ఈయన ఓ రాష్ట్రానికి సీఎం.. బతుకుజీవుడా అంటూ వచ్చి భారత్‌లో ఓ పల్లెటూల్లో తలదాచుకుంటున్నారు..

(Salai ian Lua / @IndiainMyanmar)

భారత్, మయన్మార్ మధ్య 1643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మయన్మార్‌లోని చిన్ సమాజానికి చెందిన వారు, మిజోల పూర్వీకులు కూడా ఒకరే. కొందరు మయన్మార్‌లో స్థిరపడ్డారు. కొందరు మిజోరాంలో సెటిల్ అయ్యారు.

  • Share this:
    ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ప్రజల చేత ఎన్నికైన నేత. అయితే, ఆయన కూడా ప్రాణభయంతో తమ దేశం వదిలి బతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఓ మారుమూల పల్లెలో శరణార్ధులుగా ఉంటున్నారు. ఆయన ఎవరో కాదు. పొరుగున ఉన్న మయన్మార్‌లోని చిన్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలై లియన్ లుయై. మయన్మార్‌లో ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత అక్కడ సైన్యం రాజ్యం నడుస్తోంది. సైనికుల కాల్పులతో మార్మోగుతోంది. ప్రజలు సైన్యం గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా వారికి బుల్లెట్లు సమాధానంగా లభిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వందల ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. దీంతో చాలా మంది మయన్మార్ నుంచి పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అలా వచ్చిన 9000 మందిలో చిన్ రాష్ట్ర సీఎం కూడా ఒకరు. ఆయన మిజోరాం రాష్ట్రంలో మారుమూల ఉన్న చంపై జిల్లాలో కొన్ని నెలలుగా శరణార్ధిగా ఉంటున్నారు. మయన్మార్ నుంచి శరణార్ధులుగా వచ్చిన 20 మంది ప్రజాప్రతినిధుల్లో ఆయన కూడా ఉన్నారు. ఆయన ఆంగ్ సాన్ సూకీ సారధ్యంలోని నేషనల్ లీగ్ ఆఫ్ డెమొక్రసీకి చెందిన నేత.

    మయన్మార్ నుంచి వచ్చిన చాలా మందిలో ప్రజలతో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వారిలో పోలీసులు కూడా ఉండడం గమనార్హం. మయన్మార్‌లో పరిస్థితులు దారుణంగా ఉండడంతో అక్కడి నుంచి ప్రాణభయంతో వచ్చిన వారిని మానవతా దృక్పథంతో ఆదరించాలని గతంలోనే మిజోరాం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మిజోరాం రాష్ట్రంలోని ఆరు జిల్లాలైన చంపై, సియాహా, లాంగ్‌టలై, సెర్చిప్, నహ్తియాల్, సైటర్ మయన్మార్‌తో 510 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నాయి. భారత్, మయన్మార్ మధ్య 1643 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. మయన్మార్‌లోని చిన్ సమాజానికి చెందిన వారు, మిజోల పూర్వీకులు కూడా ఒకరే. కొందరు మయన్మార్‌లో స్థిరపడ్డారు. కొందరు మిజోరాంలో సెటిల్ అయ్యారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: