Mark Zuckerberg: మార్క్‌ జుకర్ బర్గ్‌ను వెతుకుతున్న కొలంబియా పోలీసులు.. వైరల్ అవుతున్నఫేస్‌బుక్ పోస్ట్

మార్క్ జుకర్ బర్గ్, కొలంబియా పోలీసులు షేర్ చేసిన స్కెచ్

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మార్క్ జుకర్ బర్గ్ కోసం కొలంబియా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అంతేకాదు.. ఆయనను పట్టిస్తే భారీగా నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

  • Share this:
ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మార్క్ జుకర్ బర్గ్ కోసం కొలంబియా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అంతేకాదు.. ఆయనను పట్టిస్తే భారీగా నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న జుకర్ బర్గ్‌.. అంత పెద్ద నేరం చేశాడా అనుకోకండి. కొలంబియా పోలీసులు వెతికేది అసలైన జుకర్ బర్గ్ కోసం కాదు. కానీ ఆ నేరస్తుడి ఊహాచిత్రం అచ్చం జుకర్ బర్గ్ మాదిరిగానే ఉంది. దీంతో కొలంబియా పోలీసులు విడుదల చేసిన ఫోటోను నెటిజన్లు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడి ఫోటోతో పోల్చి వైరల్ చేస్తున్నారు.

ఇటీవల కొలంబియా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై కొందరు నేరస్తులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడికి ప్రణాళిక రచించిన ఇద్దరు వ్యక్తుల ఊహా చిత్రాలను పోలీసులు సిద్ధం చేశారు. వీటిని ‘కొలంబియన్ నేషనల్ పోలీస్’ పేరుతో డిపార్ట్‌మెంట్ నిర్వహిస్తున్న అధికారిక ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. జూన్ 28న ఇద్దరు నేరస్తుల ఆర్టిస్ట్ స్కెచ్‌లను అధికారులు పోస్ట్ చేశారు. వీరిని పట్టించిన వారికి 30 లక్షల డాలర్ల బహుమతి సైతం ఇస్తామని ప్రకటించారు. నేరస్తులు కనిపిస్తే సమాచారం అందివ్వాల్సిన ఫోన్ నంబర్లను సైతం ఇదే పోస్టులో పొందుపరిచారు.

అయితే పోలీసులు షేర్ చేసిన రెండు ఫోటోలలో ఒకటి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నేరస్తుల స్కెచ్‌లలో ఒకటి మార్క్ జుకర్‌బర్గ్ రూపాన్ని పోలి ఉంది. దీంతో దీన్ని నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోకు ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌లో 66,000 వరకు రియాక్షన్స్ వచ్చాయి. దీన్ని 22,000 సార్లు షేర్ చేయడం గమనార్హం. చాలా మంది ప్రజలు జుకర్‌బర్గ్ అసలు ఫోటోను, నేరస్తుడి ఊహా చిత్రాన్ని కలిపి షేర్ చేస్తున్నారు. మరికొంత మంది కామెంట్లలో నేరుగా జుకస్ బర్గ్‌ను ట్యాగ్ చేస్తున్నారు.



కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ శుక్రవారం దేశంలోని నార్టే డి శాంటాండర్ ప్రావిన్స్ రాజధాని కుకుటా నగరానికి బయలుదేరారు. ప్రయాణంలో కాటటంబో ప్రాంతం గుండా హెలికాప్టర్ ఎగురుతున్నప్పుడు, దాన్ని లక్ష్యంగా చేసుకొని కొందరు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో డ్యూక్‌తో పాటు కొలంబియా రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, ఇతర అధికారులు సైతం హెలికాప్టర్‌లో ఉన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ క్రమంలో నేరస్తులను గుర్తించేందుకు పోలీసులు ఊహాచిత్రాలను విడుదల చేశారు.
Published by:Sumanth Kanukula
First published: