పాకిస్థాన్ రాజకీయాలను సెక్స్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన బ్లాగర్ సింథియా డి రిచీ పాక్ మాజీ అంతర్గత మంత్రి రెహమాన్ మాలిక్ తనను రేప్ చేశాడని ఆరోపణలు చేయడంతో కలకలం మొదలైంది. దీంతో ఆరోపణలను ఖండిస్తూ ఆయన సింథియాకు లీగల్ నోటీసు పంపారు. 2011 లో తనపై మాజీ మంత్రి రెహమాన్ మాలిక్ అత్యాచారం చేశాడని సింథియా ఆరోపించింది. ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు మాజీ మంత్రి రెహమాన్ మాలిక్, మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ, మరో మంత్రి కలిసి తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు రిచీ ఆరోపిస్తూ వీడియో విడుదల చేసింది. దీంతో రెహమాన్ తరపు న్యాయవాదులు రంగంలోకి దిగి ఆమెకు నోటీసు పంపారు. సింథియా ఆరోపణల కారణంగా మాలిక్ ప్రతిష్టను దెబ్బతింటుందని నోటీసులో పేర్కొన్నారు.
మాజీ మంత్రి రెహమాన్ మాలిక్ 23 కోట్ల రూపాయల నష్ట పరిహారాన్ని కోరుతూ సింథియా రిచీపై పరువు నష్టం దావా వేశారు. ఆమె నష్టపరిహారం చెల్లించలేకపోతే, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సింథియా రిచీకి తాము ఇప్పటికే రెండు సార్లు నోటీసు పంపినట్లు తెలిపారు. అయితే తనకు నోటీసు రాలేదని సింథియా రిచీ ట్విట్టర్లో తెలిపారు. కోర్టులో ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సింథియా తెలిపారు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) కు చెందిన ముగ్గురు అగ్ర నాయకులపై సింథియా డి రిచీ శుక్రవారం తన ఫేస్బుక్ పేజీలో వీడియో క్లిప్ ద్వారా ఆరోపణలు చేశారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన ఆరోపణలను రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని, వచ్చే వారం ప్రారంభంలో ఈ రుజువులను అందరికీ అందజేస్తానని సింథియా చెప్పారు.
2011 లో తనను మాజీ అంతర్గత మంత్రి రెహమాన్ మాలిక్ అత్యాచారం చేశారని, మాజీ ప్రధాని ఇస్లామాబాద్‌లోని రాష్ట్రపతి భవన్లో ఉండగా జిలానీ, ఆయన మాజీ ఆరోగ్య మంత్రి మఖ్దూమ్ షాహాబుద్దీన్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపించింది. 2011 లో, పాకిస్తాన్ లోని యుఎస్ ఎంబసీకి విషయం గురించి తాను ఫిర్యాదు చేశానని రిచీ తెలిపారు. అయితే రిచీ ఆరోపణలను పాకిస్థాన్ ప్రతిపక్ష నేతలు ఖండిస్తున్నారు.
ఎవరీ.. సింథియా డి రిచీ ?
సింథియా ఓ అడ్వంచర్ షార్ట్ ఫిల్మ్ నిర్మాత, జర్నలిస్ట్, బ్లాగర్, యూట్యూబర్ . ఆమె పాకిస్తాన్ మహిళా కమాండోలతో కలిసి శిక్షణ తీసుకుంది. ఆమె పాకిస్తాన్లో నివసిస్తోంది. ఆమెకు పాకిస్థాన్ లోని అధికార యంత్రాంగంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలో పాకిస్థాన్ పట్ల సానుకూల వైఖరి కలిగించేలా ఆమె వీడియోలు తీసి విడుదల చేస్తుంది. అయితే ఆమె ఇప్పటికే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం తనను లైంగికంగా వాడుకోవాలని చూసినట్లు సంచలన ఆరోపణలు చేసింది.