Home /News /international /

CHINA SUPPLIES FAULTY MILITARY EXPORTS TO 53 FRIENDLY NATIONS AK GH

China: చైనా చిల్లర బుద్ధి.. మోసపోయిన పాకిస్థాన్, ఇతర దేశాలు

జిన్ పింగ్ (ఫైల్ ఫోటో)

జిన్ పింగ్ (ఫైల్ ఫోటో)

నాణ్యత సరిగ్గా లేని, నాసిరకం ఆయుధ సామగ్రిని తయారు చేసి, లాభాలు మూటకట్టుకునే లక్ష్యంతో వీటిని తనతో సన్నిహితంగా మెలిగే దేశాలకే అంటగట్ట చేతులు దులుపుకున్న చైనా ఇప్పుడు రక్షణ రంగంలో కట్టుకున్న అపఖ్యాతితో ప్రపంచ వేదికపై నవ్వులపాలవుతోంది.

ఇంకా చదవండి ...
వివాదాలు, సంచలనాలకు కేరాఫ్ గా మారిన చైనా ఇప్పుడు మరో అతిపెద్ద వివాదంలో చిక్కుకుంది. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆయుధాలు ఎగుమతి చేసే దేశంగా ఉన్న చైనా ఇప్పుడు ఏకంగా తన మిత్ర దేశాలకే నాసిరకం రక్షణ పరికరాలు ఎగుమతి (Chinese arms exports) చేసి ఆయా దేశాలను చిక్కుల్లోకి నెట్టింది. సరిగ్గా పనిచేయని, లోపాలున్న రక్షణ రంగ సామగ్రిని (defence equipment) తన మిత్ర దేశాలకు చైనా ఎలా అంటగట్టిందనే విషయం చాలా ఆలస్యంగా బయటకి రావడం విశేషం.

నాసిరకానికి కేరాఫ్
చైనా ఉత్పత్తులంటేనే నాసిరకానికి (faulty) మారు పేరు. అలాంటి చైనాలో తయారైన మాస్కులు, పీపీఈ కిట్లు కూడా అధ్వానంగా ఉన్నాయనే ఆరోపణలు మనమంతా మరవకముందే పలు అంతర్జాతీయ కుంభకోణాలకు చైనా పాల్పడింది.

లాభాల కోసం
రష్యాకు ప్రత్యామ్నాయ దేశం రక్షణ రంగ పరికరాలు తయారు చేయడంలో చైనాకు అపార అనుభవం ఉండటంతో పాటు ఇందుకు సరిపోయే మౌలిక సదుపాయాల కల్పనలో చైనా మిగతా దేశాలకంటే ముందుంది. కానీ నాణ్యత సరిగ్గా లేని, నాసిరకం ఆయుధ సామగ్రిని తయారు చేసి, లాభాలు మూటకట్టుకునే లక్ష్యంతో వీటిని తనతో సన్నిహితంగా మెలిగే దేశాలకే అంటగట్ట చేతులు దులుపుకున్న చైనా ఇప్పుడు రక్షణ రంగంలో కట్టుకున్న అపఖ్యాతితో ప్రపంచ వేదికపై నవ్వులపాలవుతోంది. పాకిస్థాన్ కూడా ఈ లిస్టులో ఉండగా ఇప్పుడు పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.

53 దేశాలకు ఎగుమతి
రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధ సంపత్తి మొదలు పలు రకాల సామగ్రిని ఉత్పత్తి చేసి, వాటిని విదేశాల్లో మార్కెటింగ్ (marketing) చేయడంలో చాంపియన్ అయిన చైనా 2010-14 మధ్య కాలంలో ప్రపంచంలోని 40 దేశాలకు వీటిని ఎగుమతి చేసేది. 2015-19 వచ్చేసరికి ఏకంగా 53 దేశాలకు వీటిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఇలా చైనా నుంచి దిగుమతి చేసుకునే మొట్టమొదటిది అతిపెద్ద కస్టమర్ పాకిస్థాన్. 2015-19 మధ్య కాలంలో చైనా నుంచి ఏకంగా 35శాతం రక్షణ సామగ్రిని దాయాది దేశం దిగుమతి చేసుకుంది. పాక్-చైనా మధ్య ఎంత దృఢమైన సంబంధాలున్నప్పటికీ 'వంగ తోటలో మామ'లా ఇప్పుడు చైనా ప్రవర్తించడం పాక్ కు మింగుడు పడటం లేదు.

కాలం చెల్లిన, పనికిరాని చైనా రక్షణ పరికరాలకు పాక్ ఇప్పుడు కేవలం ఓ డంపింగ్ యార్డ్ (dumping yard) మాత్రమే. నావికా దళానికి చెందిన ఉత్పత్తులు కూడా చైనా వెనక్కి తీసుకునేందుకు అంగీకరించకపోవడంతో పాక్ ఇప్పుడు టర్కీ (Turkey) నుంచి దిగుమతులు చేసుకుంటోంది. పాక్ కొనుగోలు చేసిన 9 చైనా రాడార్లలో (China radars) మూడు అస్సలు పనిచేయకపోగా, మిగతా వాటిలో ఎన్నో లొసులుగులుండడంతో లబోదిబో మనడం తప్ప దాయాది దేశం ఏమీ చేయలేని స్థితిలో ఉంది.

