వైద్య సలహాలో లోపం ఉంటే, అందుకు సదరు సలహా ఇచ్చిన వైద్యులే బాధ్యత వహించాలని సంచలన తీర్పు చెప్పింది బ్రిటన్ కోర్టు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా వైకల్యంతో జన్మించిన బిడ్డ, తాను ఇలా పుట్టడానికి ఆ వైద్యుడే కారణమంటూ వేసిన వ్యాజ్యాన్ని కోర్టు సమర్థించింది. తన తల్లికి వైద్యుడు సరైన సూచనలు ఇచ్చి ఉంటే, తాను వైకల్యంతో పుట్టేదాన్ని కాదని ఆమె కోర్టుకు తెలిపింది. ఆమె వాదనతో ఏకీభవించిన లండన్ హైకోర్టు, బాధితురాలికి భారీ పరిహారం ఇప్పించాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. తాను వైకల్యంతో పుట్టడానికి తన తల్లికి వైద్యం చేసిన వైద్యుడే కారణమంటూ కోర్టు మెట్లెక్కింది బ్రిటన్‌కు చెందిన 20 ఏళ్ల ఎవీ టూంబ్స్. ఆమె 2001 నవంబర్‌లో పుట్టింది. ఆమెకు పుట్టుకతోనే స్పినా బిఫిడా (spina bifida) అనే వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. స్పినా బిఫిడా వ్యాధి కారణంగా ఎవీ వెన్నెముక, వెన్నుపాము సరిగ్గా ఏర్పడలేదు. ఇది ఒక అరుదైన పరిస్థితి అని వైద్యులు చెబుతుంటారు. దీని కారణంగా బాధితులు కాలక్రమంలో శాశ్వత వైకల్యానికి గురవుతారు. అయితే తన తల్లికి వైద్యుడు సరైన సలహా ఇచ్చి ఉంటే తాను వైకల్యంతో పుట్టేదాన్ని కాదని ఆరోపిస్తూ ఎవీ కోర్టును ఆశ్రయించింది. ఆ డాక్టర్‌పై ‘wrongful conception’ (తప్పుడు గర్భధారణ) దావా వేసింది.
ఎవీ తల్లికి డాక్టర్ ఫిలిప్ మిచెల్ వైద్యం చేశారు. తన తల్లి గర్భవతి కావడానికి ముందు కీలకమైన సప్లిమెంట్లను తీసుకోవాలని సలహా ఇవ్వడంలో డాక్టర్ ఫిలిప్ విఫలమయ్యాడని ఎవీ పేర్కొంది. ‘పుట్టబోయే బిడ్డకు స్పైనా బైఫిడా సోకే ప్రమాదాన్ని తగ్గించడానికి ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని డాక్టర్ సలహా ఇవ్వాల్సింది. కానీ ఆ మందులు వాడాల్సిన అవసరం లేదని డాక్టర్ ఫిలిప్ మా అమ్మ కరోలిన్‌కు సూచించారు’ అని ఎవీ కోర్టుకు తెలిపింది.
ఈ విషయంపై ఎవా టూంబ్స్ తల్లి, 50 ఏళ్ల కరోలిన్ మాట్లాడుతూ.. 2001 ఫిబ్రవరిలో మొదటి బిడ్డను కనాలనే ఆలోచన గురించి చర్చించడానికి డాక్టర్ మిచెల్ వద్దకు కన్సల్టేషన్ కోసం వెళ్లినట్లు చెప్పింది. అపాయింట్‌మెంట్ సమయంలో ఫోలిక్ యాసిడ్ గురించి చర్చించినప్పటికీ, వెన్నెముక వ్యాధి అయిన బిఫిడా నివారణలో దాని ప్రాముఖ్యత గురించి డాక్టర్ మిచెల్ తనకు చెప్పలేదని కరోలిన్ పేర్కొంది. తాను గర్భం ధరించవచ్చని డాక్టర్ సూచించినట్లు వెల్లడించింది. ‘అప్పుడే స్పినా బిఫిడా ప్రమాదం, దాని నివారణలో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ల ప్రాధాన్యం గురించి డాక్టర్ నాకు సలహా ఇవ్వాల్సింది. కానీ సరైన ఆహారం తీసుకుంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు’ అని వివరించారు.
అప్పుడే కరోలిన్‌కు డాక్టర్ మిచెల్ సరైన సలహా ఇచ్చి ఉంటే, ఆమె త్వరగా గర్భం దాల్చేది కాదని కరోలిన్ లాయర్లు కోర్టుకు తెలిపారు. ‘డాక్టర్ సరైన సలహా ఇచ్చి ఉంటే, కరోలిన్ గర్భధారణ ప్రణాళికలను వాయిదా వేసుకొని, ఫోలిక్ యాసిడ్ ట్రీట్‌మెంట్ కోర్సును ప్రారంభించి ఉండేది. ఈ ట్రీట్‌మెంట్ పూర్తయిన తరువాతే గర్భం దాల్చడానికి ప్రయత్నించేది. ఇదే జరిగితే ఎవా టూంబ్స్ వైకల్యంతో జన్మించేది కాదు’ అని లాయర్లు కోర్టుకు తెలిపారు.
ఈ వాదనలతో ఏకీభవించారు లండన్ హైకోర్టు న్యాయమూర్తి రోసలిండ్ కో QC. అనంతరం ఎవీ, కరోలిన్ వాదనలను సమర్థిస్తూ ఈ కేసుపై బుధవారం తీర్పు చెప్పారు. ఎవీ తల్లికి ఆ డాక్టర్ సరైన వైద్య సలహా ఇచ్చి ఉంటే, ఆమె గర్భం ధరించే ప్రణాళికలను వాయిదా వేసుకునేదని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అయితే ఈ కేసు గెలిచినందువల్ల ఎవీకి ఎంత మొత్తం నష్టపరిహారం అందుతుందనే వివరాలను ఆమె లాయర్లు వెల్లడించలేదు. కానీ ఆ పరిహారం పెద్దమొత్తంలో ఉండవచ్చని చెప్పారు. వయసు పెరిగే కొద్దీ ఎవీ సంరక్షణ అవసరాలకు అయ్యే ఖర్చును ఆ మొత్తం కవర్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..
ఆ హోదాపై టీఆర్ఎస్ నేతల ఆశలు.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?
Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి
మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..
ఎవీ శరీరం అందరి మాదిరిగా చలనశీలతకు (mobility) సహకరించదు. అంటే ఆమె చాలా పరిమితంగానే కదలగలదు. పెద్దయ్యాక ఎవీ ఎక్కువగా వీల్ చైర్‌కే పరిమితం కావచ్చు. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా ఆమె పేగు, మూత్రాశయ సమస్యలతో కూడా బాధపడుతోంది. 20 ఏళ్ల ఎవీ, కఠినమైన షోజంపింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. గుర్రంపై సవారీ చేస్తూ పెద్దపెద్ద బారికేడ్లను దాటే ఈ ఆటలో ఆమె ప్రావీణ్యం సాధించింది. ఈ క్రీడలో వికలాంగులతో పాటు సాధారణ రైడర్‌లతో పోటీ పడింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.