ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా గెలవాలని అనుకుంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అంతే. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తానని ధీమాగా ఉన్నారు. ఒకవేళ ఆయన ఓడిపోతే ఏం జరుగుతుంది. ట్రంప్ ఏం చేస్తారు? దీనిపై ఇప్పటికే పలువురు రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. కచ్చితంగా కొన్ని విషయాలైతే జరగొచ్చు. ఎన్నికల్లో ఓడిపోతే హుందాగా దిగిపోయి, ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో కూర్చుని చక్కగా పేపర్లు, పుస్తకాలు చదువుకునే రకం కాదు. రెండో విషయం ఏంటంటే, ట్రంప్‌కు ముందు అధ్యక్షులైన వారు పూర్తిస్థాయి రాజకీయనాయకులు. కానీ, ట్రంప్ ఎక్కువశాతం బిజినెస్ మెన్. ఆ తర్వాతే పొలిటీషియన్. 74 సంవత్సరాల డొనాల్డ్ ట్రంప్ తన జీవితంలో వైట్ హౌస్‌లో గడిపిన లాంటి (విలాసవంతమైన) జీవితం గతంలో కూడా అనుభవించానని పలుమార్లు చెప్పారు. అందివచ్చిన అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం వ్యాపారస్తుల లక్షణం. ట్రంప్ కూడా మొదట వ్యాపారవేత్త కాబట్టి ఒకవేళ తాను ఓడినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలరు.
ట్రంప్ టీవీ?
ట్రంప్. ఈ పేరు ఒక బ్రాండ్ నేమ్. ఆ పేరు గత నాలుగేళ్లుగా అమెరికా మొత్తం మార్మోగిపోయింది. ప్రపంచంలో కూడా పేరుగాంచింది. కాబట్టి, తన పేరునే పెట్టుబడిగా పెట్టుకుని ట్రంప్ ఓ టీవీ చానల్ పెట్టే అవకాశం ఉంది. తన మీద కొన్ని చానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఆయన పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీనికి ప్రత్యామ్నాయం కావాలని కూడా అన్నారు. కాబట్టి, ట్రంప్ సొంతంగా టీవీ పెట్టొచ్చంటున్నారు. ట్రంప్‌కు మద్దతుగా ఉండే కేబుల్ చానల్స్ కూడా ఉన్నాయి.
కోర్టు కేసులు, జైలు?
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఓడిపోతే ఆ తర్వాత సీన్ మారిపోతుంది. కచ్చితంగా కోర్టు కేసులు వెంటాడే అవకాశం ఉంది. 2016లో ట్రంప్‌కు రష్యా మద్దుతు ఇచ్చిందనే వాదన బయటకు వచ్చింది. ఇప్పుడు అది వెంటాడే ప్రమాదం ఉంది. ఓ పోర్న్ స్టార్‌కు ట్రంప్ భారీ ఎత్తున డబ్బులు బదిలీ చేసిన అంశంలో ఇప్పటికే ఆయన కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. అనధికార లావాదేవీలు, అనుమానాస్పద లావాదేవీలు కూడా ఆయన్ను ఇరుకున పెట్టొచ్చు. గతంలో ఓ రేప్ కేసు, లైంగిక దాడి ఆరోపణలు కూడా ట్రంప్‌ను వెతుక్కుంటూ వస్తాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు కాబట్టి, విచారణల నుంచి ఆయనకు పూర్తి రక్షణ ఉంది. ఓడిపోతే మొత్తం తారుమారు అవుతుంది. ఇప్పటికే ట్రంప్ క్యాంపెయిన్ మేనేజర్లు, న్యాయవాదుల్లో 8 మంది తీవ్ర నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
మళ్లీ బరిలోకి?
ఒకవేళ ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావొచ్చు. ఒక వ్యక్తికి రెండుసార్లు మాత్రమే అమెరికా అధ్యక్షుడు/అధ్యక్షురాలిగా చేసే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు ఓడిపోతే మళ్లీ 2024లో పోటీ చేయవచ్చు. గతంలో 1888లో గ్రోవర్ క్లైవ్ లాండ్ ఇలాగే మొదటి టెర్మ్ తర్వాత ఓడిపోయి మరోసారి 1892లో గెలిచారు. తనను ఓడించిన బెంజ్‌మన్ హారిసన్‌ను మళ్లీ ఓడించారు.
హాయిగా రోడ్ ట్రిప్‌లు వేస్తారా?
ఇవన్నీ ఎందుకులే అనుకుంటే, ఎంచక్కా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి రోడ్ ట్రిప్‌లు వేయవచ్చు. ఈ ఏడాది జూన్‌లో ఆయన ఇలాంటి కామెంట్ చేశారు. మెలానియాతో కలసి ఓ మంచి వాహనంలో రోడ్ ట్రిప్ చేస్తానని చెప్పారు. రొమాంటిక్ పర్సనాలిటీ, డబ్బుకు లోటులేని ట్రంప్ ఏం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
తాజాగా, ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఓ సీరియస్ కామెంట్ కూడా చేశారు. ‘ఒకవేళ నేను ఓడిపోతే బహుశా దేశం వదిలిపోవాల్సి రావొచ్చు.’ అని కూడా అన్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.