Zhurong rover: అంగారకుడిపై చైనా జెండా...నెగ్గిన డ్రాగన్ పంతం...

Zhurong rover: అంగారకుడిపై చైనా జెండా...నెగ్గిన డ్రాగన్ పంతం...

మార్స్‌పై దిగిన చైనా రోవర్ (image credit - twitter - CNN)

అంగారకుడిపై చైనా రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలను జిన్హువా అనే చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ధ్రువీకరించింది.

  • Share this:
అంతరిక్ష పరిశోధనల్లో అమెరికాకు ధీటుగా దూసుకుపోతోంది చైనా. అంగారకుడి మీదకు ఆ దేశం ప్రయోగింగించిన రోవర్ శనివారం విజయవంతంగా ల్యాండ్ అయింది. దీనికి సంబంధించిన వివరాలను చైనా అధికారికంగా వెల్లడించింది. గత ఏడాది తియాన్వెన్-1 అనే ల్యాండర్‌ను, జురాంగ్ అనే రోవర్‌ను డ్రాగన్ దేశం అరుణ గ్రహం మీదకు ప్రయోగించింది. ఈ ఫిబ్రవరిలో ల్యాండర్ ఆ గ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. తాజాగా ఇది అంగారకుడిపై ఎలాంటి ఆటంకాలు లేకుండా ల్యాండ్ అయిందని చైనా ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది. ల్యాండర్ అంగారక గ్రహం వాతావరణంలోకి ప్రవేశించడంతో పాటు, రోవర్ ల్యాండింగ్‌లో కీలకమైన చివరి ఏడు నిమిషాల ప్రక్రియ సజావుగా సాగిందని ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. జురాంగ్ రోవర్ పారాచూట్ ద్వారా యుతోపియా ప్లానిటియా అనే మైదానంలో దిగింది. ఈ కార్యక్రమాన్ని ‘నిహావో మార్స్’ పేరుతో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

అంగారకుడిపై చైనా రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలను జిన్హువా అనే చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ధ్రువీకరించింది. ఈ క్రమంలో మొదటి ప్రయోగంలోనే అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించడంతో పాటు.. ల్యాండింగ్, రోవింగ్ ఆపరేషన్ పూర్తి చేసిన మొదటి దేశంగా చైనా నిలిచింది. దీంతో పాటు అమెరికా తరువాత అరుణ గ్రహం మీదకు చేరుకున్న రెండో దేశంగా చైనా గుర్తింపు సాధించింది. అమెరికా ఇటీవల ప్రయోగించిన పర్సెవరెన్స్ రోవర్ అంగారకుడి మీద విజయవంతంగా ల్యాండ్ అయింది. ఆ తరువాత కొద్ది రోజులకే చైనాకు చెందిన జురాంగ్ రోవర్ ఆ గ్రహాన్ని చేరుకోవడం విశేషం.

* గత ఏడాది ప్రారంభమైన ప్రాజెక్టు
గత ఏడాది జూలైలో తియాన్వెన్-1 అనే ల్యాండర్‌ను చైనా అరుణ గ్రహం మీదకు ప్రయోగించింది. చైనీయుల అగ్ని దేవుడైన జురాంగ్ పేరుతో ఒక రోవర్‌ను ఈ ల్యాండర్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. సౌరశక్తితో పనిచేసే ఈ రోవర్ సుమారు 240 కిలోల బరువు ఉంటుంది. దీనికి ఉండే ఆరు చక్రాల సాయంతో సులువుగా ప్రయాణాలు చేయగలదు. ఈ రోవర్ అంగారకుడి ఉపరితలం నుంచి రాళ్లు, దుమ్ము నమూనాలను సేకరించి విశ్లేషించనుంది. ఈ అంతరిక్ష నౌక ఫిబ్రవరిలో అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ గ్రహం ఉపరితలంపై ల్యాండ్ అయ్యే కీలకమైన ‘టచ్‌డౌన్’ దశను ల్యాండర్ ప్యారాచూట్ ద్వారా అధిగమించింది.

* మూడు నెలల పాటు విశ్లేషణ
ఈ రోవర్‌ను పారాచూట్ నెమ్మదిగా అరుణ గ్రహం ఉపరితలం మీదకు దించిందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. జురాంగ్ రోవర్ మూడు నెలల పాటు అంగారకుడిపై ఫోటోలు తీసి భూమికి పంపనుంది. దీంతోపాటు అక్కడి భౌగోళిక పరిస్థితులను, దానికి సంబంధించిన డేటాను సేకరించనుంది. అంగారకుడిపై ల్యాండింగ్ ప్రక్రియను "సెవెన్ మినిట్స్ ఆఫ్ టెర్రర్" అని పిలుస్తారు. ఆ గ్రహం నుంచి రేడియో సిగ్నళ్లు భూమిని చేరడానికి ముందే ఈ ప్రక్రియ జరుగుతుంది. అంటే దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ డేటా పరిమితంగా ఉంటుంది.

అంగారక గ్రహంపై రోవర్లను ల్యాండ్ చేయడానికి గతంలో అమెరికా, రష్యా, యూరోపియన్ దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వీటిలో కొన్ని కూలిపోగా, మరికొన్ని సమాచారం లేకుండా గల్లంతయ్యాయి. ఈ ఫిబ్రవరిలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మొదటిసారి పర్సెవరెన్స్ రోవర్‌ను అంగారకుడిపై ల్యాండ్ చేయించి రికార్డు సాధించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల ఒక చిన్న హెలికాఫ్టర్‌ సైతం అంగారకుడిపై ఎగిరింది. ఇతర గ్రహాలపై ఎగిరిన మొట్టమొదటి విమానం కూడా ఇదే కావడం విశేషం. పర్సెవరెన్స్ రోవర్ మరికొన్ని రోజులు అక్కడ ప్రయోగాలు చేయనుంది.

కొత్త ప్రయోగాలతో దూకుడు
అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికా, రష్యా ముందున్నాయి. వివిధ దేశాలు స్పేస్‌లో నిర్మించిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో చైనాకు సభ్యత్వం లేదు. ఈ నేపథ్యంలో 2022 నాటికి ప్రత్యేకంగా కొత్త అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవాలని చైనా భావించింది. ప్రాజెక్టులో భాగంగా గత నెలలో ఒక రాకెట్‌ను లాంచ్ చేసింది. అక్కడి నుంచి మనుషులను చంద్రుడి పైకి పంపాలని డ్రాగన్ దేశం భావించింది.

https://twitter.com/MarsZhurong/status/1393365304433156100?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1393365304433156100%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.news18.com%2Fnews%2Fbuzz%2Fyou-have-arrived-chinas-probe-to-mars-touches-down-on-red-planet-in-historic-feat-3740006.html

కానీ ఈ ప్రాజెక్టులో కీలకమైన చైనీస్ లాంగ్ మార్చ్‌ 5 బి రాకెట్ గత వారం కూలిపోయింది. దాని శకలాలు హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. ఇది జరిగిన కొన్ని రోజులకే చైనా కొత్త ప్రయోగంతో సత్తా చాటడం విశేషం.
Published by:Krishna Adithya
First published:

అగ్ర కథనాలు