బంగ్లాదేశ్
మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కూడా చైనా కస్టమరే. 2017లో మింగ్ క్లాస్ టైప్ 035G సబ్ మెరీన్లను (sub marines) 100 మిలియన్ డాలర్లు పోసి చైనా నుంచి కొన్న బంగ్లాదేశ్ ఆతరువాత తాము నిండా మునిగినట్టు తెలుసుకుంది. బంగ్లా నావికాదళం శిక్షణ కోసం వీటిని కొనుగోలు చేయగా మూడేళ్లు కూడా తిరక్కముందే ఇవి దేనికీ కొరగాకుండా మిగిలిపోయాయి. ఉపయోగించుకోలేని స్థితిలో మిగిలిపోయిన ఈ జలాంతర్గాములను అలాగే వదిలేశారు.

అంతకు ముందు 2003లో చైనా నుంచి కొన్న ఇలాంటి సబ్ మెరీన్ సాంకేతిక లోపాలతో నీట మునగగా అందులో విధులు నిర్వహిస్తున్న 70 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. ఇక ఇటీవలే చైనీస్ 053H3 ఫ్రిగేట్స్ (Frigates ) కష్టనష్టాలకు ఓర్చుకుని బంగ్లాదేశ్ లోని మోంగ్లా తీరం చేరుకుంది. ఇందులో పనిచేయని నావిగేషన్ రాడార్, గన్ సిస్టం కూడా ఉండడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ నెత్తిన గుడ్డ వేసుకుంది. పోనీలే వీటిని కనీసం రిపేరి చేసి ఇస్తారేమో అని అడిగితే రిపేరీ ఖర్చుల పేరుతో అదనపు భారాన్ని మోపేందుకు చైనా పెద్ద బిల్లు పంపడంతో బంగ్లాదేశ్ షాక్ లో ఉంది.

మన వైపు చూస్తున్న మయన్మార్
చైనా రక్షణ రంగ దిగుమతులతో అసంతృప్తిలో ఉన్న మయన్మార్ ప్రభుత్వం ఇప్పుడు మనవంక చూస్తోంది. మరోవైపు మయన్మార్ లో అలజడి సృష్టిస్తున్న అరాకన్ ఆర్మీ (Arakan Army ) మిలిటంట్ గ్రూప్ కు అత్యాధునికి ఆయుధాలను చైనా సరఫరా చేయడం అక్కడి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెస్తోంది. 'చైనా యంత్రం ఒక్క రోజులో ముక్కలైం'దన్న నానుడి ఇప్పుడు మయాన్మార్ లో అత్యంత పాపులర్ డైలాగ్ గా మారిందంటే చైనా ఉత్పత్తులు ఎంత దరిద్రంగా ఉన్నాయో అర్థమవుతుంది.

నేపాల్
ఇటీవల మనకు పక్కలో బల్లెంలా తయారవుతున్న నేపాల్కు చైనా ఇలాంటి ఝలకే ఇచ్చింది. నాణ్యత బాగాలేదంటూ బంగ్లాదేశ్ తిప్పిపంపిన MA60 ఎయిర్ క్రాఫ్ట్ ను నేపాల్ జాతీయ విమాన సంస్థ కొనుగోలు చేసింది. ఇవి ఇప్పుడు కనీసం ఎగరలేక అలాగే ఎయిర్ పోర్టులో పడి ఉన్నాయి. చైనాలో తయారైన ఈ విమానాలు నేపాల్ పర్వత ప్రాంతాల్లో ఎగిరేందుకు అనువుగా లేకపోగా, వీటి విడి భాగాలు దొరక్క నేపాల్ కొత్త సమస్యలు ఎదుర్కొంటోంది. వీటికి బదులు వేరే విమానాలు ఇవ్వాలన్న నేపాల్ విజ్ఞప్తిని చైనా ఇప్పటికే తిరస్కరించింది.

కెన్యా కూడా బాధితురాలే
చైనా ప్రభుత్వం ఉత్పత్తి చేసిన VN-4 నోరింకో వాహనాలను పరీక్షించే టెస్ట్ ఫైరింగ్ సమయంలో వాటిలో ప్రయాణించేందుకు సైతం చైనా వాణిజ్య ప్రతినిధి నిరాకరించాడు. అయినప్పటికీ సైనికులను చేరవేసే ఈ వాహనాలను 2016లో కొనుగోలు చేయగా వీటిని ఉపయోగిస్తున్న కెన్యా సైనికులు పదుల సంఖ్యలో పలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అందుకే వీటికి 'ఖడ్గమృగా'లని (Rhinoceros ) కెన్యాలో వ్యంగంగా పిలుస్తారు.

జోర్డాన్, అల్జీరియా
చైనా నుంచి యుద్ధ విమానాలు కొన్న జోర్డాన్, అల్జీరియా పరిస్థితి ఇంతకంటే దారుణం. చైనాలో తయారైన యుద్ధ విమానాలు పదేపదే ప్రమాదాలకు గురై పెద్ద సంఖ్యలో సైనికులు మృతి చెందారు. జోర్డాన్ లోనూ ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తుంటే వెంటనే తేరుకున్న ఆ దేశం వాటిని తెలివిగా అమ్మకానికి పెట్టింది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: China, China Products, Pakistan

తదుపరి వార్తలు