునిచ్చారు.

6. అఫ్గాన్ వాసులందరికీ ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాన్ని.. దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

7. అఫ్గాన్‌కు సంబంధించిన UN తీర్మానాలను గుర్తుచేస్తూ.. ఆ దేశ వ్యవహారాల్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన పాత్ర పోషిస్తుందని, దేశంలో సంస్థ ఉనికిని కాపాడుకోవాలని పేర్కొన్నారు.

8. మహిళలు, పిల్లలు, మైనారిటీ వర్గాల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నట్లు చెప్పారు.

9. అఫ్గానిస్థాన్‌లో క్షీణిస్తున్న సామాజిక-ఆర్థిక, మానవతావాద పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలకు అత్యవసరంగా మానవతా సహాయం (humanitarian assistance) అందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

10. అఫ్గాన్‌కు మానవతా సహాయం విషయంలో అవరోధాలు లేకుండా చూడాలని.. అక్కడి సమాజంలోని అన్ని వర్గాలకు ఎలాంటి వివక్ష లేకుండా ఈ సహాయం అందాలని పునరుద్ఘాటించారు.

11. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి అఫ్గానిస్థాన్‌కు సహాయం అందించడంలో నిబద్ధతను మరోసారి చాటిచెప్పారు.

12. ప్రస్తుత చర్చల ప్రాముఖ్యతను ప్రతినిధులు పునరుద్ఘాటించారు. భవిష్యత్తులో ఈ విషయంపై సమష్టి నిర్ణయంతో చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు.

న్యూ ఢిల్లీలో అఫ్గానిస్థాన్‌పై మూడో ప్రాంతీయ భద్రతా చర్చలను నిర్వహించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తదుపరి సమావేశాలను 2022లో నిర్వహించడానికి అంగీకరించారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Afghanistan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు