China warning video: న్యూక్లియర్ బాంబ్ వేస్తానన్న చైనా.. వైరల్‌గా మారిన వీడియో

ప్రతీకాత్మక చిత్రం

జిగువా అనే ఒక యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫాంలో అప్‌లోడ్ చేసిన 5 నిమిషాల నిడివిగల వార్నింగ్ వీడియో.. క్షణాల్లోనే వైరల్ అయ్యింది. అయితే కొద్ది నిమిషాలకే ఈ వీడియోని తొలగించారు.

  • Share this:
పొరుగుదేశాలతో కయ్యానికి కాలుదువ్వే చైనా ఇప్పుడు జపాన్‌తో వైరానికి దిగింది. తైవాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించింది. అయితే జపాన్‌పై అణుబాంబు దాడి చేస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ బెదిరిస్తున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని మొదట కమ్యూనిస్టు పార్టీ అధికారిక ఛానల్ ప్రసారం చేయడం గమనార్హం. జిగువా అనే ఒక యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫాంలో అప్‌లోడ్ చేసిన 5 నిమిషాల నిడివిగల వార్నింగ్ వీడియో.. క్షణాల్లోనే వైరల్ అయ్యింది. అయితే కొద్ది నిమిషాలకే ఈ వీడియోని తొలగించారు. కానీ అప్పటికే చాలామంది దీన్ని డౌన్‌లోడ్ చేసి ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో షేర్ చేశారు.

‘‘తైవాన్‌ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే జపాన్‌పై మేము అణుబాంబులు వేస్తాం. రెండో సారి బేషరతుగా లొంగిపోయామని జపాన్ మమ్మల్ని వేడుకునే దాకా‌ బాంబులు వేస్తూనే ఉంటాం. మేము తైవాన్‌ను విముక్తి చేసే సమయంలో.. జపాన్ జోక్యం చేసుకుంటే తిరిగి యుద్ధం చేస్తాం. తైవాన్‌ సరిహద్దుల్లో జపాన్‌కు చెందిన ఒక్క సైనికుడు, ఒక్క విమానం, ఒక ఓడ కనిపించినా.. మేము ఆ దేశంపై భీకరమైన యుద్ధాన్ని ప్రకటిస్తాం. కావాలంటే ఒక సారి జోక్యం చేసుకొని చూడండి" అని వైరల్ అయిన వీడియోలో ఉంది. మొత్తానికి చైనా.. జపాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్టు కనిపించింది.

‘యుద్ధాన్ని భరించే జపాన్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాం. యుద్ధం చేసేంత స్థోమత లేదని జపాన్ తెలుసుకునేంత వరకు ఎదురుదెబ్బ తీస్తూనే ఉంటాం. అప్పుడు జపాన్ తైవాన్ జలసంధికి దళాలను పంపించడానికి కూడా ధైర్యం చేయదు’ అని వైరల్ వీడియోలో ఉంది. చైనా 1964 నుంచి అణుబాంబుల ప్రయోగం విషయంలో నో-ఫస్ట్-యూస్ అనే పాలసీని పాటిస్తూ వస్తోంది. కానీ జపాన్ విషయంలో తాము ఎటువంటి విధానాలను పాటించబోమని.. మొదట తామే అణు బాంబులు వేస్తామని హెచ్చరించింది.

చైనా-జపాన్ దేశాల మధ్య యుద్ధాలు జరిగిన సమయంలో చైనాపై జపాన్ సైనికులు చేసిన దారుణాల గురించి కూడా వార్నింగ్ వీడియోలో ప్రస్తావించినట్టు తైవాన్ వార్తా సంస్థలు వెల్లడించాయి. జపాన్‌ తప్పకుండా తైవాన్‌ సార్వభౌమత్వాన్ని కాపాడాలని ఆ దేశ డిప్యూటీ పీఎం తారో అసో ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు చేసిన రెండు వారాల తర్వాత చైనా నుంచి బెదిరింపుల వీడియో బయటకు వచ్చిందని జపనీస్ వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే 24 మిలియన్ల ప్రజలున్న తైవాన్‌పై సంపూర్ణ సార్వభౌమాధికారం తనకే ఉందని బీజింగ్ చెబుతోంది.
Published by:Krishna Adithya
First published: