హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

తాగింది ఒకే ఒక్క బీర్.. ఇచ్చింది రూ. 2,25,000 టిప్

తాగింది ఒకే ఒక్క బీర్.. ఇచ్చింది రూ. 2,25,000 టిప్

(Image: Facebook)

(Image: Facebook)

Bar Tips: రెస్టారెంట్స్, బార్లలో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోగా వీరిని ఆదుకుంటున్న ఆపన్న హస్తం ఈ టిప్పులు మాత్రమే

రాత్రి ఓ కస్టమర్ అలా వచ్చాడు.. ఓ బీర్ తాగి చిల్ అయ్యాడు, వెళ్తూ వెళ్తూ వేల డాలర్లను బిల్లుగా కట్టేశాడు అంతే ఆ రెస్టారెంట్ ఓనర్ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. దీంతో ఫేస్ బుక్ లో మొత్తం స్టోరీలైన్ రాసుకొచ్చాడు ఆ రెస్టారెంట్ యజమాని. బ్యాడ్ టైంలో కూడా ఇలాంటి కస్టమర్లు తమను ఆదుకుంటున్నారని ఆయన ఆనందంగా చెప్పుకొచ్చిన వివరాలు ఏంటో మీరే చదవండి..


భలే మంచి బేరం

కోవిడ్-19 (covid -19) మహమ్మారి కారణంగా ఆ రెస్టారెంట్ ను మూసివేయక తప్పలేదు. ఈ టైంలో అనూహ్యంగా భలే మంచి బేరం దొరికింది. ఆదివారం రాత్రి క్లీవ్ ల్యాండ్స్ లోని నైట్ టైన్ రెస్టారెంట్ కు ఓ కస్టమర్ వచ్చాడు. ఓ బీర్ ఆర్డర్ చేశాడు. ఆతరువాత చెక్ (బిల్లును అమెరికాలో చెక్ అంటారు) అడిగాడు. ఆ చెక్కులో $7.02(మన కరెన్సీలో దాదాపు 520 రూపాయలు) అని రాసి ఉంది. క్రెడిట్ కార్డుతో బిల్లు కట్టిన కస్టమర్.. "ఈ టిప్పును ఇక్కడ పనిచేస్తున్న వారితో ఆనందంగా పంచుకోండి..రీఓపన్ తరువాత కలుద్దాం" అని చెప్పి వెళ్లిపోయాడు. "ఆతరువాత చూస్తే ఏకంగా $3000(రూ. 2,22,000) టిప్పు ఇస్తున్నట్టు అందులో రాసి ఉంది. వెంటనే అతని వద్దకు నేను పరిగెత్తి వెళ్లి విషయం చెబుదామనుకునే లోగా ఆయనే అందుకునే అందులో ఏ మిస్టేక్ లేద"ని చెప్పి ఆయన వెళ్లిపోయారు. ఇలాంటి వారు ఇక్కడ చాలా మందే ఉన్నారు అంటూ రెస్టారెంట్ ఓనర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. "నిజానికి ఆయన పేరు ఇక్కడ రాయాలని ఉంది కానీ రాయటం లేదు, ఆయనకు అది ఇష్టం లేదు.. మేమంతా ఈ టిప్ తో ఎంతో సంతోషించాం, ఆయనకు మేం చాలా రుణపడి ఉంటాం, ఆ కస్టమర్ ది ఎంత ఉదారగుణం" అని పోస్ట్ లో యజమాని తనకు అందిన సాయాన్ని గొప్పగా చెప్పుకున్నాడు. ఇది చదివిన వారంతా ఆ కస్టమర్ మనస్తత్వాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు.


పెద్ద టిప్ ఇచ్చిన యాక్టర్

కొద్ది రోజుల క్రితం యాక్టర్ డోన్నీ వాల్బర్గ్ కూడా ఇలాంటిదే చేశారు. ఆయన మసాచూసెట్స్ రెస్టారెంట్ లో $2,020 (రూ. 1,49,480) టిప్ గా ఇచ్చారు. 'ద బాండ్ ఆఫ్ బ్రదర్స్', 'బ్లూ బ్లడ్స్' అనే సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాల్బర్గ్ బాయ్ బ్యాండ్ అయిన 'న్యూ కిడ్స్ ఆన్ ద బ్లాక్' లో సభ్యుడు కూడా. ఈ రిసిప్ట్ ఫొటో ఫేస్ బుక్ లో #2020TipChallengeగా వైరల్ అయింది.


ఆపన్నహస్తం అందిద్దాం..

రెస్టారెంట్స్, బార్లలో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోగా వీరిని ఆదుకుంటున్న ఆపన్న హస్తం ఈ టిప్పులు మాత్రమే. సర్వీస్ సెక్టార్ ను చావు దెబ్బ కొట్టిన కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు హోటల్ ఇండస్ట్రీ కుదేలై మూత పడుతోంది. దీంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు టిప్పులను ప్రోత్సహించాలంటూ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు సోషల్ మీడియాలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు ఓవైపు బార్లు, రెస్టారెంట్లు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్న కస్టమర్లు, బిల్లు చెల్లించేప్పుడు కాస్ట్ కటింగ్ లో భాగంగా టిప్పులు ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ సాటి మనుషులను ఉదారంగా ఆదుకుంటేనే ఇలాంటి మహమ్మారి సృష్టించే ఆర్థిక కష్టాల నుంచి బయట పడగలమని సామాజిక బాధ్యతను అందరూ చేపట్టాలనే పిలుపుకు అక్కడక్కడా మంచి స్పందన వస్తోంది.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: Wine shops

ఉత్తమ కథలు